Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

పేరు మార్చుకున్న టర్కీ.. ఆమోదించిన ఐక్యరాజ్యసమితి

టర్కీ దేశం తన పేరును మార్చుకుంది. ఇక నుంచి టర్కీకి బదులుగా టర్కియేగా మారనుంది. టర్కీ అనే పదంలోనే సమస్య ఉండడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమను కొత్త పేరుతోనే గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్‌ కావూసోగ్లు ప్రతిపాదన చేశారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. తమ దేశాన్ని టర్కీకి బదులుగా టర్కియేగా పిలవాలని కోరారు. ఈ అభ్యర్థనను ఐక్యరాజ్య సమితీ కూడా ఆమోదించింది. యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌కు టర్కీ విదేశాంగ మంత్రి కవసొగ్లూ లేఖ రాశారు. టర్కీ ప్రభుత్వం పంపిన లేఖను స్వాగతిస్తున్నట్లు యూఎన్‌ తెలిపింది. అయితే పేరు మార్పు ప్రక్రియ గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. అధ్యక్షుడు రీసెప్‌ తయ్యప్‌ ఎర్డగాన్‌ నేతృత్వంలో ఆ ఉద్యమం సాగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడిరచారు. దేశ బ్రాండ్‌ వాల్యూను పెంచే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవసొగ్లూ తెలిపారు. యూఎన్‌కు లెటర్‌ అందిన రోజు నుంచే కొత్త పేరును అమలులోకి తీసుకువచ్చారు. టర్కిష్‌ ప్రజల సంస్కృతి, నాగరికత, విలువలకు కొత్త పేరు ప్రత్యామ్నాయంగా ప్రతిబింబిస్తుందని గతంలో అధ్యక్షుడు ఎర్డగోన్‌ తెలిపారు.
నిజానికి టర్కీ అనేది ఒక పక్షి పేరు. దానికి ఫెయిల్యూర్‌, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లీష్‌ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ పేరును మార్చుకోవడానికి టర్కీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గత జనవరి నెలలో హలో టర్కియే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఇక ఆ దేశం ఎగుమతి చేసే ఉత్పత్తులపై మేడ్‌ ఇన్‌ టర్కీకి బదులుగా మేడ్‌ ఇన్‌ టర్కీయేగా ముద్రించనున్నారు. టర్కిష్‌ మంత్రిత్వ శాఖలు అధికారిక పత్రాల్లో టర్కియేని ఉపయోగించడం ప్రారంభించాయి.
దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దాని పేరును మార్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రమోషనల్‌ వీడియోను కూడా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఆ వీడియో ప్లే అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంది. ఆ వీడియోలో ‘‘హలో టర్కియే’’ అని చెబుతున్నట్టు ఉంది. అయితే దేశ పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దేశంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఇది చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది ప్రజలు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్చడంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img