Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

గుణపాఠాలు నేర్చుకోని రాజకీయ పార్టీలు

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. అయితే ఇదే సానుకూల అర్థంలో చెప్పే మాట కాదు. కాంగ్రెస్‌ లో నిరంతరం కొనసాగే కుమ్ములాటలు, ముఠాతగాదాలను మర్యాదకర భాషలోనే అయినా నిందాత్మకంగా చెప్పడానికి ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఈ కుమ్ములాటలవల్ల అనేక సార్లు కాంగ్రెస్‌ తన నోటి దగ్గరకు వచ్చిన ముద్దను తానే తొలగదోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి రాజస్థాన్‌ శాసనసభకు ఎన్నికలు జరగవల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌్‌, యువకుడుగా పరిగణనలోకి వచ్చే సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలెట్‌ మధ్య ఎంత మాత్రం పొంతన కుదరడం లేదు. అశోక్‌ గెహ్లోత్‌ అనుభవజ్ఞుడన్న మాట వాస్తవమే. కానీ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయానికి పి.సి.సి. అధ్యక్షుడిగా ఉన్న సచిన్‌ పైలెట్‌ కృషి కాదనలేనిది. ఇద్దరో ముగ్గురో ప్రధానమైన నాయకులున్నప్పుడు అధికారం దక్కిన తరుణంలో సమన్వయం సాధించే పద్ధతి 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఇంతవరకు అలవడనే లేదు. ఎన్నికలలో ఘర్షణ పడుతున్న నాయకుల మధ్య ఏదో రకంగా తగువు తీర్చి అప్పటికి ఆ గండం గట్టెక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత మళ్లీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కడం కాంగ్రెస్‌ రాజకీయాల్లో రివాజు. అధిష్ఠానం మాటను సుగ్రీవాజ్ఞలా పాటించే పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్‌లో లేదు. పైగా కాంగ్రెస్‌లో అధిష్ఠానం ముక్కాలి పీటలా తయారైంది. అందువల్ల అసమ్మతి సమసిపోయేట్టు చేయడం సాధ్యం కావడం లేదు. అధికార పంపిణీ పీటముళ్లు పడుతూనే ఉంది. తన కోర్కెలు ఈ నెల 30వ తేదీ (మంగళవారం) లోగా తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తానని సచిన్‌ పైలెట్‌ హెచ్చరిస్తున్నారు. అటు బీజేపీలో పరిస్థితీ ఇలాగే ఉంది. మరో ఆరునెలల్లోగా ఎన్నికలు జరగవలసి ఉన్నందున కుమ్ములాడుకుంటున్న వర్గాల మధ్య సంయమనం సాధించడానికి కాంగ్రెస్‌, బీజేపీ ఎంత ప్రయత్నించినా పరిస్థితి మెరుగు అవుతున్న దాఖలాలు లేవు. అయితే కాంగ్రెస్‌లో కానీ, బీజేపీలో కానీ ఈ కుమ్ములాటలు పార్టీలోనే ఉన్నట్టు కనిపించినా వాస్తవం మాత్రం అవి నాయకుల మధ్య పొసగకపోవడం, ఎవరూ తమ పట్టుదలను, అహంకారాన్ని వదలకపోవడంవల్లే రెండు పార్టీల్లోనూ రెండు పారావారాలు కనిపిస్తున్నాయి. ఓటర్లు పార్టీ విధానాన్నిబట్టి ఓటు వేస్తారని తెలిసినా పరస్పరం కలహించుకుంటున్న ముఠాలు మాత్రం తమ మాటే నెగ్గాలనుకుంటున్నాయి. ఈ ముఠా తగాదాలు మరీ మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. ప్రజలు ఈసడిరచుకుని ప్రత్యర్థి పార్టీ మెడలో వరమాల వేస్తారు. అంటే ముఠా కలహాలవల్ల ఎదురవుతున్న విజయాన్ని కాలదన్నడమే. దూరం నుంచి ఈ తగాదాలను చూసే వారికి మాత్రం బోలెడు వినోదం, ఆనందం ఉచితం. విచిత్రం ఏమిటంటే ఈ ముఠా తగాదాల అంతిమ లక్ష్యం ఏమైనా ఒక వర్గం కంటే మరో వర్గం తమ పంథానే సరైనదని చెప్పుకోవడానికి ప్రయత్నించడమే. వసుంధరా రాజే సింధియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలెట్‌ వర్గం తన పార్టీకే చెందిన గెహ్లోత్‌ మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. మరి మరో వర్గం నాయకుడైన గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ సహకార సంఘ కుంభ కోణం మాటేమిటి అని గెహ్లాత్‌ వర్గం ఎదురు ప్రశ్న వేస్తుంది.
