Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రాష్ట్రాలు శత్రుదేశాలా!

సోమవారం నాడు అసోం, మిజోరం రాష్ట్రాల భద్రతాదళాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి ఏడుగురి మృతికి దారి తీయడం మొత్తం ఈశాన్య రాష్ట్రాల సమస్య ఇప్పటికీ సంపూర్ణంగా పరిష్కారం కాకపోవడానికి సంకేతం. రాష్ట్రాలు శత్రు శిబిరాలుగా మారడం దారుణమైన పరిస్థితి. తాజా ఘర్షణలు అసోం, మిజోరం రాష్ట్రాల మధ్యే అయి ఉండొచ్చు. కానీ మేఘాలయ, నాగాలాండ్‌తో కూడా అసోంకు ఉన్న సరిహద్దు తగాదాలు కొలిక్కి రానే లేదు. అసోంలోని బరాక్‌ లోయలో మిజోతో ఉన్న సరిహద్దు ప్రాంతంలో మిజోరం ‘‘ఆక్రమణల’’ను నిరోధించడానికి ప్రయత్నించినప్పుడు రెండు రాష్ట్రాల భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రక్షిత అటవీ ప్రాంతంలోని భాగాలలోకి చొరబడడమే కాకుండా అక్కడ రోడ్ల నిర్మాణం వంటి కార్యకలాపాలు కూడా చేపడ్తోందన్నది అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ఫిర్యాదు. ఈ ఘర్షణలకు రాజకీయాలు కారణం కాదని కూడా ఆయన అంటున్నారు. మిజోలు దొంగచాటుగా, అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా చొరబడి తమ రక్షిత అటవీ ప్రాంతాలను కబళిస్తున్నారని అసోం ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య 165 కిలో మీటర్ల మేర సరిహద్దు ఉంది. 1875లో అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిష్‌ వలస వాదులు లూషాయ్‌ కొండ ప్రాంతాలను, అసోంలోని కచార్‌ మైదాన ప్రాంతాలను విడదీశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగాలంటే అంతర్గత పరిమితుల అవసరం కూడా ఉండేది. 1972లో లూషాయ్‌ కొండ ప్రాంతాలను అసోం నుంచి పూర్తిగా విడగొట్టి దాన్ని కేంద్ర పాలన కిందకు తెచ్చారు. ఆ లూషాయ్‌ కొండ ప్రాంతమే దాదాపుగా ఇప్పుడున్న మిజోరం. 1987లో మిజోరం ప్రత్యేక రాష్ట్రమైంది. రాష్ట్ర ప్రతిపత్తి కోసం మిజోలో తీవ్ర స్థాయి పోరాటాలు జరిగాయి. సాయుధ ఘర్షణలు జరిగిన సందర్భాలు కొల్లలు. 1995లో మొట్టమొదటిసారి కచార్‌ జిల్లాలో బెంగాలీ మాట్లాడే ప్రజలకు మిజోలకు మధ్య ఘర్షణలు జరిగాయి. 1875 నాటి విభజన ప్రకారం అది తమకే చెందుతున్నదని మిజో వాదన. తమ ప్రజలను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా మిజో ప్రభుత్వం ప్రోత్సహించింది. కచార్‌లో అసోంకు చెందిన తమ భూభాగంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి రెండు పక్షాల మధ్య ఘర్షణలు జరిగి దాదాపు 50 మంది గాయపడ్డారు. అంతే కాకుండా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో గతంలో అసోం, నాగాలాండ్‌ వాసులకు మధ్య కూడ భీకర పోరాటాలే జరిగాయి. 1975లో సాయుధ నాగాలు పోలీసుల దన్నుతో అసోం సరిహద్దులోని అనేక గ్రామాలపై విరుచుకుపడ్డారు. అసోంలోని గోలాఘాట్‌ జిల్లాలో ఈ ఘర్షణలు జరిగాయి. ఇవి ఎంత ఘోరమైన ఘర్షణలంటే 54 మంది అసోం ప్రజల మరణానికి దారి తీశాయి. అక్కడితో ఆగకుండా 23,500 మంది నిర్వాసితులై పోయారు. నిర్వాసితుల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది. 1985లో నాగాలు అదే గోలాఘాట్‌ జిల్లాలోని మేరాపాని వద్ద చేసిన దాడిలో 41 మంది మరణించారు. ఆ తరవాత 2014 ఆగస్టులో గోలాఘాట్‌ జిల్లాలోని ఉరియంఘాట్‌లో కూడా ఘర్షణలు జరిగాయి. అప్పుడూ దాదాపు డజను మంది అసోమీలు మృతి చెందారు. ఈ పరిణామంతో వేలాది మంది ఇల్లూ వాకిలీ వదిలి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు ఈ దాడులన్నీ ఏకపక్షమైనవే. బాధితులు ఎప్పుడూ అసోమీలే. 1971లో కేంద్ర ప్రభుత్వం సుందరం కమిషన్‌ ఏర్పాటు చేసి అసోం-నాగా సరిహద్దులో పదే పదే తలెత్తుతున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. భారీసంఖ్యలో పోలీసు బలగాలను కూడా నియోగించింది. అయినా సాయుధ ఘర్షణలు కొనసాగాయి. అసోం మరింత భారీ సంఖ్యలో పోలీసులను నియోగించి, పోలీసు పోస్టులు ఏర్పాటు చేస్తే తప్ప పరిస్థితి సాపేక్షికంగా కుదుటపడలేదు.
