Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ కన్నుమూత

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ములాయం మృతితో సమాజ్‌ వాదీ పార్టీ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి వార్త తెలుసుకున్న బంధువులు, పార్టీ శ్రేణులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో ఆగస్టు 22న మేదాంత ఆస్పత్రిలో ములాయం చేరారు. ఆరోగ్యం మరింత విషమించడంతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ లో వెంటిలేటర్‌ సపోర్టుతో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ములాయం సింగ్‌ యాదవ్‌ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు వరుసగా ఆయన పనిచేశారు. గతంలో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ఇంతకు ముందు అజమ్‌గఢ్‌, సంభాల్‌ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ములాయం గెలిచారు. లోహియా, రాజ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం.. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి యూపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ములాయం.. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. 1980లో లోక్‌ దళ్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ములాయం..1982లో యూపీ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. లోక్‌ దళ్‌ చీలిక తర్వాత క్రాంతికారీ పార్టీని ములాయం ప్రారంభించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలల పాటు జైలుజీవితం గడిపారు.
ములాయం మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల సంతాపం
సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు. ములాయం మరణం దేశానికి తీరని నష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ములాయం మరణం పట్ల ట్విట్టర్‌ లో సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సైతం ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘యూపీ, దేశ రాజకీయాల్లో ములాయం సింగ్‌ యాదవ్‌ జీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన మరణం నన్ను బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, ఆయన లక్షలాది మద్దతుదారులకు నా సంతాపం’’అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img