Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

పద్ధతి మార్చుకోండి

మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అనేక కీలక అంశాలపై వారితో చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులపైనా సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సరిగ్గా పనిచేయడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని దిశానిర్దేశం చేశారు. పట్టు పెంచుకోవాలని సూచించారు. మంత్రులు తనతోపాటు సమానంగా పనిచేయాలన్నారు. నిర్లిప్తంగా ఉన్నారని, అలాగే కొనసాగితే పనిచేయలేరంటూ, పద్దతులు మార్చుకోవాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. గత మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే విధంగా మంత్రులకు క్లాస్‌ ఇచ్చారు. సీఎం చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఉండటంతో… ఎవరికి వారు తమకు కాదనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలు కావస్తోంది. ఇంతవరకు మంత్రులు వారి శాఖలపై పట్టు సాధించలేకపోయారన్న వాదనలున్నాయి. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, కిడ్నాప్‌, హత్యలు తదితర సంఘటనలు పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించడంలో హోంశాఖ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అండగా ఉంటాం
యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో మాట్లాడిన సీఎం కడప జిల్లా బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్‌ ద్వారా సీఎం చంద్రబాబు మాట్లాడారు. పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందింది. అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారిస్తామన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు….బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, బాలిక తల్లికి ఉపాథి కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img