Friday, May 10, 2024
Friday, May 10, 2024

బీజేపీతో దేశానికి ముప్పు

జాఫర్‌, మల్లికార్జునను గెలిపించండి
అనంత రోడ్‌ షోలో రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో-అనంతపురం: మోదీ సర్కారు హయాంలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బీజేపీ మతోన్మాదులు దేశానికి ఎంత ప్రమాదమో ప్రజలు గుర్తించాలని రామకృష్ణ ప్రజలను కోరారు. అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి జాఫర్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వి.మల్లికార్జున విజయాన్ని ఆకాంక్షిస్తూ అనంత నగరంలో రెండో రోజు రోడ్‌ షో కార్యక్రమం నిర్వహించారు. రోడ్‌ షోలో రామకృష్ణ మాట్లాడుతూ దేశ ఆర్థిక వనరులను తమ అనుచరులకు ధారాదత్తం చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చిందని ఆరోపించారు. బీజేపీ, ఎన్‌డీఏ అభ్యర్థులను ఎన్నికల్లో ఘోరంగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి పన్నాగం పన్నుతున్న మతోన్మాదులను తరిమికొట్టాలని, ఇలాంటి పాలకుల నుండి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. తిరిగి మోదీ ప్రధాని అయితే సెక్యులరిజానికి, రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్‌…నరేంద్ర మోదీకి వత్తాసు పలుకుతూ ఏకసూత్ర ప్రణాళిక అమలు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌లో ఎవరికి ఓటు వేసినా మోదీకి వేసినట్లేనని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు స్వేచ్ఛగా ఉన్నారని, వారి మధ్య ప్రధాని మోదీ మత విభజన తీసుకొస్తున్నారని, అలాంటి మోదీకి బాబు, జగన్‌ బాహాటంగా మద్దతు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిరదని ఆరోపించారు. రైతులను, చేనేతలను, కార్మికులను, ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలైందన్నారు. కేవలం ఇసుక మాఫియా, నాసిరకం మద్యం, రాష్ట్ర ఆర్థిక వనరుల దోపిడీకే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇలాంటి వారిని మరోసారి ఎన్నుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పదని హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీశ్‌ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు, దేశాభివృద్ధి ఎన్డీఏ పాలనలో కరువయ్యాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, వ్యవసాయ పనిముట్ల పంపిణీ నిలిచిపోయిందన్నారు. సామాన్యులు జీవించలేని పరిస్థితిని పాలకులు సృష్టించారన్నారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రోడ్‌ షోలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.నారాయణస్వామి, సి.మల్లికార్జున, నాయకులు ఎన్‌. శ్రీరాములు, బి.రమణయ్య, బి.కేశవరెడ్డి, టి.నారాయణస్వామి, సి.లింగమయ్య, జాన్సన్‌ బాబు, వేమయ్య యాదవ్‌, ఎ.కాటమయ్య, దాదా పీరా, ఎస్‌. రమణయ్య, కుళాయి స్వామి, సంతోశ్‌ కుమార్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img