Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

జాతిహితానికి దారిదీపాలు

కల్లూరి భాస్కరం, 97034 45985

వార్తలు వర్తమాన చరిత్రను చెబుతాయి. సంపాదకీయాలు ఆ వార్తలకు వర్తమానచారిత్రకవ్యాఖ్యలేకాక, నేటి గమనాన్ని ఆధారం చేసుకుని రేపటి గమనాన్ని అంచనా వేసే దిక్సూచులు కూడా అవుతాయి. పత్రికారచయిత నిత్యం జరిగే అనేకపరిణామాల మధ్యలో కూర్చుని ఉంటాడు కనుక వాటిని నిశితంగా చూస్తూ, వాటి పూర్వాపరాల గురించిన జ్ఞానాన్ని మెదడు మూలల్లో దాచుకుంటూ ఉంటాడు. వాటి దశను, దిశను మనసులోనే నిగ్గు తేల్చుకుంటూ ఉంటాడు. అతనే సంపాదకీయ రచయిత కూడా అయినప్పుడూ రాజకీయాలు, ఆర్థికత, సంస్కృతి, సాహిత్యం, కళలతో సహా ప్రజాజీవనంతో ముడిపడిన అన్ని విషయాలలో ఆయనకు చెప్పుకోదగిన పాండిత్యం ఉన్నప్పుడూ సంపాదకీయరూపంలో ఆయన చేసే చర్చకు, ఇచ్చే సూచనలకు సహజంగానే ఎనలేని విలువ సిద్ధిస్తుంది. సంపాదకీయాల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవలసినది ఈ కోణం నుంచి!
కానీ దురదృష్టం కొద్దీ, అసలు సంపాదకీయం ఎందుకని ప్రశ్నిస్తూ, దానిని ఆరోవేలుగా తీసిపారేసే కురచబుద్ధులు పత్రికారంగంలోనే బయలుదేరడం చూస్తున్నాం. ఆవిధంగా సంపాదకీయాలలో ఏం చెబుతున్నారో అనే కాకుండా సంపాదకీయాలు ఎందుకో కూడా చెప్పాల్సిన దుర్గతి స్వయంగా పత్రికారంగాన్నే నేడు ఆవహించింది. అలాంటివారికే కాక, దేశగమనాన్ని, సామాజికగమనాన్ని చారిత్రకదృక్కోణం నుంచి అర్థం చేసుకోగోరే ప్రతి ఒకరికీ గొప్ప పాఠాలు అనదగినవి చక్రవర్తుల రాఘవాచారిగారి సంపాదకీయాలు. ఈ సంపుటానికి రాసిన ముందుమాటలో ప్రముఖ పత్రికారచయిత ఆర్వీ రామారావు అన్నట్టు సంపాదకీయరచన సద్యోసృజనే అయినా, ప్రజావ్యవహారాలకు సంబంధించిన అన్ని అంశాల మీదా సమ్యగవగాహన కాకపోయినా, తగినంత అవగాహన రచయితకు ఉండవలసిందే అయినా, రాఘవాచారిగారికి గల విస్తారమైన జ్ఞానసంపద ఆయన సంపాదకీయాలకు అదనపు విలువను సంతరిస్తోంది.
రాఘవాచారిగారు పత్రికారంగంలో తమదైన ముద్ర వేసిన విశిష్టసంపాదకుల కోవలోనివారు. ఇటీవలి తరానికి చెందిన పత్రికారచయితలందరికీ కులపతివంటివారు. ఆయన ఒక పార్టీ పత్రిక అయిన విశాలాంధ్రకు సంపాదకులుగా ఉన్నా ఇతర పత్రికల్లోని సంపాదకసిబ్బందే కాక, సంపాదకులు కూడా ఆయా విషయాలలో ఆయనను ప్రమాణంగా తీసుకుని గౌరవిస్తూవచ్చారు. అటువంటి వ్యక్తి రాసిన సంపాదకీయాలను సంపుటాలుగా తీసుకురావడానికి ట్రస్ట్‌ పూనుకోవడం ఎంతైనా అభినందనీయం. సాహిత్యం, సంస్కృతి, కళలు అనే వర్గీకరణ కింద, 91 సంపాదకీయాలతో వెలువరించిన ప్రథమసంపుటం ఇది.
