ప్రజల గడపకు న్యాయం

    414

    ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలి
    కోర్టులకు రాగలిగింది కొందరే ` మౌనంగా రోదిస్తున్న అనేకమంది
    విచారణ ఖైదీల విముక్తిపై దృష్టి అవశ్యం
    బ జిల్లాస్థాయి వ్యవస్థలేన్యాయవ్యవస్థకు వెన్నెముక
    ఐటీతో సేవల విస్తరణ
    అఖిలభారత జిల్లా న్యాయ సేవల యంత్రాంగం సదస్సులో సీజేఐ రమణ, ప్రధాని మోదీ

    న్యూదిల్లీ: ఈ దేశంలో చాలా మంది ప్రజలు న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేక, న్యాయ సహకారం అందక మౌనంగా బాధపడుతున్నారనీ, కొందరు మాత్రమే కోర్టుల వరకు రాగలుగుతున్నారనీ, ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులోకి రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలే న్యాయవ్యవస్థకు వెన్నుముక అని చెప్పారు. న్యాయం అన్నది సామాజిక ముక్తి సాధనం కావాలని ఆకాంక్షించారు. న్యాయం అందించే గతిని పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదమవుతున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో సులభర జీవితం తరహాలో సులభంగా న్యాయం అందడం కూడా అంతే అవసరం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వివిధ జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీలకు విముక్తి కల్పించే దిశగా న్యాయ చర్యలు ఉండాలని సూచించారు. సీజేఐ రమణ, ప్రధాని మోదీ శనివారం దిల్లీలో జరిగిన అఖిలభారత జిల్లా న్యాయ సేవల యంత్రాంగం సదస్సులో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు అమిత విశ్వాసం ఉందని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులోకి రాగలిగే యంత్రాంగం అవసరమని సీజేఐ రమణ సూచించారు. ‘న్యాయం : సామాజిక, ఆర్థిక, రాజకీయ ఇలా ఏ రూపంలోనైనా న్యాయం అన్నది ప్రతి భారతీయునికి మన పీఠిక హామీనిచ్చింది. కానీ నేటి పరిస్థితుల్లో న్యాయం కోసం న్యాయ స్థానాలను ఆశ్రయించగలిగే వారి సంఖ్య చాలా తక్కువ. మరెందరికో న్యాయం దక్కే పరిస్థితులే ఉండటం లేదు. సమాజంలో అసమానతలను తొలగించే ఉద్దేశంతోనే ఆధునిక భారతం నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడమే ప్రాజెక్టు ప్రజాస్వామ్యం. సామాజిక స్వేచ్ఛ లేకపోతే ఇది సాధ్యం కాదు. సామాజిక స్వేచ్ఛకు న్యాయం అందుబాటులో ఉండటం అన్నది ఒక అస్త్రం ’ అని సీజేఐ అన్నారు. విడుదలకు అర్హులైన విచారణ ఖైదీలకు సత్వరమే న్యాయ సాయం అందించే దిశగా చర్యలు అవసరమన్న ప్రధాని మాటలతో ఏకీభవించారు. విచారణ ఖైదీలకు విముక్తి కల్పించే దిశగా భాగస్వాములతో కలిసి జాతీయ న్యాయ సేవల యంత్రాంగం (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) చేస్తున్న కృషి అభినందనీయమని మోదీ అన్నారు. సగటున 29 ఏళ్ల వయస్సుగల కార్మికశక్తి అత్యధికంగా ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ఒకటని సీజేఐ రమణ చెప్పారు. నైపుణ్యం ఉన్న కార్మికులు మొత్తం కార్మికశక్తిలో మూడుశాతం కాగా యువతలో నైపుణ్యాన్ని మరింత పెంపొందించాలని తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆమేరకు ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు వీలు ఉంటుందని సూచించారు. న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నెముక అన్నారు. ప్రజలను చేరుకునేందుకు ఇదే మొదటి మాధ్యమని, దీనిని బలపర్చడం ప్రస్తుతం అత్యవసరమని నొక్కిచెప్పారు. దేశ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అభిప్రాయం ఎలా ఏర్పడుతుందనేది జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ మీదే ఆధారపడి ఉందని చెప్పారు. భారత్‌లో న్యాయ సేవల ఉద్యమానికి చోదకశక్తిగా జిల్లా న్యాయవ్యవస్థ ఉందని సీజేఐ అన్నారు. లోక్‌ ఆదాలత్‌ వంటి ప్రత్యామ్నాయ ఏడీఆర్‌ యంత్రాంగాలను పటిష్టపర్చుకోవడం అవసరమని జస్టిస్‌ రమణ నొక్కిచెప్పారు. ప్రధాని మాట్లాడుతూ, విచారణ ఖైదీలకు విముక్తి కల్పించేందుకుగాను విచారణ ఖైదీల సమీక్షా కమిటీల చైర్‌పర్సన్‌లు జిల్లా జడ్జీలుగా వ్యవహరించవచ్చు అని అన్నారు. విచారణ ఖైదీల విడుదల కోసం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినందుకుగాను ఎన్‌ఏఎల్‌ఎస్‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మరింత మంది న్యాయవాదులను ప్రోత్సహించాలని బార్‌ కౌన్సిల్‌ను కోరారు. జుడీషియరీ వ్యవస్థ తరహాలోనే న్యాయం అందించడం కూడా ముఖ్యమని మోదీ చెప్పారు. ఐటీ, ఫిన్‌టెక్‌లో భారత్‌ నాయకత్వాన్ని ప్రస్తావించారు. జ్యుడిషియరీ కార్యకలాపాలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత శక్తినిచ్చేందుకు ఇంతకంటే మెరుగైన సమయం లేదన్నారు. ఈకోర్టుల మిషన్‌ కింద దేశంలో వర్చువల్‌ కోర్టులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు వంటి నేరాల కోసం కోర్టులు 24 గంటలు పనిచేస్తున్నాయని, ప్రజల సౌకర్యార్థం కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ వసతుల విస్తరణ జరుగుతోందని ప్రధాని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు కోటికిపైగా కేసులు వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించినట్లు తెలిపారు.
    21వ శతాబ్దపు వాస్తవిక పరిస్థితుల స్థాయికి చేరుకున్నామన్నారు. రాజ్యాంగబద్ధ హక్కులు, విధుల గురించి పౌరులకు తెలియాలని, రాజ్యాంగంపై అవగాహన కల్పనలో టెక్నాలజీ పాత్ర కీలకమని మోదీ చెప్పారు. ఈ సమావేశాన్ని ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ నిర్వహించింది. సీజేఐ రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు యూయూ లలిత్‌, డీవై చంద్రచూద్‌, న్యాయమంత్రి కిరణ్‌ రిజీజూ, కేంద్రమంత్రి ఎస్పీఎస్‌ బాఘెల్‌, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, జిల్లా, `రాష్ట్ర న్యాయ సేవల యంత్రాంగాల ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌లు పాల్గొన్నారు. కాగా, 2020లో ఎన్‌సీబీ విడుదల చేసిన భారత్‌లో జైళ్ల గణాంకాల నివేదిక ప్రకారం మొత్తం ఖైదీలు 4,88,511 మంది కాగా వీరిలో 76శాతం అంటే 3,71,848 మంది విచారణ ఖైదీలని తెలుస్తోంది.