Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

గ్రామ పంచాయతీ భూములకు వేలం పాటలు

విశాలాంధ్ర – ఆస్పరి : మండల పరిధిలోనే జోహరాపురం గ్రామపంచాయతీకి సంబంధించిన వ్యవసాయ సాగు భూములకు జిల్లా పంచాయితీ అధికారులు బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. బుధవారం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో సర్పంచ్ నెల్లూరప్ప అధ్యక్షతన పత్తికొండ ఇంచార్జి డిఎల్ పి ఓ ప్రకాష్ నాయుడు సమక్షంలో పంచాయితీ, రెవిన్యూ అధికారులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ వేలం పాటలను నిర్వహించారు. సర్వే నెంబర్‌ 578 లో 36.21 ఎకరాలు, అలాగే సర్వే నెంబర్‌ 645, 646, 648 లలో 15.71 ఎకరాలు మొత్తం 52 ఎకరాల సాగు భూమికి సంబంధించి నాలుగు భాగాలలో 12 ఎకరాలు చొప్పున విభజించి ఒక సంవత్సర కాలం పాటు మాత్రమే కౌలుకు ఉండే విధంగా ఈ వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలం పాటలో పదివేల రూపాయలు డిపాజిట్ చేసి మొత్తం ఏడు మంది పాటాదారులు పాల్గొన్నారు. ముఖాముఖి గా జరిగిన వేలం పాటలలో మొదటి భాగం 12 ఎకరాలను 98 వేలకు షేక్షావలి, రెండవ భాగం 12 ఎకరాలను లక్ష 3వేలకు గురుస్వామి, మూడవ భాగం 12 ఎకరాలను 93 వేలకు గురుస్వామి, నాలుగవ భాగం 15.71 ఎకరాలను లక్ష 20 వేలకు ఈరన్న అను రైతులు దక్కించుకున్నారు. వేలం పాట పాడిన రైతులు మొత్తం డబ్బులు చెల్లించి కౌలు హక్కును దక్కించుకోవాలని పత్తికొండ ఇన్చార్జి డిఎల్పిఓ ప్రకాష్ నాయుడు పేర్కొన్నారు. పంచాయితీ భూముల వేలంపాటలో గ్రామపంచాయతీకి మొత్తం 4 లక్షల 14 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈఓఆర్ డి తెలిపారు. ఈ వేలం పాటలో ఎంపీటీసీ శ్రీరాములు, ఈ ఓ ఆర్ డి సూర్య నరసింహారెడ్డి, పంచాయితీ కార్యదర్శి జంప్లా నాయక్, రవి కుమార్, వీఆర్ఓ మాబు సుభాన్ గ్రామ పెద్దలు నాగరాజు, ఎర్రి స్వామి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img