Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

జాషువా అముద్రిత పద్యం ` ఒక పరిచయం

రామడుగు వేంకటేశ్వరశర్మ, సెల్‌: 9866944287

‘‘అకలంక ప్రతిభా సముద్రులకు జోహారించు నీ వాణిచే
చికిలీలందిన ఆంధ్ర రత్నమణులన్‌ జేనందియానంద డో
లికఁదూగాడితి సత్యబద్ధమయి కల్తీలేక రాణించు భా
షకు నీ వ్రాత నిదర్శనంబగు వయస్యా! సత్యనారాయణా!!’’
ఈ పై పద్యం శ్రీ గుర్రం జాషువా రచన. ఇది అముద్రితం. ఆయనకు సత్యనారాయణ అనే ఒక మిత్రుడు ఉండేవారు. సత్యనారాయణ రచయిత. తాను రాసిన ఒక ముద్రణ గ్రంథాన్ని జాషువాకు పోస్టులో పంపారు. జాషువా ప్రముఖ కవి కావున చాలామంది సాహిత్య మిత్రులు తమ రచనలను తరచు పంపిస్తూ ఉండేవారు. జాషువా అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. అలా సత్యనారాయణ జాషువా తమ గ్రంథాన్ని పంపారు. పోస్టులో వచ్చిన గ్రంథాలను చదివి, జాషువా తమ అభిప్రాయాలను పోస్టు ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. సత్యనారాయణ పంపిన గ్రంథాన్ని జాషువా చదివారు. అది వచన గ్రంథమట. చదివిన వెంటనే పై పద్యాన్ని పోస్టుకార్డుపై వేగంగా జాషువా రాశారు.
పై పద్యంలో జాషువా సత్యనారాయణ ‘‘వయస్యా!’’ అని సంబోధించారు. దాదాపుగా సమానమైన వయసు, మనసు గల వానినే ‘వయస్యుడు’’ అని అంటారు. అటువంటి వ్యక్తి అన్న మాటసత్యనారాయణ. ఇంతకీ అది ఆంధ్రరత్నమణులను గూర్చి రాసిన గ్రంథమని జాషువా పద్యం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఆ గ్రంథంలో పేర్కొనబడిన వారందరూ మచ్చలేని ప్రతిభలో సాగరం వంటి వారని జాషువా తెలిపారు. అటువంటి గ్రంథాన్ని చదివి, ఆనందాన్ని పొందాననీ, అందులోని విషయాలు, భాష సత్యనిబద్ధాలై కల్తీ లేకుండా ఉన్నాయని జాషువా అభినందించారు. ఈ సందర్భంలో పై పద్యంలో ‘‘సత్య’’ పదాన్ని వాడి, తద్వారా సత్యనారాయణగారి పేరు సార్థకమైందని చమత్కారంగా ధ్వనింపజేశారు జాషువా.
ఇలా ప్రాస్తావికంగా, అలవోకగా జాషువా రాసిన పై పద్యంలోనే మరికొన్ని కవితా విశేషాలు స్ఫురిస్తాయి. ఇతర భాషా పదాలను చక్కగా, ఔచితీమహితంగా, కృత్రిమత్వం లేకుండా ఒదిగించే రచనా ధోరణి జాషువా పద్యాల్లో తరచుగా కనిపిస్తుంది. ఇక్కడ పై పద్యంలో మూడవ పాదంలో ‘‘కల్తీలేక రాణించు’’ అన్నది ఇందుకు నిదర్శనం. ఈ ‘‘కల్తీ’’ అన్నది హిందీ భాషా పదం. పైగా ఈ ‘‘కల్తీ’’ అన్న పదంలోని ‘‘ల్తీ’’ వర్ణాన్ని యతి స్థానంలో వాడడం వల్ల, ఆ దీర్ఘ గురుత్వం వల్ల ఉచ్చారణలో అర్థవంతమై జాషువా ఛందస్సంబంధమైన రచనానుభవపరిపాకం వ్యక్తమవుతోంది. అలాగే పై పద్యంలో నాలుగవ పాదంలోని ‘‘వయస్యా!’’ అన్న సంబోధనం కూడా అటువంటి ఛందస్సంబంధమైన రచనానుభవ పరిపాకాన్నే చాటుతోంది. అసలుఈ పద్యం మత్తేభ వృత్తం. సగణంతో ఆరంభం కావడం ఈ పద్య లక్షణం. సగణం అంటే మొదట రెండు లఘువులు, పిమ్మట ఒక గురువూ ఉంటుంది. ఈ లక్షణంతో కూడిన పదం మొదటగా ప్రతిపాదంలోనూ ఉండడం వల్లమనస్ఫురణకు ఒక విమానం పైకి లేచినట్టి గమనం కలిగి, ఉదాత్త గంభీరంగా సాగుతుంది మత్తేభవృత్తం. అదిగోఅటువంటి లక్షణం జాషువా పై మత్తేభ పద్యంలో కనిపిస్తుంది. పైపద్యం మొదటి పాదంలోని ‘‘జోహారించు’’ అన్న దేశీయ పదం కూడా యతిస్థానంలో ఒదిగి, రచనానుభవ పరిపాకాన్నే చాటుతోంది. అంతేకాదుపై పద్యంలోని పాదాలు కొన్ని పదాలతో అంతాలు కాకుండా, తరువాతి పాదాలలోనికి కొనలు సాగడం కూడా జాషువా ఛందో రచనానుభవ పరిపాకాన్నే వ్యక్తం చేస్తోంది. పై పద్యంలోని రెండవ పాదంలోని, ‘‘చికిలీలు’’ (మెరుగులు అని అర్థం) అన్న పదం కూడా దేశీయమైనదే! విషయపరంగా చూస్తే పైపద్యం మంచి రచన ఎక్కడ ఉన్నా ఎవరు రాసినాతన కంటబడితే చాలుమెచ్చుకుని, ప్రోత్సహించే జాషువా సహృదయతనూ తెలియజేస్తోంది.
ఈ పద్యాన్ని జాషువా 1948లో రచించారని ‘‘భావవీణ’’ పత్రికా సంపాదకులు, ప్రముఖ కవి పండితులైన కొల్లా శ్రీకృష్ణారావు (గుంటూరు) నాతో చెప్పారు. ఆయన తరుచుగా జాషువా ఇంటికి వెళ్తూ ఉండేవారు. జాషువా రెండవ కుమారుడు వలరాజు, కొల్లా శ్రీకృష్ణారావు ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారిద్దరూ మిత్రులు. పై పద్యాన్ని జాషువా పోస్టు కార్డుపై రాయగా, కృష్ణారావు చేతనే పోస్టు చేయించారట. నేటికీ ఈ పద్యం అముద్రితం. జాషువావి` కొన్ని పెండ్లి పద్యాలు కూడా అముద్రితాలని ప్రముఖ గుంటూరు కవి ధనేకుల వేంకటేశ్వరరావు నాతో చెబుతూ ఉండేవారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img