Friday, April 19, 2024
Friday, April 19, 2024

శ్రుతి మించుతున్న కోశియారీ ప్రవర్తన

గవర్నర్‌ పదవిని కొనసాగించాలా వద్దా అన్న చర్చ చాలా కాలంగానే కొనసాగుతోంది. ఆ పదవిని కొనసాగిస్తే ఎలాంటి వారిని ఆ పదవిలో నియమించాలి అన్న చర్చ కూడా పాతదే. అయితే రాజకీయనిరుద్యోగులకు లేదా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పక్షం నాయకుడికి అవరోధాలు కల్పిస్తారన్న అనుమానం ఉన్న వారికీ గవర్నర్‌ పదవులను కట్టబెట్టే దుష్ట సంప్రదాయం సాగిపోతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలను గవర్నర్‌ స్థానంలో కూర్చోబెట్టడం పరిపాటి అయిపోయింది. క్రియాశీల రాజకీయాలలో ఉన్నవారు అమాంతం రాజ్‌ భవన్లలో ప్రవేశిస్తున్నారు. ఈ దుర్నీతి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత మాత్రమే అమలులోకి వచ్చింది కాదు. తన పార్టీ ప్రభుత్వాలనే అస్థిరీకరించడానికి గవర్నర్లను వినియోగించుకున్న అపఖ్యాతి కాంగ్రెస్‌ ఎప్పుడో మూటగట్టుకుంది. బీజేపీ అధికారం చేపట్టిన తరవాత సంఫ్‌ు పరివార్‌కు చెందిన వారికి గవర్నర్‌ బాధ్యతలు అప్పగించడం మితిమీరింది. అందుకే మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశియారీ లాంటి వారు వివాదాలు రేపుతున్నారు. గత ఆదివారం ఔరంగాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కోషియారీ గురువుల పాత్ర ఎంత విశిష్టమైందో చెప్తూ చాణక్యుడు లేకపోతే చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ? సమర్థ రామదాసు లేకపోతే శివాజీకి అంత ఖ్యాతి దక్కేదా అనడం అనేక రాజకీయ పార్టీలనుంచే కాక చరిత్రకారుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ దేశంలో గొప్ప గొప్ప మహా రాజులు, చక్రవర్తులు ఉన్నప్పటికీ వారి గురువులు లేకపోతే వారిని ఎవరు తలుచుకునే వారు అని కోషియారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను చంద్రగుప్త మౌర్యుడి, ఛత్రపతి శివాజీ స్థాయిని తగ్గించడం లేదు కాని వారి గురువులు నిర్వహించిన పాత్ర మహత్తరమైంది అన్నారు. మహారాష్ట్రలో హిందుత్వ భావజాలానికి కట్టుబడ్డ శివసేన, కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ శివసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుని మరో రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. గవర్నర్‌ కోషియారీ కూడా అదే ధోరణి అనుసరిస్తున్నారు. అవకాశం కల్పించుకుని శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి సకలవిధ ప్రయత్నాలూ చేస్తున్నారు. శివాజీకి గురువు ఆయన తల్లే అంటారు. కానీ కోషియారీ శివాజీ సామర్థ్యానికి సమర్థ రామదాసు గురువు కావడమే కారణం అనడం అనేకమందికి ఆగ్రహ కారణం అయింది. శివాజీ అభిమానుల మనో భావాలను కోషియారీ దెబ్బ తీశారు. గవర్నర్‌ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలనీ లేకపోతే ఆయనను తొలగించాలని కోరుతున్నారు. నేషన లిస్టు కాంగ్రెస్‌పార్టీ పార్లమెంటు సభ్యురాలు సుప్రియ సూలే అయితే శివాజీ ఎప్పుడూ సమర్థ రామదాసును కలుసుకున్న దాఖలాలే లేవని 2018 జులైలో బొంబాయిహైకోర్టు ఔరంగాబాద్‌బెంచి ఇచ్చిన తీర్పును ఉటం కిస్తున్నారు. సమర్థరామదాసు శివాజీకి గురువు అని చెప్పడం బ్రాహ్మణాధి పత్యానికి చిహ్నం అని చరిత్రకారులు, పరిశోధకులు అంటున్నారు. శివాజీ ఎన్నడూ సమర్థ రామదాసుకు శిష్యుడిగా ఉన్న దాఖలాలే లేవని వీరు చెప్తున్నారు. శీవాజీ వీరత్వం బ్రాహ్మణుడికి శిష్యుడైనందువల్లేనని ప్రచారం చేయడంలో కోషియారీ భాగస్వామి అయ్యాడంటున్నారు. చరిత్ర పుస్తకాలలో సమర్థ రామదాసుకు శివాజీ శిష్యుడన్న మాట ఎక్కడా లేదంటున్నారు. సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ సమకాలికులే అయినప్పటికీ వారిద్దరు కలుసుకున్న దాఖలాలే లేవని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. కోషియారీ మాటలు బ్రాహ్మణ ఆధిక్యతకు చిహ్నమన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఈ అంశం ఇదివరకు చాలా సార్లు చర్చకు వచ్చింది. శివాజీ గురువు సమర్థ రామదాసు అన్న సమాచారం ఏ చరిత్రకారుడికీ కనిపించలేదు. ఈ వాస్తవాలు తెలియక కోషియారీ ఈ వ్యాఖ్యలు చేశారనుకోలేం. సర్వత్రా విమర్శలు ఎదురైన తరవాత కోషియారీ సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. తాను అన్న మాటల్లో నిజా నిజాలు తెలుసుకుంటానంటున్నారు. చరిత్రకారుల అభిప్రాయాలలో వాస్తవం ఏమిటో కూడా తరచి చూస్తారట.
