Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కొత్తతరం తెలుగు ప్రజలకు, పాత్రికేయులకు మంచిదారి ‘మూడుదారులు’

నాంచారయ్య మెరుగుమాల

దాదాపు 75 సంవత్సరాల తెలుగు నేల రాజకీయ చరిత్రను పూసగుచ్చినట్టు వివరించే విలువైన పుస్తకం ‘మూడు దారులు’. జగమెరిగిన జర్నలిస్టు సంఘాల నేత, ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్‌ రాసిన ఈ గ్రంథంలో తెలుగునాట రాజకీయాలకు, ఎన్నికలతో ముడిపడిన కొన్ని ఉద్యమాలకు సంబంధించిన సమాచారం నిండుగా ఉంది. ముఖపత్ర చిత్రంపై కనిపించే ముగ్గురు నాయకుల వ్యవహార సరళిపై రచయిత ఈ పుస్తకంలో వెంటవెంటనే వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాఠకులు ఏకీభవించకపోవచ్చు. అయితే, స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్‌ స్టేట్‌లో, మద్రాసు, ఆంధ్ర రాష్ట్రంలో పరిణామాలు, ఆంధ్రప్రదేశ్‌ అధికార రాజకీయాల సమాచారం అక్కడక్కడా ముందూ వెనకగా కాస్త గజిబిజిగా కనిపించినా నేటి తరం పాత్రికేయులకు తమకు తెలియని అనేక పరిణామాలను ఇది పరిచయం చేస్తుంది. వాటిపై భిన్న కోణాలను చూపిస్తుంది. ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రగా పరిగణించే ఈ పుస్తకంలోని ప్రధాన ‘హీరోలు’ నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలతో రచయితకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కడప జిల్లా రాజకీయ పునాదిగా ముఖ్యమంత్రులుగా ఎదిగిన డాక్టర్‌ వైఎస్‌, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌తో రచయితకు చంద్రబాబుతో పోల్చినప్పుడు సంబంధబాంధవ్యాలు కొద్దిగా ఎక్కువ. అయితే, ఈ ముగ్గురు నేతల పాలనాకాలంలో అమర్‌ ప్రభుత్వ పదవుల్లో ( ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌, 2019 నుంచీ ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతరరాష్ట్ర వ్యవహారాల సలహాదారు) కొనసాగారు. వారు ముగ్గురినీ చాలా దగ్గరగా చూశారు. డాక్టర్‌ వైఎస్‌, జగన్‌ పై దేవులపల్లి అమర్‌కు అభిమానం కొద్దిగా ఎక్కువ అనే అభిప్రాయం కూడా పుస్తకం చదివి పక్కనపెట్టాక మనకు కలుగుతుంది.
రెండు ఆగస్టు ‘వెన్నుపోటు’ ఘటనలపై చెప్పిన విషయాల్లో కొత్తవేవీ లేదుగాని… తెలుగుదేశం స్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సీఎం పదవిలో ఉండగా తొలుత 1984లో, మళ్లీ పదేళ్ల తర్వాత 1995లో ఆగస్టు సంక్షోభాల పేరుతో సంభవించిన పరిణామాలపై రచయిత పూసగుచ్చినట్టు రాసిన వివరాలు, వ్యాఖ్యలు చాలా వరకు తెలిసినవే. హైదరాబాద్‌ కేంద్రంగా దశాబ్దాలుపాటు పనిచేసిన అమర్‌కు ముగ్గురు పెద్ద నేతలతో సుహృద్భావ సంబంధాలున్నప్పటికి ఈ సంక్షోభాల సమయంలో తెరవెనుక జరిగిన, చాలా మందికి తెలియని రాజకీయ లోగుట్లు ‘మూడు దారులు’ల్లో వెల్లడవుతాయని భావించిన పలువురు తెలుగు జర్నలిస్టులకు కొంతవరకు ఆశాభంగమే ఎదురైంది. ఎన్టీఆర్‌ మూడో అల్లుడు, కాంగ్రెస్‌ పార్టీలో మూలాలు కలిగి ఉండడంతోపాటు కాంగ్రెస్‌ సంస్కృతిని నరనరాన జీర్ణించుకున్న ‘హైటెక్‌’ మాజీ సీఎం చంద్రబాబులోని చీకటి కోణాలను. పదవీకాంక్షను. తన వర్గానికి, భజనపరులకు లోపాయికారిగా మేలు చేసే స్వభావాన్ని నిర్మొహమాటంగా ఇలా పుస్తక రూపంలో ఎవరైనా ఎండగట్టవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే, ఇప్పటికే ఎందరో జర్నలిస్టులు, రాజకీయ పండితులు ఆ పని చేసేశారు. మరి పాత వివరాలతో, పదే పదే విన్న పాత వ్యాఖ్యలతో కాకలుతీరిన జర్నలిస్టు అమర్‌ ఇప్పుడు ‘మూడు దారులు’ పేరుతో ఈ పుస్తకం రాయడం సాధారణ ప్రజానీకానికి పెద్దగా ప్రయోజనం లేని కసరత్తు.