1974-2000 మధ్యకాలానికి చెందిన ఈ సంపాదకీయాలు, ఈ పాతికేళ్ళ పైబడిన కాలంలోనూ సాహిత్యం, సంస్కృతి, కళల రంగంలో ఏం జరిగిందో, ఏం జరగలేదో, ఇంకా జరగవలసింది ఎంతో- ఆ మొత్తం చరిత్రను అంతటినీ మన కళ్ళముందు పరుస్తాయి. జాతీయోద్యమమూ ప్రత్యేకించి తెలుగునాట గురజాడ, కందుకూరి, గిడుగు, కొమర్రాజు, సురవరం నేతృత్వంలో మొదలైన సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాల అజెండాను రాఘవాచారిగారు పదేపదే ప్రస్తావిస్తూ అవి అసంపూర్ణంగా మిగిలిపోవడంపై అమితమైన బాధనూ, నిగ్రహంతో కూడిన క్రోధాన్ని వెల్లడిస్తారు. ఆ అజెండాలు అమలు కాకపోవడం వల్ల రాష్ట్ర, దేశస్థాయిలలో తలెత్తిన విషాదకరపరిస్థితులను, పరిణామాలను ఎత్తిచూపుతూ గర్హిస్తారు, హెచ్చరిస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే, జాతీయోద్యమ, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలూ, నాటి జాతీయచైతన్యమూ, దేశభక్తిగురించిన స్పృహ ఈ సంపాదకీయాలు అంతటా వ్యక్తమవుతూ వీటికి ఒక వస్త్వైక్యతను కల్పించాయి. రాఘవాచారిగారి ఆదర్శాల లోతును, ఆలోచనల నిడివిని, అవగాహనల వైశాల్యాన్ని ఆ వస్త్వైక్యతే నిర్దేశించింది.
ఉదాహరణకు, ప్రాంతీయభాషల అభివృద్ధి, అధికారభాషగా తెలుగు, అనుసంధానభాషగా హిందీ, త్రిభాషాసూత్రం మొదలైన భాషాసంబంధ అంశాలపై ఇందులో అనేక సంపాదకీయాలున్నాయి. ఇవి జాతీయోద్యమ అజెండాలో భాగమే. అలాగే, సాంస్కృతికపునరుజ్జీవన దృక్పథం నుంచి ఆకాశవాణి, దూరదర్శన్‌ వంటి ప్రసారసాధనాలు, చలనచిత్రాలు, ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థల యాజమాన్యంలోని పత్రికలు, సాహిత్యం, సంక్రాంతి, ఉగాది వంటి పండుగలు, కూచిపూడి వంటి సాంప్రదాయిక నృత్యరీతులు, పోతన, నన్నయ వంటి అలనాటి కవులు, గరిమెళ్ళ వంటి నిన్నటి కవులు, సమకాలీనులైన విద్వాన్‌ విశ్వం, దాశరథి, పుట్టపర్తి తదితరుల గురించి రాఘవాచారిగారు ఈ సంపాదకీయాలలో రాస్తారు, చర్చిస్తారు. సంప్రదాయంలోని మంచిని ఎంచి చూపుతూనే శాస్త్రవిజ్ఞానస్ఫూర్తిని మిళితం చేస్తూ నేటి కాలపు పురోగామిదృక్పథానికి అనుగుణంగా దానిని ఎలా సమన్వయించు కోవాలో- ప్రజలపట్ల ఎంతో బాధ్యతాయుతంగా బ్లూప్రింటు ఇచ్చుకుంటూ వెడతారు.
అయితే, ఈ పాతికేళ్ళ పైబడిన కాలంలో శాస్త్రసాంకేతికవిజ్ఞానరంగంలో వచ్చిన సమూలమైన మార్పుల దృష్ట్యా చూసినప్పుడు ఆకాశవాణి, దూరదర్శన్‌, చలనచిత్రపరిశ్రమ గురించి రాఘావాచారిగారు రాసిన సంపాదకీయాలకు కొంత హెచ్చుతగ్గులుగా ప్రాసంగికత తగ్గిన మాట నిజమే. ఉదాహరణకు, రేడియో, టీవీలపై ప్రభుత్వం ఆధిపత్యంగురించి, ప్రసారభారతి వంటి వ్యవస్థ అవసరం గురించి ఆయన వీటిలో చర్చిస్తారు. ఆ చర్చ అలా సాగుతుండగానే చాపకింద వచ్చిన మార్పులతో ప్రైవేట్‌ టీవీ చానెళ్ళు, ఎఫ్‌.