Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

జగన్‌ పాలనలోరాష్ట్రం నాశనం

. మతాల మధ్య చిచ్చుపెట్టే మోదీకి గుణపాఠం నేర్పాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. ఇండియా కూటమి విజయం తథ్యం: ఓబులేసు

విశాలాంధ్ర – కడప కలెక్టరేట్‌ : ఏపీ విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌ సర్వనాశనం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా తయారు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ…సోమవారం ఆయన నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ముందుగా చింతకొమ్మదిన్నె మండలం అంగడివీధి, ప్రొఫెసర్స్‌ కాలనీ, చిన్నముసలిరెడ్డిపల్లె, బాబానగర్‌, తెలుగుగంగ కాలనీ, మామిళ్లపల్లె చుట్టుపక్కల పల్లెల్లో పర్యటించి… ఇండియా కూటమి బలపర్చిన కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుపై , కమలాపురం అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి గాలి చంద్ర కంకి కొడవలి గుర్తుపై ఓట్లు గెలిపించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం అధికార వైసీపీకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిపక్ష టీడీపీ కూడా డబ్బులు పంపిణీ చేస్తోందన్నారు. ఇలాంటి సంస్కృతిని రాష్ట్ర ప్రజలు సమ్మతించే పరిస్థితిలో లేరన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు, పేదలకు, నిరుద్యోగులకు, కార్మికులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి అధికార దాహం తీర్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే దేశ ప్రజల బతుకులు ప్రశ్నార్థకమవుతాయన్నారు. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం వారి మతోన్మాదానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం పోలీసులతో కలిసి అరాచక పాలన చేస్తోందని దానికి కేంద్ర ప్రభుత్వం కూడా తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్న మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మినహా వైసీపీ సహా ఇతర ఏ ప్రధాన పార్టీ మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కావాల్సిన మంది ఎంపీలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధిస్తానన్న జగన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కొత్త ఫ్యాక్టరీలు రాకపోగా ఉన్న వాటిని కూడా తరిమేస్తున్న చరిత్ర జగన్‌దన్నారు. విశాఖ ఉక్కుపై నీలినీడలు కమ్ముకున్నాయని, విశాఖ రైల్వేజోన్‌ ఊసేలేదని విమర్శించారు. రామాయపట్నం దుగ్గరేవు, ఓడరేవుల సంగతి మర్చిపోయారన్నారు. కడప జిల్లాలో నిర్మిస్తామన్న ఉక్కు ఫ్యాక్టరీ అతీగతీ లేదని మొదట రాజశేఖర్‌రెడ్డి, తరువాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రెండుసార్లు జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించడానికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 13లక్షల కోట్లు అప్పులు మిగిల్చిన జగన్‌ గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు ఉన్నా పిల్ల కాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో రైతులకు ఏమాత్రం ఉపయుక్తంగా లేదని విమర్శించారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇండియా కూటమిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలన్నారు. కమలాపురం నియోజకవర్గానికి యువకుడు, విద్యావంతుడు, నిరంతర ప్రజా సమస్యలపై పోరాటం చేసే గాలి చంద్రను గెలిపించాలని ఆయన కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేశ అభివృద్ధికి పాటుపడిన కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలను గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఇండియా కూటమి 28 రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళుతోందని విజయదుందుభి మోగించే రోజులు దగ్గరలో ఉన్నాయని వెల్లడిరచారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డితో పాటు టీడీపీ, జనసేన కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తున్నాయని జగన్‌ అంతర్లీనంగా పనిచేస్తుంటే టీడీపీ, జనసేన బహిరంగంగానే కలిసి ముందుకు వెళుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు డబుల్‌ ఇంజన్‌ సంస్కృతిని ముందుకు తెచ్చి రాష్ట్రం, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో పదేళ్ల నుంచి ఉన్న బీజేపీ ప్రభుత్వం, విభజన తర్వాత రాష్ట్రంలో చెరో ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు కానీ కేంద్రానికి మాత్రం దాసోహమయ్యాయని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గాలి చంద్ర మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గం గత పదేళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోక తీవ్ర కరువు కాటకాలకు లోనైందన్నారు. చింతకొమ్మదిన్నె మండలం గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని… భూ కబ్జాలు, ఇసుకదందాలు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రైల్వేగేటు సమస్యతో విశ్వనాధపురం, ప్రొఫెసర్‌కాలనీ, అంగడివీధి, పెద్దముసలిరెడ్డిపల్లె వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కమలాపురం హైలెవల్‌ వంతెనను అతీగతీ లేకుండా వదిలేశారని ప్రతి గ్రామంలో విద్యుత్‌, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా ప్రస్తుత పాలకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఇండియా కూటమి అభ్యర్థుల విజయంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. 13వ తేదీన కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి తనను, కడప ఎంపీగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎల్‌.నాగసుబ్బారెడ్డి, ఎన్‌.వెంకటశివ, గుంటి వేణుగోపాల్‌, కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌రావు, కేసీ బాదుల్లా, బషీరున్నిసా, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img