దక్షిణ కాలిఫోర్నియాలో హోటల్ వర్కర్ల డిమాండ్ – సమ్మె
లాస్ ఏంజిల్స్: కోవిడ్ తర్వాత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయామని, జీతాల్లో కోతలు తప్ప తమకు యాజమాన్యాలు ఇచ్చినదేమీ లేదని, తమ వేతనాలను తక్షణమే పెంచాలన్న డిమాండ్‌తో దక్షిణ కాలిఫోర్నియాలో హోటల్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. మెరుగైన వసతులు, సంక్షేమానికి డిమాండ్ చేశారు. యాజమాన్యాల తీరును దుయ్యబట్టారు. వేలాది మంది రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. మెరుగైన వేతనాల కోసం ప్లకార్డులతో కదం తొక్కారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఫోర్త్ ఆఫ్ జులై హాలిడే సందర్భంగా పర్యాటకుల తాకిడి పెరిగిన సమయంలో హోటల్ వర్కర్లు ఆందోళనకు దిగడంతో సుమారు 65 పెద్ద హోటళ్లపై ప్రభావం కనిపించింది. నాలుగు రోజుల సెలవులు ముగిసే వరకు విధులకు హాజరయ్యేది లేదని నిరసనకారులు తేల్చిచెప్పారు. యజమానుల అత్యాస తమకు శాపంగా మారిందని దక్షిణ కాలిఫోర్నియా, ఆరిజోనాలోని 32,000 మందికిపైగా వర్కర్లకు ప్రాతినిధ్యం వహించే యునైట్ హియర్ లోకల్ 11 సహ`అధ్యక్షుడు కర్ట్ పీటర్సెన్ వ్యాఖ్యానించారు. పరిశ్రమకు బయిలౌట్లు లభిస్తే తమకు దక్కినది కోతలన్నారు. వర్కర్లతో రాజీకి ప్రయత్నించకపోవడం సిగ్గుచేటన్నారు. తాజా సమ్మెలో 15వేల మంది పాల్గొన్నారని, లాస్ ఏంజిల్స్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఆరెంజ్ కౌంటీస్తో సహా రిట్స్ కార్లోట్టన్, హిల్టన్, మారియట్, ఫోర్ సీజన్స్ తదితర 65 ప్రధాన హోటళ్లు ప్రభావితమయ్యాయని కార్మిక సంఘం తెలిపింది. వర్కర్ల సమ్మెకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ‘కార్మికులు హక్కులపై దాడులు జరిగినప్పుడు ఏం చేస్తాం? పోరాడతాం’ హ్యాష్‌ట్యాగ్ సోకాల్ హోటల్ స్ట్రైక్’ పోస్టులు వైరలయ్యాయి.