ఎం రేడియోలు మొదలైనవి వచ్చి ప్రసారసాధనాలపై ప్రభుత్వం ఆధిపత్వాన్ని నిష్ప్రభావం చేశాయి. అయితే అనేక ఇతర విషయాలలో గొప్ప యుగచేతన, పరిణతి, పాండిత్యం కలిగిన ఒక సంపాదకుడిగా ఆయనలోని క్రాంతదర్శిత్వం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు, తెలుగు వంటి ప్రాంతీయభాషలను అధికారభాషలుగానే కాక, సాహిత్యభాషలుగా అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటిస్తూనే, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రానికి భిన్నంగా జాతీయస్థాయిలో హిందీ అనుసంధాన భాష కావడంవైపు మొదట్లో పూర్తిగా మొగ్గు చూపారు. అదే సమయంలో రాజ్‌ నారాయణ్‌ వంటి నాయకులు హిందీ దురభిమానాన్ని చాటుకుంటూ దక్షిణాదిజనానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించేసరికి, ఆ ధోరణిని గర్హిస్తూ హిందీని ఎట్టిపరిస్థితులలోనూ జనంపై బలవంతంగా రుద్దబోమన్న నెహ్రూ హామీని తరచు గుర్తుచేస్తూవచ్చారు. వైవిధ్యవంతమైన ఈ దేశంపట్ల సంపూర్ణస్పృహతో, ఆ వైవిధ్యానికి భంగం కలగరాదన్న లోతైన ఎరుకతో, దూరదృష్టితో ఆయన తన వాదంలో అవసరమైన సవరణ చేసుకోవడం సంపాదకుడిగా ఆయన పరిణతినే కాక, ప్రజలకు మార్గదర్శనంచేయడంలో ఆయన సంపాదకీయాల ప్రాముఖ్యాన్ని కూడా వెల్లడిస్తుంది. జమ్ము-కాశ్మీర్‌ తదితర అంశాలలో ప్రజలమనోభావాలపట్ల బొత్తిగా ఖాతరు లేని కేంద్రంలోని నేటి పాలకుల ఏకపక్షవ్యవహరణ దృష్ట్యా చూసినప్పుడు రాఘవాచారిగారు కనబరచిన పై విజ్ఞత విలువ, అందులోని మార్గదర్శకత ఎలాంటివో అర్థమవుతాయి. రాఘవాచారిగారు కూడా జాతీయతాస్ఫూర్తి, దేశభక్తి గురించే ఈ సంపాదకీయాలలో ఉద్బోధిస్తారు. ఇవే ఆదర్శాలు ఈ రోజున ఎటువంటి వికృతరూపం తీసుకున్నాయో గమనించినప్పుడు, రాఘవాచారిగారి సంపాదకీయాలు ఈ ఆదర్శాలకు సంబంధించిన ప్రజానుకూల, ఆరోగ్యకరపార్శ్వాన్ని చూపించి తమ విలువను ద్విగుణీకృతం చేసుకుంటాయి.
భాష విషయానికి వస్తే, ఒకవైపు సంస్కృతభాషానేపథ్యం కలిగిన పాండిత్యం, ఇతిహాస, కావ్యజ్ఞానం, మరోవైపు కులమతాతీతమైన సర్వసమానత్వాన్ని కాంక్షించే ప్రగతిశీలదృక్పథం రాఘవాచారిగారి భాషకు ఒక కొత్త తళుకునద్దాయి, వింత సోయగాలను తెచ్చాయి. ‘‘నోరు నొవ్వంగ నుడవని ప్రభుత్వనాయక శిఖామణి’, ‘కవుల ‘జరుగుబాటు’ ధోరణిపైనే ఆయన తిరుగుబాటు’, ‘భూపతులు పోయి శ్రీపతులు వచ్చారు’, ‘వెండితెర’ మీద నటించినవారు రాజకీయ రంగస్థలి మీద ‘జీవించడానికి’ లొంగోటాలు బిగించారు’, ‘కాన్వెంట్ల కలుపుమొక్కలు’ ‘కొత్తగా రాజకీయరంగస్థలికి ఎక్కిన సినిమాల శ్రీమంతులు’ మొదలైన ప్రయోగాలు, వాక్యవిన్యాసాలు కళ్లను మెరుపుల్లా తాకుతాయి.
జాతిహితాన్ని కోరే ప్రతి ఒకరికీ దారిదీపాలవంటి ఈ సంపాదకీయాల ప్రచురణకు పూనుకున్న సి. రాఘవాచారి ట్రస్ట్‌ శతథా అభినందనీయం. కాకపోతే ఇంత చక్కని ప్రచురణలో ఇకముందైనా అచ్చుతప్పులు దొర్లకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది.
అక్షర శస్త్రధారి చక్రవర్తుల రాఘవాచారి సంపాదకీయాలు
(మొదటి సంపుటి: సాహిత్యం, సంస్కృతి కళలు)
కూర్పు: ముత్యాల ప్రసాద్‌ ప్రచురణ: సి. రాఘవాచారి ట్రస్ట్‌, విజయవాడ
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, నవచేతన బుక్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు
లేదా బుడ్డిగ జమీందార్‌, ట్రస్టీ, ఫోన్‌ నెం-9849491969 వెల: 150/-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img