Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

వైసీపీలో కలవరం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి చెందిన కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పార్టీకి దూరమయ్యారు. 2019లో వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో కొందరు పార్టీని వీడారు. వారంతా ఈ దఫా తిరుగుబాటు బావుటా ఎగురేస్తున్నారు. చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోయినప్పటికీ, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మాత్రం ఆధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ చెంతకు చేరారు. మరి కొందరు ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన నుంచి పోటీలోకి వెళ్లారు. ఇది వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది. వైసీపీలో సీట్ల మార్పులు, చేర్పుల కారణంగా టికెట్లు దక్కని వారంతా అసమ్మతితో పార్టీ వీడారు.
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల నాయకత్వంలో ముగ్గురు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం చర్చానీయాంశంగా మారింది. చిత్తూరుజిల్లా పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ చెంతన చేరారు. ఇప్పుడు ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఎం.సునీల్‌కుమార్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పి.గన్నవరం (ఎస్సీ) వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడి, అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నందికొట్కూరు (ఎస్సీ) వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తొరుగు ఆర్థర్‌ వైసీపీకి రాజీనామా చేసి, ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. శ్రీకాకుళంజిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ ఎన్నికల్లో టెక్కలి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె పోటీకి దిగడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి దిగారు. వైసీపీ బలోపేతం కోసం ఎంతో కృషిచేసిన వారిని ఖాతరు చేయకుండా, టికెట్లు కేటాయించడంతో నేతలు కాంగ్రెస్‌ చెంతన చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి వచ్చారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా పామర్రు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.
ఎన్డీఏ కూటమిలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ, జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. తిరుపతి జిల్లా సత్యవేడు(ఎస్సీ) నియోజకవర్గ వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసి, పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు టికెట్‌ను నిరాకరించారు. దీంతో మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్‌ గెలుపు ఆసక్తిగా మారింది. నెల్లూరుజిల్లా వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆ పార్టీని వీడి ఈ ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన నెల్లూరు రూరల్‌ వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి…అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలిలో నిలిచారు. పెనమలూరు అసెంబ్లీ వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఏలూరుజిల్లా నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. అనంతపురంజిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరామ్‌ పోటీ చేస్తున్నారు. ఈయన వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. మంత్రిగా ఉన్న జయరామ్‌ను ఎంపీ అభ్యర్థిగా ఆధిష్ఠానం ప్రకటించింది. అందుకు ఆయన నిరాకరించి, తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పడం, అందుకు ఆధిష్ఠానం నిరాకరించడంతో జయరామ్‌ పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో టీడీపీలో చేరి గుంతకల్లు అసెంబ్లీ నుంచి పోటీకి దిగారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా విశాఖ దక్షిణం నుంచి పోటీలో ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు తిరిగి టికెట్‌ దక్కకపోవడంతో ఆయన పార్టీ వీడారు. చిత్తూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. ఈ తరహాగా వైసీపీ నుంచి ముఖ్యనేతలు కాంగ్రెస్‌, టీడీపీ, జనసేనకు దగ్గరవ్వడం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
` విశాలాంధ్ర బ్యూరో-అమరావతి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img