Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

దీపావళి నుంచి కొత్త పథకం అమలు

. ఉచిత ఇసుకపై సీనరేజ్‌, జీఎస్టీ తొలగింపు
. శారదాపీఠం భూ కేటాయింపు రద్దు
. బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు ఆలయ పాలకమండళ్లలో సభ్యత్వం
. కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: దీపావళి నుంచి అర్హులైన మహిళలకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఉచిత ఇసుకపై సీనరేజ్‌, జీఎస్టీ రద్దు, శారదా పీఠానికి భూ కేటాయింపుల రద్దు, జీవోఐఆర్‌ పోర్టల్‌ పునరుద్ధరణ తదితర అంశాలను మంత్రి మండలి ఆమోదించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 3 గంటలు పాటు ఇకేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, గనులు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత సంయుక్త మీడియాకు వెల్లడిరచారు. సూపర్‌ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31 న దీపావళి పండుగ నుంచి చేపట్టనున్న మూడు వంట గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ అమలు కోసం ఏటా రూ.2,684 కోట్లు ఖర్చవుతుంది. దీని కోసం మూడు గ్యాస్‌ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.894.92 లు కాగా… గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లోపే డీబీటీ ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకొకసారి (ఏప్రిల్‌ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబరు నుంచి మార్చి) ఒక సిలిండర్‌ చొప్పున మొత్తం మూడు సిలిండర్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
మంత్రిమండలి ఆమోదించిన ఇతర అంశాలు…
. ఉచిత ఇసుక విధానంలో సినరేజ్‌, జీఎస్టీ చార్జీల రద్దు. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సినరేజ్‌ చార్జీల వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్లు భారం పడనుందని అంచనా వేశారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు అనుమతి.
. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణ. ఆలయ ఆదాయం రూ. 20 కోట్లు కంటే అధికంగా ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటే దీన్ని 17కు పెంచనున్నారు.
. విశాఖలోని స్వరూపానందకు చెందిన శారదా పీఠానికి జగన్‌ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూ కేటాయింపులు రద్దు.
. సాధారణ పరిపాలనా విభాగం(జీఏడీ)లో జీవో నంబర్లు జనరేట్‌ చేసేందుకు, జీవోలను అప్‌లోడ్‌ చేసేందుకు ఆన్‌లైన్‌ గవర్నమెంట్‌ ఆర్డర్‌ ఇస్యూ రిజిస్టర్‌ (జీఓఐఆర్‌) వెబ్‌ పోర్టల్‌ను పునరుద్ధరణ.
. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ స్థానంలో కూటమి ప్రభుత్వం కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలనే అనుసరించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ ఉత్తర్వులను రద్దు చేశారు.
. జాతీయ మానవ హక్కుల కమిషన్‌`న్యూదిల్లీ, భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం కుష్టు, బధిర, మూగ వారి పట్ల వివక్షతను నిర్మూలించేందుకు ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన విధంగా ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రా ప్రాంతం) ఆయుర్వేద, హోమియోపతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం, 1956లోని సెక్షన్‌ 9(2)(ఏ)ని సవరించి బిల్లును రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది.
. విశాఖలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో (27) టీచింగ్‌ పోస్టులు, (56) నాన్‌ టీచింగ్‌ పోస్టులు వెరశి మొత్తం (83) నూతన పోస్టుల మంజూరు, ఆయా పోస్టులను ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం ప్రమోషన్‌/ కాంట్రాక్ట్‌/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఆమోదం.
. డెరైక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కంట్రోల్‌లో ఉన్న మంగళగిరిలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిని అప్‌-గ్రేడేషన్‌కు అవసరమైన అంచనా మొత్తం రూ.52,20,88,252 తో పాటు (73) అదనపు పోస్టుల మంజూరుకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img