Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

‘‘నందనవన వసన్త మన్దారం!’’

32

‘‘ఆదర్శప్రాయులయిన పాఠకులు, ఉత్తమ అనువాదకులు కాగలరు. అలాంటి పాఠకులు తాము చదివినదాన్ని చీల్చుకుని లోపలికి చూడ గలరుÑ చర్మం వలిచి, కండలు తొలిచి, అస్థికలను పరిశీలిస్తారుÑ ప్రతి ఒక్క రక్తనాళికనూ వెలికితీస్తారుÑ అప్పుడు దానికి నూతనప్రాణిగా పునర్జన్మ నివ్వగలుగుతా’’రన్నాడు అనువాద సిద్ధాంతకర్త అల్బర్టో మాంగ్యుయెల్‌. తను పుట్టడానికి ఎనిమిదేళ్ళు ముందే కలంపట్టి, గొప్ప అనువాదకుడిగా రాణించిన తెలుగుకవినాటకకర్త బెల్లంకొండ రామదాసు గురించి మాంగ్యుయెల్‌ అంతస్పష్టంగా ఎలా రాయగలిగాడో అనిపిస్తుంది ఇది చదివితే! ‘‘నయాగరా’’ కవిత్రయంలో రామదాస్‌ ఒకరు. (ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులు మిగతా ఇద్దరూను!) ఆ ముగ్గుర్లోకీ ఆయనే చిన్నవాడు కూడా! 1923లో పుట్టిన రామదాసు, పదిహేడేళ్ళ ప్రాయంలోనే ‘‘శ్మశానం’’ అనే నాటకంతో తన సాహిత్యప్రస్థానాన్ని ప్రారంభించారు. 1944 నాటి ‘నయాగరా’ ఆ ప్రస్థానంలో ఓ మేలి మలుపు. రెండో ప్రపంచయుద్ధంలో విజయోన్ముఖమయివున్న ఎర్ర సైన్యానికి నివాళులెత్తుతూ ‘‘వీరులకే బీర్‌బాటిల్‌’’ అనగలిగిన అత్యాధునికుడు రామదాసు! ఆయన వ్యక్తిత్వంపై ‘‘బ్రహ్మసమాజం, కాంగ్రెస్‌, నవ్యసాహిత్యపరిషత్తు, నాట్య కళ, నాయని, కోలవెన్ను చిన్నతనంలో పడిన నీడలు’’ కావడం వల్లనే ఆయన మాటకంత ఆధునికత అబ్బిందేమో!
ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పుకున్నట్లుగా, 1920 దశకంలో పుట్టి, నలభయ్‌దశకంలో తెలుగునాట కలంపట్టిన అభ్యుదయ రచయితల్లో సామాన్యంగా కనిపించే లక్షణాలు కొన్నివున్నాయి. వాటిల్లో ప్రస్ఫుటంగా కనబడేది బహుముఖ ప్రజ్ఞ. కవులుగా, కథకులుగా, నవలాకర్తలుగా, పత్రికా రచయితలుగా, అనువాదకులుగా రాణించిన వారు ఈ తరానికి చెందిన రచయితలు. మరీ చిన్న వయసులోనే సంక్లిష్టమయిన ప్రయోగాలు చేసి మెప్పించడం ఈ తరానికి సాధారణమయిన అసాధారణ లక్షణం. ముఖ్యంగా, సమాజంలో సమూల మయిన మార్పును ఆకాంక్షించడం వాళ్ళ ప్రధాన లక్షణం. రామదాసు అదే కోవకు చెందిన రచయిత. అప్పటికి, ప్రపంచం భవిష్యత్తు అక్షరాలా చౌరస్తాలో నిలబడివుంది. స్వాతంత్య్ర సమరంగా మారుతూ వుండిన జాతీయోద్యమంÑ అందులో భాగంగానే వుంటూ, అప్పుడప్పుడే తలెత్తు తూండిన ప్రాంతీయ వాదం ఓ వైపునావలస దేశాల్లో పట్టుకోల్పోయి, కుప్పకూలుతున్న సామ్రాజ్యవాదం మరో వైపునా దాదాపు రెండు దశాబ్దాలుగా బాలారిష్టాలతో తల్లకిందులవుతున్న సోషలిస్టు శిబిరం ఇంకో వైపునాపైశాచిక బలంతో విరుచుకుపడిన మూడుతలల పాము లాంటి ఫాసిజం వేరే వైపునా మోహరించివున్న దశ అది. వాటికి తోడుగా, ఆఫ్రోఆసియన్‌అమెరికన్‌ దేశాలను వలసలుగా మార్చేసి, శతాబ్దాలుగా పెత్తనం వెలిగిస్తూ వుండిన వలసవాద రాజ్యాలు ఒకదాని వెనుక మరొకటిగా తెచ్చిపెట్టిన ప్రపంచయుద్ధాలు ఆయా దేశాల్లో జీవనాన్ని దుర్భరంగా మార్చేశాయి. కొద్దోగొప్పో చదువుకున్న ఆనాటి మధ్యతరగతి యువతరాన్ని ఈ సవాళ్ళు తీవ్రంగా కలవరపరుస్తూ వుండిన విషయం చరిత్రకెక్కిందే! ఇవి తెలుగు వాళ్ళకు మాత్రమే పరిమితమయిన సవాళ్ళు కావు జాతుల విముక్తిని కోరుకుంటూ, అభ్యుదయ భావాలపట్ల ఆకర్షితులయిన రామదాసు లాంటి యువకులందరికీ ఎదురయిన సమస్యలివి!!
