Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

జగన్‌ను ఆదరిస్తే ఆత్మహత్యలే

. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజలకు ముప్పు
. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడతా
. దర్శి, నూజివీడు సభల్లో చంద్రబాబు

ఎన్నికల్లో జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేస్తే ప్రజలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

విశాలాంధ్ర-దర్శి/నూజివీడు : ఈ ఎన్నికల్లో జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేస్తే ప్రజలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి, ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సభల్లో ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను కాపాడతామని, బీసీలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దర్శిలోని పొదిలి రోడ్డులో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జగన్‌ తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రమాదకరమైందని, ప్రజల ఆస్తిపై ఒక ప్రైవేటు కంపెనీకి హక్కులు ఉండే విధంగా చట్టం రూపకల్పన చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారు. టీడీపీ హయాంలో కొనసాగిన విద్యా దీవెన, బీసీలకు ఆదరణ, పంట రాయితీలు వంటి మంచి పథకాలను రద్దు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే మరింత మెరుగైన మంచి పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు. మసీదుల్లో పనిచేసే వారికి రూ.20 వేల గౌరవ వేతనం ఇస్తామని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని, ఏప్రిల్‌ నుంచి ఈ పెంపు బకాయిలను కలిపి జూన్‌ నెలలో లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ను పునరుద్ధరిస్తామన్నారు. గోదావరి, కృష్ణా జలాలను నాగార్జునసాగర్‌ కాలువల ద్వారా భూములకు అందిస్తామని తెలిపారు. తాళ్లూరు మండలానికి ప్రయోజనం చేకూర్చే మొగిలి గుండాల రిజర్వాయర్‌ ప్రాజెక్టుని తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. దోపిడీలు, హత్యలు, ఆక్రమణలు, స్మగ్లింగ్‌ వంటివి జగన్‌ నవరత్నాలని ఎద్దేవా చేశారు. గొట్టిపాటి లక్ష్మీ ధైర్యం ఉన్న మహిళ అని, మంచి వైద్యురాలని ఆమెను గెలిపించుకోవాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు నూకసాని బాలాజీ, మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు, పంచాయతీ చైర్మన్‌ నారపు శెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ గోరంట్ల రవికుమార్‌, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పమిడి రమేష్‌, కడియాల లలిత సాగర్‌, కడియాల రమేష్‌, కడియాల వెంకటేశ్వరరావు, మాగుంట రాఘవరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్‌కు ప్యాలెస్‌లు… పేదలకు పూరిళ్లా?
నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని విమర్శించారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. ‘నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని చాలా రోజులుగా పోరాడుతున్నారు. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తా. జగన్‌కు ప్యాలెస్‌లు, ప్రజలకు మాత్రం పూరిళ్లా? ఇదెక్కడి న్యాయం. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. మొదటి సంతకం మెగా డీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు రద్దుపైనే. మన భూములపై జగన్‌ అజమాయిషీ ఏంటి? ప్రజల పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img