స్పెయిన్ మహిళల డిమాండ్
వేలాది మందితో ప్రదర్శన
మాడ్రిడ్: అసమానతలను రూపుమాపాలని, తమకు సమాన ప్రయోజనాలు కల్పించాలని స్పెయిన్‌లో మహిళలు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది రోడ్లపైకొచ్చారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. లింగ అసమానత్వాన్ని వ్యతిరేకంచారు. రాజధాని మాడ్రిడ్‌లోని ప్లాజా సిబెలెస్ ఫౌంటెయిన్ పర్పల్ విద్యుదీకరణతో ఆకర్షించింది. నిరసనకారులు తెల్ల మాస్కులు, జుబ్బాలు ధరించి, కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. ‘మేము మహిళలం. మా స్వరాన్ని చాలా కాలంగా వినిపించుకోవడం లేదు. సమాన ప్రయోజనాలు లేక విస్తుపోయాం. కనీస అవసరాల కోసం పోరాడాల్సి వస్తోంది’ అని బార్సిలోనాలో నిరసనకారులు అసహనం వ్యక్తంచేశారు. మొత్తం 40 నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. కాగా, గతేడాది జులైలో సార్వత్రిక ఎన్నికల వల్ల నిలిచిపోయిన మానవ అక్రమ రవాణా చట్టాన్ని పునరుద్ధరించినట్లు మహిళా దినోత్సవం సందర్భంగా స్పెయిన్ ఈక్వాలిటీ మంత్రి ఆనా రెడోండో ప్రకటించారు.