రాష్ట్ర రాజకీయాలను దురదృష్టకరమైన మలుపు తిప్పిన 1955 ఆంధ్ర రాష్ట్ర శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషణాత్మకంగా, క్లుప్తంగానైనా వివరించగల గొప్ప రాజకీయ, పాత్రికేయ నేపథ్యం ఉన్న అమర్‌ ఆ పని చేయలేదు. అంతేకాదు, ఆ ఎన్నికల్లో కమ్మలు అంతా కమ్యూనిస్టులకు ఓటేసినట్టు, మెజారిటీ రెడ్లు కాంగ్రెస్‌ గెలుపులో ప్రధాన భూమిక పోషించినట్టు ఆయన రాశారు. వాస్తవానికి కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోస్తా జిల్లాల్లో పలుకుబడి కలిగిన అనేక మంది కమ్మ నేతలను తనవైపునకు తిప్పుకుంది. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. ఈ పెత్తందారీ కమ్మ నాయకులు కమ్యూనిస్టుల పరాజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఆంధ్రా స్టేట్‌ రాజకీయాలను రెడ్ల ఆధిపత్యంలోని కాంగ్రెస్‌, కమ్మ ప్రాబల్యంలోని సీపీఐ మధ్య రాజ్యాధి కారం కోసం జరిగిన ఎన్నికల పోరాటం అనే తీరులో (1955 ఎన్నికలను కూడా) వర్ణించడం మేధోపరమైన బద్ధకమే అనిపిస్తుంది. మూడేళ్లు మాత్రమే ఉనికిలో ఉన్న ఆంధ్రరాష్ట్ర ఎన్నికల్లో 29 శాతం ఓట్లు వచ్చినా కేవలం 15 సీట్లు తెచ్చుకుని ఘోర పరాజయం పాలైన కమ్యూనిస్టు పార్టీ అప్పట్లో ఘోర తప్పిదం చేసింది. సీపీఐ నాయకత్వం అనేకమంది తమ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను ‘ఇక మనకు అధికారం రాదు. ఇప్పటికే పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇక మీరు మీకు అనువైన వేరే దారి చూసుకోండి. సానుభూతిపరులుగా కొనసాగండి,’ అనే లోపాయికారి సందేశంతో తెలుగునాట అస్త్ర సన్యాసం చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా నడిచిన విప్లవ కమ్యూనిస్టు రాజకీయా లతో, వామపక్ష మేధావులు, పౌరహక్కుల సంఘాలు, సంస్థలతో గతంలో, ఇప్పుడు సజీవ సంబంధాలున్న దేవులపల్లి అమర్‌ ఇలాంటిలోతైన, నేటితరం యువత తెలుసుకోవాల్సిన విషయాల జోలికి పోకుండా ముగ్గురు రాష్ట్ర నాయకులు, వారి చుట్టూ తిరిగిన రాజకీయాలకు, వారి పాలనావిషయాలకు ఈ పుస్తకంలో పరిమితం కావడం నిజంగా విషాదం. మా తరం జర్నలిస్టులకు స్ఫూర్తినిచ్చిన సమరశీల జర్నలిస్టు అమర్‌ ఏడున్నర దశాబ్దాల తెలుగు రాజకీయాలపై ఒక సగటు పాత్రికేయుడు లేదా రాజనీతి శాస్త్ర అధ్యాపకుడి మాదిరిగా ఈ పుస్తకంరాసి జనంమీదకు వదలారా? అనే అనుమానం చాలా మందిని పీడిస్తోంది. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు, రాజ శేఖరరెడ్డి రాజకీయ శైలి, వ్యక్తిత్వం, ఇతరులతో వ్యవహరించే తీరు, ప్రజా సంక్షేమంవిషయంలో వారి అంకితభావం గురించి రచయిత చక్కగా విశ్లేషించారు. అయితే, వైఎస్‌ జగన్‌ పాలనా విధానాలు, సంక్షేమ రాజ్య స్థాపనలో ఆయనకున్న కారణాల గురించి, జగన్‌ రాజకీయ పునాది గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించే పెద్ద లోటు. పీవీ గురించి ప్రశంసాపూర్వకంగా రాసిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌ చట్టసభల సభ్యుల్లో కనీసస్థాయి మద్దతుగాని, జనంతో మంచిసంబంధాలు గాని లేని అపర చాణుక్యుడు పాములపర్తి వారికి 1970ల్లో ఉన్న బలహీనతలు, లోపాల గురించి కొద్దిగా కూడా రచయిత ఇందులో చెప్పక పోవడం దారుణం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏపీ కాంగ్రెస్‌ శాసనసభా పక్షంతో విస్తృతంగా సంప్రదించకుండా, ఏకపక్షంగా నరసింహారావును ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌పై రుద్దడం వల్లే అనేక దుష్ప్రరిణామాలు తెలుగు రాజకీయాల్లో సంభవించాయని పాత తరం రాజకీయ పరిశీలకులకు తెలుసు. 