రెండుపార్టీలలోనూ ముఠా కలహాలు భలే వినోదాత్మకంగా ఉన్నాయి. కాంగ్రెస్‌లోని రెండు పక్షాలు బీజేపీలోని చెరో పక్షంపై ఆరోపణలు చేస్తాయి. అంటే కాంగ్రెస్‌ లోని రెండు పక్షాలూ బీజేపీలోని ఏదో ఒక పక్షాన్ని వెనకేసుకు వస్తున్నాయన్న మాట. ఉదాహరణకు గత ఏడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి గెహ్లోత్‌్‌ మీద సచిన్‌ పైలెట్‌ పితూరీ లేవదీస్తే బీజేపీ నాయకుడు గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ సచిన్‌ పైలెట్‌ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారని గెహ్ల్లాత్‌ ఆరోపించారు. గెహ్లోత్‌ అక్కడితో ఆగకుండా వసుంధరా రాజే సింధియాను పొగడ్తలతో ముంచెత్తారు. సచిన్‌ తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వం నిలబడడానికి ఆమె సహకారమే ఉపకరించిందని గెహ్లోత్‌్‌ అన్నారు. అయితే వసుంధరారాజె మద్దతుదార్లు ఈ వాదనను ఖండిరచారు. అది రాజకీయ ఎత్తుగడ కావచ్చు. బీజేపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. బీజేపీలోని షెఖావత్‌ వర్గం, కాంగ్రెస్‌లోని సచిన్‌ పైలెట్‌ వర్గం తమ తమ పార్టీల్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో గెహ్లోత్‌ వర్గానిది, బీజేపీలో వసుంధరా రాజే సింధియా వర్గానిది పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు వర్గాలు కూడా తమ ప్రత్యర్థి వర్గంలో తమకు అనువైన వర్గాన్ని వెనకేసుకొస్తుంటాయి. 2003 నుంచి రాజస్థాన్‌లో ఒకసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం రివాజుగా మారింది. 2018లో బీజేపీ పార్టీ నాయకత్వాన్ని మార్చాలనుకుంది. కానీ వసుంధరా రాజే తిరగబడ్తానని బెదిరించడంతో ఆమె నాయకత్వంలోనే పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. నాయకత్వం కలిసికట్టుగా పనిచేయాలని రెండు పార్టీల అగ్రనాయకులు హితవచనాలు పలుకుతూనే ఉంటారు. కానీ నిర్దేశించిన ఆ ఐకమత్యం రెండు పార్టీలలోనూ కనిపించదు. బీజేపీ అయితే రాజస్థాన్‌ విభాగం అధ్యక్షుడిని, శాసనసభా పక్షం నాయకుడిని కూడా మార్చేసింది. అయినా పార్టీలో ఐక్యత మాత్రం సాధించలేక పోయింది. ఏడాది చివరన జరిగే ఎన్నికల్లో వసుంధరా రాజే సింధియాకు అగ్రాసనం వేయకపోతే ఆమె తిరగబడడం ఖాయం. పైగా జనం శాసనసభ ఎన్నికల్లో ఒక రకంగా లోకసభ ఎన్నికల్లో మరో రకంగా వోటు వేస్తున్నారు. 2018లొ బీజేపీ తరఫున 73 మంది శాసనసభ్యులే గెలిచినా 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్‌ లోని 25 స్థానాల్లో బీజేపీకి 24 దక్కాయి. శాసనసభ ఎన్నికల్లో అధికారం సంపాదించిన కాంగ్రెస్‌ ఆ తరవాత ఏడాది తిరగకముందు జరిగిన లోకసభ ఎన్నికల్లో ఒక్క స్థానంతోనే సంతృప్తి పడవలసి వచ్చింది. లోకసభ ఎన్నికలలో హిందుత్వ రాజకీయాలు బీజేపీకి ఉపకరించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నట్టు లేదు. అదీ గాక కర్నాటక శాసనసభ ఎన్నికలలో ఓటమివల్ల మోదీ ప్రభ కూడా తగ్గింది. ముఖ్యమంత్రి గెహ్లోత్‌ ఇటీవలే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇది ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతోంది. రాజస్థాన్‌లో సచిన్‌ పైలెట్‌ ముఖ్యమైన నాయకుడే అయినా ఆయనకు మద్దతుగా నిలిచింది కేవలం 15 మంది ఎమ్మెల్యేలే. అధిష్ఠానం జోక్యంతో ముఠా కుమ్ములాటలు ఏదో ఒక మేరకు సమసి పోవచ్చు. అది సాధ్యం అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం కాంగ్రెస్‌నే వరిస్తుంది. 2024లో సగం లోకసభ సీట్లూ దక్కవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img