Monday, October 28, 2024
Monday, October 28, 2024

పవన్‌కు రాజధానిరైతుల ఘనస్వాగతం

సీఎం పేషీలో చంద్రబాబుతో భేటీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతిలో అడుగుపెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్‌ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. రాజధాని రైతులు, ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు సాగారు. అనంతరం పవన్‌ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయనకు అక్కడ కూడా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీకి వెళ్లి పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌ ఆయనతో పాటు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్‌ కల్యాణ్‌ బుధవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్‌ తన ఛాంబర్‌ను పరిశీలించడంతోపాటు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు. పవన్‌కు రెండో బ్లాక్‌ లోని మొదటి అంతస్తులో 212 నెంబర్‌ పేషీని కేటాయించారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో ఆర్థిక శాఖకు కేటాయించిన పేషీలోనే పవన్‌కు కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి ఉన్న పేషీ నెంబర్‌ 211లో నాదెండ్ల మనోహర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులోని మూడు పేషీలు వరుసగా మిత్రపక్షం జనసేన మంత్రులకు, డిప్యూటీ సీఎంకు కేటాయించారు. సుమారు గంటన్నరపాటు పవన్‌ సెక్రటేరియట్‌లో గడిపారు. రెండో బ్లాక్‌లో ఉన్న తన పేషీని నిశితంగా పరిశీలించారు. అనంతరం మొదటి బ్లాక్‌కు వెళ్లిన పవన్‌.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎంను ఆలింగనం చేసుకుని సాదర స్వాగతం పలికారు. అనంతరం పేషీలో కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా.. సీఎం పేషీలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించిన పవన్‌.. ‘మీరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారు సార్‌’ అని వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ ధన్యవాదాలు పవన్‌ అన్నారు.
విజయవాడలో విడిది కార్యాలయం పరిశీలన
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోసం విజయవాడ జలవనరుల శాఖలోని విడిది కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్‌ నేరుగా విజయవాడలోని జలవనరులశాఖ అతిథిగృహం వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్‌ పరిశీలించారు. పైఅంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్‌ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img