ఇంకో వేపు దక్షిణం వేపున ప్రసిద్ధమైన కామాఖ్య దేవాలయం దాకా ఉన్న ప్రాంతం తమదేనని మేఘాలయ పితూరీ లేవదీసింది. అయితే ఇవి కలహాలే తప్ప సాయుధ ఘర్షణలు కాకపోవడం కొంత మేరకు ఉపశమనం కలిగింది. స్వాతంత్య్రానంతరం క్రమక్రమంగా అసోం తమ భూభాగాలను కోల్పోవలసి వచ్చింది. అక్కడ మిగిలిన గిరిజన ప్రాతాలు కర్బీ అంగ్లాంగ్‌, ఉత్తర కచార్‌ పర్వత ప్రాంతాలు మాత్రమే. 1963 నుంచి అసోంలోని కొండ ప్రాంతాలను లాగేస్తూనే వచ్చారు. ఖాసీ పర్వత ప్రాంతాలను, గారో కొండ ప్రాంతాలను విడిదీసి కొంతకాలం ఉప రాష్ట్రంగా ఉంచారు. ఆ మరుసటి సంవత్సరమే అది మేఘాలయ రాష్ట్రంగా అవతరించింది. అదే సంవత్సరం లూషాయ్‌ పర్వత ప్రాంతాలను విడదీసి మిజోరం కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు అయింది. 1987నాటికి మిజోరాంకు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి వచ్చింది. అయినా మిజోలు అనువైనప్పుడల్లా అసోం భూభాగాలపై దాడులు చేస్తూనే వచ్చారు. ఇటీవల ఘర్షణలు, రక్తపాతం ఆ దాడుల కొనసాగింపే. క్రమేణా అసోం అపారమైన భూభాగాన్ని కోల్పోవలసి వచ్చింది. అసోం కుంచించుకుపోతూ కొత్త రాష్ట్రాలు అవతరించాయి.
మామూలు పరిభాషలో ఈశాన్య ప్రాంతాలన్నింటినీ ఒకే గాటన కట్టి చూస్తాం. కానీ అక్కడా బహుళత్వానికి కొదవ లేదు. మన పొరుగున ఉన్న రెండు ముఖ్యమైన దేశాల మధ్య సరిహద్దు తగాదాలు పరిష్కారం కాలేదు. కేవలం భూభాగాల కోసమే కాకుండా ఇతర విద్రోహ చర్యల కారణంగా యుద్ధాలూ జరిగాయి. సంప్రదింపులు మినహా యుద్ధాలు ఎన్నడూ ఏ సమస్యనూ పరిష్కరించలేదు. ఇది చరిత్ర నేర్పిన గుణపాఠం. ఈ యుద్ధాల్లో ఏదో ఒక పక్షం విజయం సాధించినట్టు కనిపించిన సందర్భాలూ ఉండవచ్చు. మౌలిక సమస్య పరిష్కారం కానప్పుడు ఘర్షణలో, విభేదాలో తలెత్తుతూనే ఉన్నాయి. పొరుగు దేశాలతో ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దానికి భౌగోళిక రాజకీయాలూ కారణం కావచ్చు. కానీ అంతర్రాష్ట్ర సరిహద్దు తగాదాలు పరిష్కరించలేక పోవడం కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమో, నిరాసక్తతో కారణం. రాష్ట్రాల మధ్య ఘర్షణలను నివారించవలసింది కేంద్రమే. అది విఫలమైతే భిన్న రాష్ట్రాలు ఘర్షణలకు దిగితే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రిదే ఎక్కువ బాధ్యత. ఆయన జాడే కనిపించడం లేదు. ఇంక ప్రయత్నం ఎక్కడుంటుంది! కుల సమీకరణలు, ఓట్లు దండుకోవడానికి వివిధ సామాజిక వర్గాలను చేరదీయడం, కుదరనప్పుడు తంపులు పెట్టడం మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బాధ్యత కాదు. నిజానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఫలానా రాష్ట్రాలలో ప్రభుత్వం ఎవరిది, ఆ జనాభా రూపు రేఖలు ఏమిటి అని చూసే సంకుచితతత్వం ఉండనే కూడదు. కానీ మోదీ హయాంలో ఉన్నదే అది. అందులో అమిత్‌ షా ప్రధాన పాత్రధారి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img