Friday, May 3, 2024
Friday, May 3, 2024

వాతావరణ లక్ష్యాలపై విఫలమైన జి-20

నేపుల్స్‌ : వాతావరణ లక్ష్యాలపై ఒక ఒప్పందానికి రావడంలో జి-20 దేశాలు విఫలమయ్యాయని ఇటలీ పర్యావరణ మంత్రి రాబర్ట్‌ సింగొలని తెలిపారు. నవంబరులో గ్లాస్గోలో ఐక్యరాజ్య సమితి అధ్వర్యాన జరగనున్న వాతావరణ చర్చలకు ముందుగా జి-20 సమావేశం జరిగిన విషయం తెలిసిందే. జి 20 సదస్సులో చర్చించాల్సిన రెండు వివాదాస్పద అంశాలపై మంత్రులు అంగీకరించలేదని సింగొలని తెలిపారు. అక్టోబరులో రోమ్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో జి-20 దేశాల అధినేతలు వాటిని చర్చిస్తారని ఇటలీ మంత్రి చెప్పారు. చైనా, రష్యా, భారత్‌లతో చర్చలు చాలా క్లిష్టంగా జరిగాయని తెలిపారు. బొగ్గు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమనేది 2025 కల్లా నిలిపివేయాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. అది తమకు సాధ్యం కాదని కొన్ని దేశాలు చెబుతున్నాయని, ఇదొక వివాదాస్పద అంశంగా మారిందన్నారు. గ్లాస్గోలో ఐక్యరాజ్య సమితి అధ్వర్యంలో నవంబరులో జరిగే వాతావరణ మార్పు సదస్సు(కాప్‌ 26) కంటే ముందుగా వాతావరణంపై జరిగే చర్చల కోసం బ్రిటన్‌ 51 దేశాలతో సమావేశమైంది. ఈ రెండు రోజుల సమావేశానికి బ్రిటన్‌ మంత్రి అలోక్‌ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో పరిష్కారం అవసరమయ్యే ముఖ్య సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 18 నెలల్లో జరిగిన మొట్టమొదటి ముఖాముఖి మంత్రివర్గ సమావేశమిది. భవిష్యత్తు తరాలకు ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం సమష్టిగా పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయడానికి సంకల్పిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img