రామదాసు, సాహిత్యంలోనే ఈ సవాళ్ళకు జవాబులు వెతుక్కోవడం కనిపిస్తుంది. ‘నయాగరా’ కవితా సంకలనంలో చేరిన ‘నా గీతం’, ‘ఈ రోజున’, ‘చెరసాల’ అనే మూడు కవితల్లోనూ ఇదే అన్వేషణ కనిపిస్తుంది. ముఖ్యంగా, ‘‘మీకై ఈనాడొక నవజగత్తు ప్రభవిస్తున్నది చూచారా? మీకై ఈనాడొక నవవసన్త మన్దారం వికసిస్తున్నది చూచారా??’’ అనడంలో నికార్సయిన అభ్యుదయ సాహిత్యస్ఫూర్తి తొణికిసలాడుతోంది!! రామదాసుపై శ్రీశ్రీ ప్రభావం ‘‘నయాగరా’’ కవితల్లో కనిపించినంత ప్రగాఢంగా ఆ తర్వాత రోజుల్లో ఉన్నట్లులేదు. అప్పట్లో శ్రీశ్రీ ఆరుద్రను వెంటపెట్టుకుని ‘‘స్వజేళజం’’ అనే సర్రియలిజం ప్రయోగాల్లో ములిగి తేలడాన్ని రామదాసులాంటి అభ్యుదయ రచయితలు అంతగా మెచ్చి నట్టులేరు. అయితే, అభ్యుదయ రచయితల సంఘంప్రజానాట్యమండలి చెట్టాపట్టాలు వేసుకుని సాగించిన జైత్రయాత్ర, మహాకవి శ్రీశ్రీని మళ్ళీ ప్రధాన స్రవంతితో ముడిపెట్టింది. అది వేరే కథ అలావుంచండి! రామదాసు మేధాయానంలో ‘చలం, బారువా, శ్రీశ్రీ’ క్రమంగా మరుగున పడ్డారు. మార్కి ్సజం పట్ల నమ్మకం కూడా మరుపున పడ్డట్టుంది. కానీ, ఏల్చూరి, రెంటాల, గంగినేని, అనిసెట్టి తదితర అభ్యుదయ రచయితలతో మైత్రి కడదాకా కొనసాగడం విశేషం! పోతే, రామదాసు ఎప్పుడూ కేవలం కవి ప్రాయుడిగా లేరు. ఆ మాటకొస్తే, పదిహేడేళ్ళ ప్రాయంలో ఆయన చేసిన తొలి రచనే ఓ నాటకం! నాటక రచయితగా ఆయనకి మంచి పేరే దక్కింది. ఆయన స్వతంత్రంగా కల్పించిన నాటకాలు ‘పునర్జన్మ’, ‘అతిధి’, ‘పంజరం’ రామదాసుకు మంచి పేరు తెచ్చిపెట్టిన రచనల్లో కొన్ని మాత్రమే. ముఖ్యంగా మధ్యతరగతి నైతికత మీద విమర్శగా రామదాసు రాసిన ‘పునర్జన్మ’ నాటకానికి మద్దుకూరి చంద్రశేఖరరావు చంద్రంగారితో ముందుమాట రాయించుకోవడం రచయిత విజ్ఞతకూ విచక్షణకూ నిదర్శనం! 1955 ఉప ఎన్నికల నేపథ్యంలో, చప్పగాచల్లారిపోయిన అభ్యుదయ సాహిత్య ఉద్యమాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అతికొద్ది మందిలో చంద్రంగారొకరు. 