Monday, May 20, 2024
Monday, May 20, 2024

పేదలకు మంచి చేసిన నేను బచ్చానా?

దగా చేసిన నిన్ను ఏమనాలి బాబు…
అనకాపల్లి ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్

విశాలాంధ్ర బ్యూరో`అనకాపల్లి (కసింకోట) : నేను బచ్చా అయితే ఆ బచ్చా మీద కేవలం 23 ఎమ్మెల్యేలను మాత్రమే గెలిచి ఎందుకు ఓడిపోయావ్‌ అంటూ ‘మేమంతా సిద్ధం’ సభ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చింతపాలెం వద్ద జరిగిన ఈ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ అనకాపల్లిలో నాకు రెండు సముద్రాలు కనిపిస్తున్నాయని, ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి అనకాపల్లి ‘మేమంతా సిద్ధం’ సభ అని అన్నారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ ఎన్నికలు మన పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతుల తలరాతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. ఐదేళ్లలో ప్రజల మనసులను గెలిచి తాము ఎన్నికలకు వెళుతుంటే, వాళ్లు కుట్రలు, పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నారని, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా… అని పిలుపునిచ్చారు. ‘సిద్ధం సభలను చూసి ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి. చంద్రబాబు ఉక్రోశంతో నాపై రాళ్లు వేయమని చెబుతున్నారు. నన్ను దగ్ధం చేయమంటున్నారు. ఇదే దత్తపుత్రుడు, చంద్రబాబు వదినమ్మ అజెండా… జగన్‌ కొట్టడానికి, హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, పంచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలని ఆరాటపడుతున్నారు. చంద్రబాబు ఈ మధ్య మాట్లాడుతూ జగన్‌ ఓ బచ్చా అని అన్నారు. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ అటువైపు హీరోలందరూ బచ్చాల మాదిరిగానే కనిపిస్తారు. అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల కోసం ధైర్యంగా ప్రజల మందుకు వస్తున్నాను. పేదలకు నువ్వు మంచి చేసుంటే ఈ బచ్చాలను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడావు’ అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేశాడో చెప్పాలన్నారు.
పేద పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వద్దని ఉద్యమాలు చేయించిన ఘనుడని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా రూ.2.70 లక్షల కోట్లను నేరుగా బటన్‌ నొక్కి పేదల ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలు, 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే 26 జిల్లాలు, 15 వేల సచివాలయాలు, నాడు`నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులు, 15 వేల రైతు భరోసా కేంద్రాలు, 3 వేలకు పైగా డిజిటల్‌ లైబ్రరీలను అభివృద్ధి చేశామని తెలిపారు. గ్రామాలకు ఫైబర్‌ గ్రిడ్‌, మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్రం తలసరి ఆదాయంలో 28వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు.
ఇంటికే పౌరసేవలు, పెన్షన్‌, ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు అందిస్తున్నామన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మేలు కూడా గుర్తుకు రాదని, కేవలం వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లాలో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img