Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

మల్లయోధులకు పెరుగుతున్న మద్దతు

రాజు ఎక్కువా, మొండివాడు ఎక్కువా అన్న సంశయం వచ్చినప్పుడు మొండివాడే రాజు అయినప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ప్రజాస్వామ్యలక్షణాలు ఏ కోశానా లేవని గత తొమ్మిదేళ్లలో అడుగడుగునా రుజువు అవుతూనే ఉంది. ఆదివారం ఆయన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన తీరే ఆయనలో పెల్లుబుకుతున్న నిరంకుశత్వానికి ఉదాహరణ. రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కనీసం ఆ ప్రారంభోత్సవానికి మర్యాద కోసమైనా ఆహ్వానించలేదు. అధికార మర్యాదలలో వారు తనకన్నా ఉన్నత శ్రేణిలో ఉంటారు కనక పార్లమెంటు భవనం ప్రారంభ సమయంలో వారు ఉంటే తన ప్రభ ఎక్కడ మసకబారుతుందోనన్న భయం ఆయనను పీడిరచింది. అట్టహాసంగా పార్లమెంటుభవన ప్రారంభోత్సవ సంబరాలు జరుగుతున్న సమయంలోనే మహా పంచాయత్‌ నిర్వహించ డానికి పార్లమెంటు భవనం సమీపంలోకి చేరుకోవడానికి ప్రయత్నించిన మహిళా మల్లయోధులను పోలీసులు నడి రోడ్డు మీంచి ఈడ్చుకెళ్లారు. ఒకవేపు ప్రజాస్వామ్యానికి ‘‘దేవాలయం’’ లాంటి పార్లమెటు భవనం ఆవిష్కరణ జరుగు తుండగానే అక్కడికి అల్లంత దూరంలో మహిళా మల్లయోధులపై దాష్టీకం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. కానీ ఇలాంటి మనోభావాలను ప్రధానమంత్రి మోదీఎ న్నడూ లెక్కచేయరు. మల్ల యోధులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భారత మల్లయోధుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ శరణ్‌ పెద్దమనిషిగా నిలబడితే మల్ల యోధులు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసుల దృష్టిలో నేరస్థులై పోయారు. బ్రిజ్‌ భూషణ్‌ శ్వేత వస్త్రధారి అయి పార్లమెంటు ప్రారంభ సంబరాల్లో దర్జాగా తిరిగారు. సుప్రీంకోర్టు జోక్యంవల్ల ఆయన మీద రెండు ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలైనా మోదీ అండ ఉన్నందువల్ల ఆయన మీద నెలదాటినా ఈగైనా వాలలేదు. ఇందులో ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌. పోస్కో చట్టం కింద దాఖలైంది. ఎందుకంటే బ్రిజ్‌ భూషణ్‌ లైంగికంగా వేధించిన అమ్మాయిల్లో ఒకరు ఈడురాని వారు. ఈ చట్టం కింద ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలైతే 24 గంటలలోగా అరెస్టు చేయాలి. కానీ ఈ నిబంధన అధికారంలో ఉన్న వారి ఆశీస్సులున్న వారికి వర్తించదని తేలిపోయింది. అంటే అయినవారికి ఒక చట్టం, కాని వారికి మరో చట్టం ఉన్నట్టేగా! అదే మోదీ పరిపాలన విశిష్టత. మల్ల యోధుల మీద మాత్రం తక్షణం కేసులు నమోదు చేశారు. మల్ల యోధులను అరెస్టు చేయగానే పోలీసులు జంతర్‌ మంతర్‌లోని మల్ల యోధుల నిరసన శిబిరాన్ని ఏ ముక్కకు ఆ ముక్క విడగొట్టేశారు. అక్కడ తప్ప మరోచోట నిరసన తెలియ జేసుకోమన్నారు. అరెస్టుచేసిన మల్ల యోధులను రాత్రి పొద్దు పోయిన తరవాత విడుదల చేయడంవల్ల వారికి ఒరిగిందేమీ లేదు. రాజ్య వ్యవస్థ ఏలిన వారిని, గిట్టని వారిని వేధించడానికే ఉందని మోదీ ఏలుబడి నిరూపిస్తోంది. తమ మీద అత్యాచారం జరిగిందని మహిళలు ఫిర్యాదు చేసినప్పుడు చర్య తీసుకోవలసిన విభాగాలన్నీ మౌనంగా ఉండిపోతాయి. నిశ్చేష్టంగా నిలబడిపోతాయి. అత్యాచారాలకు గురైన వారిని ఆదుకో వలసిన బాధ్యత తమదేనని ఈ వ్యవస్థలకు గుర్తే రాదు. ఏలిన వారికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే తమ పరమ కర్తవ్యం అయినట్టు భావిస్తాయి. తదనుగుణంగా మాత్రమే నడుచుకుంటాయి. అందుకని తమ మీద జరిగిన అత్యాచారాల గురించి మహిళలు ఎంత గొంతెత్తి అరిచి గీపెట్టినా వినిపించుకునే నాథుడే ఉండడు. సర్వత్రా నిరా కరణ, నిశ్శబ్దవాతావరణం అలుముకుంది. పైగా బాధితులనే వేధిస్తుంటారు. ఒక్కొక్కసారి బాధితులమీద పరువునష్టం కేసులూ మోపుతారు.
