వీధికో బెల్టు షాపు
. విచ్చలవిడిగా విక్రయాలు
. నివాస ప్రాంతాల్లో రిటైల్ దుకాణాలు
. చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
. కూటమి నేతల అండతో రెచ్చిపోతున్న మాఫియా
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: కూరగాయలు కొనుక్కునే చోట మద్యం బాటిళ్లను వరుసగా పెట్టి విక్రయిస్తున్న సంఘటన చర్చానీయాంశంగా మారింది. నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేట్ మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. దీంతోపాటు దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులూ భారీగా పుట్టుకొస్తున్నాయి. కొందరు వ్యక్తులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలకు దిగుతున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా సమీప గ్రామాలు, కూడళ్లల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టి మందు విక్రయిస్తున్నారు. మందుబాబులకు ఇళ్ల ముంగిటకు మద్యం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రొహిబిషన్
ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. వాటి ద్వారా పాత బ్రాండ్లను ప్రభుత్వం విక్రయిస్తున్నారు. ఇటీవల నుంచి రూ.99కే చీప్‌లిక్కర్ క్వార్టర్ బాటిల్‌ను పరిమితంగా అందుబాటులో ఉంచారు. పూర్తి స్థాయి సరుకు వచ్చాక వాటిని అన్ని దుకాణాల్లోకి అందుబాటులో ఉంచుతారు. ప్రైవేట్ మద్యం దుకాణాలపై పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేవాలయాలు, పాఠశాలలు, నివాస ఇళ్ల సమీపాన మద్యం దుకాణాలను ప్రారంభించడంతో స్థానికుల నుంచి తిరుగుబాటు ఎదురవుతోంది. ఎక్కడికక్కడే నిరసనలు చేపడుతున్నారు. తమ నివాసాల మధ్య మద్యం దుకాణాలను తొలగించాలని సూచిస్తున్నారు. ఈ నిరసనల నడుమ బెల్టుషాపులు పుట్టుకురావడంతో ప్రజలకు దిక్కుతోచడం లేదు.
బెల్టుషాపుల ప్రభావంతో ఏకంగా కూరగాయల తరహాగా సంతలో మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పశ్చిమ గోదారిజిల్లా తణుకులోని పాతవూరు, సంత మార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు భారీగా కొనసాగుతున్నాయి. సంతలో కూరగాయలు, రోజువారీ సామాన్ల తరమాగా మద్యం విక్రయాలను అందుబాటులో ఉంచారు. ఇది ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఏ మాత్రం భయంలేకుండా బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరిలోని జిల్లాల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మద్యం బాటిళ్లను సంతలోపెట్టి, బహిరంగంగా విక్రయిస్తున్న సంఘటన వెలుగు చూసింది. దీనిని కొందరు యువకులు వీడియోల ద్వారా చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లోకి పోస్ట్ చేశారు. సంతలో కూరగాయలతోపాటు మద్యం బాటిళ్లను వరుసగా పెట్టి విక్రయిస్తున్న దృశ్యాలు సర్వత్రా చర్చానీయాంశంగా మారాయి. ఈ సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడకు వెళ్లడంతో బెల్ట్‌షాపు నిర్వాహకుడు పరారయ్యాడు.
భారీగా బెల్టుషాపులు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు
ప్రైవేట్ మద్యం దుకాణాల ప్రారంభం కావడం, వాటిపై పర్యవేక్షణ లేకపోవడం వెరసి భారీగా బెల్టుషాపులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. గత మద్యం దుకాణాలను సిండికేట్‌గా ఏర్పడి చాలా మంది దక్కించుకున్నారు. అందులో కూటమి పార్టీల నేతలు అధికంగా ఉన్నారు. అక్కడక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలూ మద్యం దుకాణాల్లో భాగస్వాములయ్యారు. ఈ దుకాణాదారుల కనుసన్నల్లో బెల్టుషాపుల దందాకు తెరదీసినట్లు తెలుస్తోంది. రెండు లక్షల రూపాయలు ఇచ్చిన వారికి ఏకంగా బెల్టుషాపులు కట్టబెట్టడం, వారి వైపు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడకుండా సిండికేట్లు వెన్నుదన్నుగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో బెల్టుషాపుల ద్వారా బహిరంగ మార్కెట్లో విచ్ఛలవిడి మద్యం విక్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంతలోనే మద్యం దుకాణాలను విక్రయిస్తున్నారంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం మొత్తాన్ని టీడీపీ నేతలే దగ్గర ఉండి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మద్యం దుకాణాలకు చీఫ్ లిక్కర్ ఫుల్‌గా వస్తే..ఈ బెల్ట్‌షాపుల ద్వారా విక్రయాలు పెద్దఎత్తున కొనసాగే ప్రమాదముంది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బహిరంగ మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బెల్ట్ షాపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. లేకుంటే నూతన మద్యం పాలసీ పక్కదారి పట్టే ప్రమాదముంది.