1971 చివర్లో కాసు బ్రహ్మానందరెడ్డి ఖాళీచేసిపోయిన కుర్చీ ఎక్కిన పీవీ రాజధాని ఢల్లీిపోయి వారం పదిరోజులు కూర్చున్నా కాంగ్రెస్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడం అప్పట్లో జగ మెరిగిన సత్యం. అలాగే, ఏపీ అవతరణ నాటి నుంచి 1982లో తెలుగుదేశం స్థాపన తర్వాత కొన్ని నెలల వరకూ పాలకపక్షంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో, మంత్రివర్గంలో బలమైన రెడ్డి, కమ్మ వర్గాల మధ్య సమతూకం పాటించడానికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ లేదా కేంద్ర నాయకత్వం అత్యంత శ్రద్ధతో ప్రయత్నించింది. చాలా వరకు ఈ విషయంలో సఫలమైంది. ఏపీలో కమ్మ కాంగ్రెస్‌ నేత ఎవరికీ సీఎం పదవి ఇవ్వలేదు గాని కొత్త రఘురామయ్య వంటి సమర్ధ కమ్మనేతను కేంద్ర మంత్రివర్గం లోకి తీసుకుని కీలక శాఖలు అప్పగించారు ఇందిరమ్మ. 1978-83 మధ్య ఏపీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏవిధంగా రెడ్ల అంతర్గత కీచులాటలకు అడ్డాగా మారి పోయాయో, అధికార కాంగ్రెస్‌ రెడ్ల నాయకత్వంపై తెలుగు ప్రజల్లో ఎలాంటి ఏవగింపు కలిగిందో కూడా పుస్తక రచయిత కనీసం ప్రస్తావించలేదు.
అసలు ఏపీ రాజకీయాలను శాసించిన లేదా వాటిలో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్‌ కమ్మ, రెడ్డి ఫ్యాక్షన్ల గురించి పేరు పెట్టి వ్యాఖ్యానించకపోవడం మార్క్సిస్టు అవగాహన, విశ్లేషణా సామర్ధ్యం ఉన్న అమర్‌ పుస్తకంలో చాలా పెద్ద లోపంగా కనిపిస్తోంది. అలాగే, మొదట అన్ని కులాలకూ కాకపోయినా రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాల్లో అసంతృప్తి లేకుండా దశాబ్దాలపాటు జాగ్రత్తపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వాలు. కాని, 1983 జనవరి నుంచి ఏడేళ్ల ఎన్టీఆర్‌ పాలన తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో, పార్టీ పదవుల్లో రెడ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, 1995-2004 మధ్య నారా చంద్రబాబునాయుడు పాలన, 2004-2009 మధ్య డాక్టర్‌ వైఎస్‌ హయాం తర్వాత ఏపీ రాజకీయాలు అధికారం కోసం, వనరులపై పెత్తనం కోసం ఒక జాతీయపక్షం (కాంగ్రెస్‌), ఓ ప్రాంతీయపక్షం(టీడీపీ) మధ్య తీవ్ర పోరాటానికి, పోటీకి వేదికగా మారిపోయాయి. చివరికి ఇవి పెత్తందారీ రెడ్లు, కమ్మల మధ్య ఆధిపత్య పోరులాగా ఇతర రాష్ట్రాల వారికి సైతం కనిపించాయి. అమర్‌ వంటి ఆధునిక భావాలున్న బుద్ధిజీవి ఇలాంటి విషయాలను కూడా ఈ పుస్తకంలో లోతుగా విశ్లేషించి ఉంటే బాగుండేది. ఏదేమైనా తెలుగునాట రాజకీయాల గురించి సమగ్ర సమాచారం మాత్రం దేవులపల్లి అమర్‌ రాసిన ఈ గ్రంథంలో పుష్కలంగా దొరుకుతుంది. కొత్త తరానికి చీకటిలో కరదీపికగా ఉపకరిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img