1956లో ‘పునర్జన్మ’కు చంద్రంగారు రాసిన ముందుమాట చూస్తే ఆయన ఆ పాత్ర ఎంత బాధ్యతతో నిర్వహించారో అర్థమవుతుంది. నాటకరంగంలో దక్కించుకున్న అనుభవంతో, రామదాసు, ఇతర ప్రదర్శన కళల్లో కూడా ప్రయోగాలు చేశారు. ‘‘మరదలు పెళ్ళి’’ సినిమాకు మాటలు రాయడంతో పాటుగా, సహాయ దర్శకుడిగా కూడా చేశారు. కారణం తెలియదు కానీ, క్రమంగా రామదాసు రంగస్థలిని వదిలిపెట్టి అనువాదం వైపు మళ్ళారు. పత్రికల్లో ఉద్యోగం ఇందుకు దారితీసివుంటుందనిపిస్తుంది.
బతికింది నాలుగున్నర దశాబ్దాలే అయినా, ప్రపంచ ప్రసిద్ధ రచనలెన్నింటినో అనువదించినవారు బెల్లంకొండ రామదాసు. డికెన్స్‌, బాల్జాక్‌, జోలా, మపాసా, టాల్‌స్టాయ్‌, వైల్డ్‌, గోర్కి, డ్యూ మోరియె(ర్‌) తదితరులు రాసిన ప్రముఖ రచనలెన్నో అనువదించినవారు రామదాసు. ఈ విదేశీ రచయితలతో పాటుగా టాగూరు రచనల్ని కూడా ఆయన అనువదించి మెప్పించారు. అనువాదం చేసేందుకు రామదాసు ఎంపిక చేసుకున్న రచనలు చూస్తే ఆయన ఉత్తమాభిరుచి అర్థమవుతుంది. ఛార్ల్స్‌ డికెన్స్‌ నవల ‘హార్డ్‌ టైమ్స్‌’ ప్రపంచ ప్రసిద్ధ రచనల్లో ఒకటి. లెక్కలేనన్ని మలుపులూ మెలికలూ తిరిగే ఈ నవలను అనువాదంగా రక్తి కట్టించడం పెద్దసవాలే! కానీ 1960లో వెలువడిన రామదాసు అనువాదం ‘‘కలికాలం’’ ఆ సవాలును సమర్ధంగా ఎదుర్కోగలిగింది. బాల్జాక్‌ రాసిన ‘‘నీలికళ్ళు (ద గర్ల్‌ విత్‌ గోల్డెన్‌ అయ్స్‌)’’ నవలికనూ, ఆస్కర్‌ వైల్డ్‌ రాసిన ‘‘ద పిక్చర్‌ ఆఫ్‌ డోరియన్‌ గ్రే’’ నవలనూ, డ్యాఫ్నీ డ్యూ మోరియె(ర్‌) రాసిన ‘‘రెబెకా’’ నవలనూ అద్భుతంగా అనువదించిన రామదాస్‌, టాల్‌స్టాయ్‌ రాసిన రష్యన్‌ మహేతిహాసం ‘‘యుద్ధముశాంతి’’ని కూడా ( రెంటాలతో కలిసి) అనువదించారు. బెల్లంకొండ రామదాసు, కవిగా కన్నా నాటకకర్తగా, దరిమిలా అనువాదకుడిగా తెలుగు సాహిత్యంపై వేసిన ముద్ర బలమయినది. రెండుమూడు తరాల పాఠకులకు ఆధునిక సాహిత్యంలో ఉత్తమాభిరుచిని పరిచయంచేసిన అనువాదకుడిగా ఆయన స్థానం పదిలం! నడివయసు లోనేనలభయ్యారో యేటనే` మరణించి వుండకపోతే రామదాసు మరికొన్ని అద్భుతాలు సృష్టించివుండేవారనడంలో సందేహం లేదు!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img