Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

కొలువుదీరిన తాలిబన్‌ తాత్కాలిక సర్కార్‌

అఫ్గాన్‌ ప్రధానిగా ముల్లా హసన్‌
33మందితో కేబినెట్‌

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్‌లో నూతన ఇస్లామిక్‌ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందని తాలిబన్‌ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ మీడియా గోష్టిలో నూతన మంత్రివర్గ జాబితాను విడుదల చేశారు. కేబినెట్‌లో మహిళలకు చోటుదక్కలేదు. హక్కానీ నెట్‌వర్క్‌కే కీలక పదవులు లభించాయి. కీలకనేత సిరాజ్‌ హక్కానీ హోం మంత్రి పదవి చేపట్టారు. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుగా ఈయన తలపై 10 మిలియన్‌ డాలర్ల బహుమతి ఉంది. ముల్లా మొహహ్మద్‌ హసన్‌ అఖుంద్‌కు(60) ప్రధానమంత్రి పదవి దక్కింది. తాలిబన్ల సుప్రీం నేత హైబతుల్లా అఖుంద్‌ జాదాకు ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ అత్యంత సన్నిహితుడు. తాలిబన్లకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయనను ప్రధానిగా నియమించారు.
అఖుంద్‌ నాయకుడిగా కన్నా రాజకీయవేత్తగా ఎక్కువగా రాణించారు. ఈయనకు మిలిటరీ వ్యవహారాలను శాసించే అవకాశం కూడా లభించింది. కాందహార్‌కు చెందిన అఖుంద్‌ ముల్లా ఒమర్‌కు సన్నిహితుడు. ఐక్యరాజ్యసమితి నిషేధిత వ్యక్తుల జాబితాలో అఖుంద్‌ ఉన్నారు. తాలిబన్‌ రాజకీయ వ్యవహారాల అధిపతి అబ్దుల్‌ ఘని బరాదర్‌ను ఉపప్రధానిగా నియమించారు. హక్కాని నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుని కుమారుడు సిరాజుద్దీన్‌ హక్కానీ ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రిగా, ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా మహ్మద్‌ యాకూబ్‌ను రక్షణమంత్రిగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిగా ముల్లా హిదయుతుల్లా బద్రీని నియమించారు. నూతన తాత్కాలిక ప్రభుత్వంలో 33మంది సభ్యులు ఉంటారు. మిగిలినవారిని త్వరలో ప్రకటిస్తానని ముజాహిద్‌ తెలిపారు. ఐక్యరాజ్యసమితి మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలోని 5మంది ఇప్పుడు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తాలిబన్‌యేతరులు కూడా మంత్రివర్గంలో ఉండాలన్న అంతర్జాతీయ సమాజం డిమాండ్‌ అయినప్పటికీ వేరెవరూ మంత్రివర్గంలో లేరు. దోహాలో తాలిబన్ల తరఫున ముఖ్య ప్రతినిధిగా పాల్గొన్న ముల్లా అమీర్‌ఖాన్‌ ముత్తాకీ విదేశాంగ మంత్రిగా నియమించారు.
గత ప్రభుత్వంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. అబ్బాస్‌ స్థాన్‌కిజాయ్‌కని విదేశాంగ శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. శాంతి చర్చల్లో ఈయన కీలకపాత్ర పోషించారు. సైన్యాధ్యక్షుడుగా కారీ ఫసీహుద్దీన్‌ బదక్షానీ నియమితులయ్యారు.
పీహెచ్‌డీలు, మాస్టర్స్‌కు విలువలేదు
పీహెచ్‌డీలకు, మాస్టర్స్‌కు విలువలేదని అఫ్గాన్‌లో తాలిబన్‌ విద్యాశాఖ మంత్రి షేక్‌మౌల్వి నూరుల్లా వింతైన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లకు, ముల్లాలకు పీహెచ్‌డీలు, డీగ్రీలు లేవని,కనీసం హైస్కూల్‌ విద్య కూడా లేదని కానీ వారు అధికారం చేపట్టలేదా..అని ప్రశ్నించారు. వారే అందరికంటే గొప్పగా ఉన్నారన్నారు.
నాలుగోరోజు మహిళలు నిరసన
అఫ్గాన్‌లో మహిళలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. నాలుగోరోజు బుధవారం మహిళలు తమ హక్కులు కాపాడాలని రోడ్లపైకి వచ్చారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాక్‌ తలదూర్చరాదని గళమెత్తారు. తాలిబన్లు మహిళలపై దాష్టీకానికి దిగారు. తుపాకులు ఎక్కుపెట్టి మహిళలపై ఒత్తిడి తెచ్చినప్పటికీ వారు తమ ఆందోళన కొనసాగించారు. వార్తలను కవర్‌చేసే జర్నలిస్టులను సైతం తాలిబన్లు బెల్టులతో కొట్టారు.
ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు తాలిబన్లు 20మందికిపైగా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. షరియా చట్టాలను అమలుచేస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారు. బాలికలకు విద్యఅవసరం లేదన్నారు. తాజాగా తాలిబన్లు మహిళలుక్రికెట్‌ సహా ఎటువంటి క్రీడలు ఆడరాదన్నారు. వాటిపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img