Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

మరో దఫా పదవుల పంపిణీ

. ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు కసరత్తు
. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం
. సభ్యత్వ నమోదు పండుగలా జరపాలని ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కొలిక్కి వస్తోంది. మొదటి దశలో ఇచ్చిన 21 నామినేటెడ్‌ పదవులకు రెట్టింపు సంఖ్యలో రెండో జాబితా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయంలో కూటమి పక్షాలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. కష్టపడిన వారికే పదవి అనే విధానంలో భాగంగా నామినేటెడ్‌ పోస్టులకు ఎంపికపై చర్చిస్తున్నారు. రెండో దఫా నామినేటెడ్‌ పదవుల భర్తీపై శుక్రవారం ఉండవల్లి నివాసంలో దాదాపు మూడు గంటల పాటు టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చర్చించారు. సాధ్యమైనంత త్వరగా రెండో జాబితా విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతున్నందున నామినేటెడ్‌ పోస్టులు ఆశించేవారిలో సహనం నశిస్తోంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ, జనసేన అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం కోసం తమ నియోజకవర్గాల టికెట్లను త్యాగం చేసిన వారు, అలాగే వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్‌ కేటాయింపుకు సహకరించిన నేతలతో పాటు, మంత్రి పదవులు రాని అనేక మంది సీనియర్‌ నేతలు, వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వేధింపులకు ఎదురొడ్డిన నేతలు నామినేటెడ్‌ పోస్టుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇవిగాక ద్వితీయ శ్రేణి నాయకులు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ తరహా పోస్టుల కోసం ఆరాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో సీఎం చంద్రబాబు త్వరలో రెండో జాబితా విడుదలకు కసరత్తు నిర్వహిస్తున్నారు. దీపావళి ముందు అమావాస్య అడ్డంకిగా భావిస్తున్న అధినేత, నవంబర్‌ మొదటివారంలో విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా చంద్రబాబు నేతలతో సమీక్షించారు. అక్టోబర్‌ 26 నుంచి ప్రారంభమయ్యే టీడీపీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా చూడాలని నేతలకు సూచించారు. రూ.100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నామని, దీనిపై కార్యకర్తలకు అవగాహన కల్పించాలని, సభ్యత్వ కార్యక్రమం ఒక పండుగలా జరిగేలా నిర్వహించాలని నేతలకు మార్గనిర్దేశనం చేశారు.
పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాలి
త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి, పట్టభద్రుల ఎన్నికల అభ్యర్ధిగా పేరాబత్తుల రాజశేఖర్‌, గుంటూరు-కృష్ణా జిల్లాల అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను కూటమి అభ్యర్థులుగా నాలుగు జిల్లాల్లోని నేతలందరి అభిప్రాయాలు తీసుకుని ప్రకటించినందున జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుని అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ మేరకు నాలుగు జిల్లాల ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టభద్రుల ఓట్ల నమోదుకు వచ్చే నెల 6వ తేదీ చివరి రోజు. ఆ లోపు ఓటర్ల నమోదును పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ లు ఏర్పాటు చేసుకోవాలి. గతంలో మూడు పార్టీలు కలిసి పని చేయడం వల్ల మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం సీట్లు సాధించాం. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా కష్టపడి పనిచేయాలన్నారు. ప్రభుత్వంలో ఉండి పనులు చేయడం ఎంత ముఖ్యమో…ఆ పనుల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కూడా అంతే ముఖ్యం. నాలుగు నెలల్లో అమలు చేసిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలి. ప్రజల కోసం తీసుకొచ్చిన పాలసీలు, పథకాలపై చర్చ జరగాలి. ఇప్పటికే డీఎస్సీ ప్రకటించాం.
ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు 6 పాలసీలు తీసుకొచ్చాం. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని జాబ్‌ ఫస్ట్‌ విధానంతో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అడుగు ముందుకేస్తున్నాం. ఏపీ బ్రాండ్‌ ను పునరుద్ధరించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాం. విజయవాడ వరద బాధితులకు ఎప్పుడూ లేని విధంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాం. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
కాగా శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసయాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img