వివాదాలు రేకిత్తించడం, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఇరుకున పెట్టడం కోషియారీకి కొత్తేం కాదు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు లాక్‌ డౌన్‌ను ఎంతో కొంత సడలించిన సందర్భంలో ఆలయాలు తెరవాలని ముఖ్యమంత్రికి హుకుం లాంటిది జారీ చేశారు. గుళ్లు గోపురాలు ఎప్పుడు తెరవాలో, లాక్‌ డౌన్‌ నిబంధనలను ఏ మేరకు సడలించాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవలసిన అంశం. అందులో గవర్నర్‌ జోక్యం చేసుకోవడం అనుచితమని ఆ రోజుల్లో విమర్శలు చెలరేగాయి. కోషియారీ జాగ్రత్తగా మాట్లాడి ఉండవలసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆ సమయంలో వ్యాఖ్యానించారు. అమిత్‌ షా అంత మాట అన్న తరవాత ఆత్మాభిమానం ఉంటే కోషియారీ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయాలని ఆ సందర్భంలో నేషనలిస్టు కాంగ్రెస్‌ నాయకుడు శరద్‌ పవార్‌ అప్పుడే ఘాటైన విమర్శలు చేశారు. లాక్‌ డౌన్‌లో సడలింపులు ఉన్నప్పుడు హిందూ దేవాలయాలను తెరవాల్సిందేనని కోషియారీ అప్పుడు వివాదానికి తెర తీశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాసి అనౌచిత్యానికి పాల్పడ్డారు. బార్లు, హోటళ్లు తెరవడానికి అనుమతించినప్పుడు దేవాలయాలు ఎందుకు తెరవరు అని కోషియారీ ప్రశ్నించి తన స్వామి భక్తిని నిరూపించుకున్నారు. సంఘ పరివార్‌ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు, హిందువుల ప్రయోజనాలు కాపాడడానికి అవతారమెత్తినట్టు ప్రవర్తించారు. ఇది నిస్సందేహంగా గవర్నర్‌కు ఉన్న రాజ్యాంగపరిధిని అతిక్రమించడమే. అంతటితో ఆగలేదు. ‘‘మీరు గట్టి హిందుత్వ వాది. మీరు శ్రీ రాముడికి పరమ భక్తులు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన తరవాత అయోధ్య కూడా వెళ్లి వచ్చారు’’ అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వాదించారు. ఇది స్వామిని మించిన స్వామి భక్తికి తార్కాణం. కోషియారీ అంతటితో ఆగినా బాగుండేది. ‘‘దేవాలయాలు తెరవకూడదని మీకు ఏ దైవమైనా చెప్పాడా? లేదా హఠాత్తుగా సెక్యులర్‌ వాది అయిపోయారా అని కూడా ముఖ్యమంత్రిని నిలదీశారు. ఉద్ధవ్‌ ఠాక్రే భక్తి ప్రపత్తులు ఇక్కడ చర్చనీయాంశం కాదు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, రాజ్యాంగ మౌలిక సూత్రాలలో ఒకటైన సెక్యులర్‌ విధానాన్నే ప్రశ్నించడానికి ఆయన సాహసించారు. గవర్నరుగా ప్రమాణం స్వీకరించినప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చేసిన ప్రమాణాన్ని కోషియారీ తుంగలోతొక్కారు. ఇది రాజ్యాంగాన్ని అతి క్రమించడమే కాదు. గవర్నర్‌ స్థానంలో ఉండి రాజ్యాంగాన్ని కించపరచడం. తానున్నది గవర్నర్‌ స్థానంలోననీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రచారక్‌ను కాదనీ కోషియారీ గ్రహించినట్టు లేదు. రెండిరటికీ అభేదం పాటిస్తున్నారు. గవర్నర్ల స్థానాన్ని సంఫ్‌ు పరివార్‌ కార్యకర్తల నిలయంగా మార్చేయడం సహించ రాని విషయం. కానీ గవర్నర్‌ పదవులను సంఫ్‌ు పరివార్‌ కార్యకర్తలకు ప్రత్యేకించినప్పుడు ఇలాంటి గవర్నర్లే ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img