ప్రభుత్వం ఇంతగా బండబారిపోయి నప్పుడు మహిళామల్ల యోధులు చేయగలిగింది కూడా ఏమీ మిగలలేదు. అందుకే వారు ఆసియా క్రీడోత్సవాలు, ఒలింపిక్‌ క్రీడల్లో సాధించిన పతకాలను హరిద్వార్‌లో గంగలో కలుపుదామనుకుని తర్వాత విరమించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి దక్కినవి కేవలం 61 పతకాలే. పతకాలు సాధించిన వారు దేశ గౌరవాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. అక్కడితో వారి కథ ముగిసింది. అందుకే వారు ఈ పతకాలను త్యజించాలనుకుంటున్నారు. దీనివల్లా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే మోదీ ప్రభుత్వానికి ఇలాంటి మనోభావాలు ఏమీ లేవు. తమ మీద అత్యాచారం జరిగిందనో, లైంగిక వేధింపులకు గురయ్యామనో మహిళలు బాహాటంగా ఫిర్యాదు చేయడం సామాన్యమైన విషయం కాదు. పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు ఆ పని చేయడం మరింత కష్టం. కానీ తమ ఫిర్యాదులను పట్టించుకునే వారెవరూ కనిపించకపోవడంతో వారు ఈ విషయం బయట పెట్టవలసి వచ్చింది. అప్పుడూ ఫలితం లేకపోతే నడి రోడ్డు మీద నిరసనకు దిగవలసి వచ్చింది. మల్ల యోధులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారికి వృత్తి పరంగా భవిష్యత్తులో ఏ అవకాశాలు ఉండవు. వారిని ప్రోత్సహించే వారు ఉండరు. మహా అయితే వారి ధైర్య సాహసాలను మెచ్చుకునే వారు ఉండొచ్చు. ఈ మల్ల యోధుల పోరాటం కేవలం వారికి సంబంధించింది మాత్రమే కాదు. మొత్తం మహిళా లోకానికి, వారి హక్కులకు సంబంధించింది. సమాజం ఈ అంశాన్ని ఆలస్యంగా గుర్తించి ఉండవచ్చు. కానీ వివిధ రంగాల వారు, రాజకీయ పక్షాలు కూడా మల్ల యోధుల పోరాటానికి బాసటగా నిలిచాయి. అయితే ఒక్క లోపం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇతర క్రీడా రంగాల వారి మద్దతు, సానుభూతి వ్యక్తమైన దాఖలాలు మాత్రం లేవు. ముఖ్యంగా క్రికెట్‌ క్రీడాకారులకు చీమ కుట్టినట్టయినా లేదు. అనేక క్రీడలు కేవలం డబ్బుకు పరిమితం అయిపోయినప్పుడు కాసుల గలగల ముందు తోటి క్రీడాకారుల ఆత్మఘోషలు ఎక్కడ వినిపిస్తాయి? ప్రతి సంస్థలోనూ మహిళలపై అత్యాచార ఫిర్యాదులను పరిశీలించి, నివారించడానికి కమిటీలు ఉండాలి. కానీ ఆ కమిటీలు 50 శాతం చోట్ల కూడా లేవు. ఉన్న చోట్ల కూడా మల్ల యోధులను సమర్థించిన దాఖలాలు లేవు. పైగా రోడ్డెక్కి పోరాడాల్సింది కాదు అని ఉచిత సలహాలు చెప్పిన అగ్రశ్రేణి క్రీడాకారులే కనిపించారు. క్రీడా సంస్థల అధిపతులే నిందితులు అయినప్పుడు ఆ సంస్థలు మల్ల యోధుల ఆందోళనకు చలిస్తాయనుకోవడం దండగ. మల్ల యోధులు పతకాలను గంగలో కలిపితే అది ఒక్క రోజు సంచలనం కలిగించే వార్త కావొచ్చు. ఆ తరవాత షరా మామూలే. సాహిత్యకారులు అవార్డులను తిరస్కరించినప్పుడు అంతకన్నా జరిగిందేమీ లేదుగా. ఇలా అవార్డులో, పతకాలో వాపసు చేస్తేనో, గంగలో కలిపితేనో సిగ్గుపడే పరిస్థితి ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగే ఆ సంస్థలకు ఉండదుగా! ఆమరణదీక్ష సంకల్పం చేసినప్పటికీ ప్రస్తుతానికి విరమించుకుని పోరాట రూపాన్ని నిర్ణయించాలని తలపెట్టారు. మల్లయోధులకు మద్దతు పెరుగుతుండగా, వారికి అండగా రైతులు సమ్మెకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img