Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

నేనూ-తులసిగారూ

శ్యామ్‌ చిర్రావూరి

నే రాసిందేదైనా నాతోనే మొదలవుతుంది. నాతోనే నడుస్తుంది. ఇదీ నామీద ఆరోపణ. బహుశా నిజం కూడా. ఇది తులసిగారి మీద రాయడానికి నా ప్రయత్నం . ఇది కూడా దానికి ఎక్సెప్షన్‌ కాదు. గనకనే ఇది ‘నేనూ-తులసిగారూ’ అయింది.
నేను తులసిగారిని మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసేను? బహుశా 70ల తొలినాళ్లలో కలిసేననుకుంటాను. హుషారుగా, ఉత్సాహంగా, నవ్వుతూ, తుళ్ళుతూ, ఆరోగ్యంగా ఆవిడ అప్పటి రూపం ఇప్పటికీ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆరోగ్యం మాటెలా ఉన్నా, ఇపుడు కూడా ఆవిడ హుషారుగా, ఉత్సాహంగా, నవ్వుతూ, తుళ్ళుతూనే వున్నారు.
ఆ మొదట్లోనే ఓ రోజు ఎందుకో సరదాగా నా చెయ్యి చూసేరు. లేక నేనే చూడమన్నానో. ‘‘నీకు పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది’’ అన్నారు.
నేను వెంటనే మరి మీకో అన్నాను కొంటెగా.ఆవిడ కోపగించుకోలేదు. ‘హన్నా!’ అన్నట్టుగా నవ్వుతూ ‘‘నాకిప్పుడు జరిగినా ఆలస్యమే’’ అన్నారు. ఆ కోపగించుకోకుండా నవ్వుతూ తగిన జవాబివ్వడంలోనే ఆవిడ విలక్షణ వ్యక్తిత్వం వుందని నాకు ముందు ముందు తెలుస్తుంది.
నాతో స్నేహంగా, అభిమానంగా వుండేవాళ్ళు. ఇంకా ఇప్పటిదాకా ఆ స్నేహం అలా నిలిచి వుండడానికి కారణాలాయా మనుషులే. నేను స్నేహాలు చేసుకోలేను. గట్టిగా నిలుపుకోనూ లేను. స్నేహం చూపించేవాళ్ళ పట్ల స్నేహభావంతో వ్యవహరించగలను. అంతే! తులసిగారు చేరదీయడం వలనే నేను చేరికగా వుండగలిగేను. ఆ తర్వాత ఆవిడ విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్‌. ఫిల్‌. చెయ్యడానికి వచ్చినపుడు భరాగో (భమిడిపాటి రామగోపాలం) ఇంటికి దగ్గరలోనే ‘పామ్‌ గ్రోవ్‌’ లో ఒక గదిలో అద్దెకు వుండేవారు. నేను ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్లో వుండేవాడిని. ఆ ‘పామ్‌ గ్రోవ్‌’ ఇల్లు / గది మా హాస్టల్‌ కి చాలా దగ్గర. అంచేత తరచుగా అక్కడికి వీలయినప్పుడల్లా వెళ్ళే వాడిని. సాహిత్యం కబుర్లు, హిందీ భాషా, హిందీ పాటలూ, వాదనలూ, కబుర్లు చెప్పడం, కొద్దిగా వినడం ఇవన్నీ ఆకర్షణలు.
ఆవిడ రాసిన ‘బామ్మరూపాయి’ చాలా ప్రశస్తి పొందింది. ఆ కథని చీదీు వాళ్ళ వీaర్‌వతీజూఱవషవం శీట Iఅసఱaఅ ూఱ్‌వతీa్‌బతీవ: పశీశ్రీబఎవ3 జుసఱ్‌శీతీ- ఖ.వీ. Gవశీతీస్త్రవ, చీదీు, Iఅసఱa 1997 లో మెన్షన్‌ చేసేరు. నాకు ‘మాంజా’దారం అనే కథ బాగా నచ్చింది. అది 1955లో ఆంధ్రపత్రికలో వచ్చింది. అంత చిన్న వయసులో అంత మంచి కథ రాసినట్టుగా నా కన్పించేది. కాని ఎవరి గురించి, ఎవరిని లేక ఏమిటి చూసి రాసేరని నాకన్పిస్తూవుంటుంది. కాని ఎప్పుడూ అడగలేదు.
1982లో అనుకుంటాను తులసిగారు ఏదో గ్రాంటుమీద ఉత్తరభారతదేశంలో సాహితీ ప్రముఖుల్ని కలవడానికి చాలాచోట్లకి వెళ్ళేరు. లక్నోలో మా నాన్నగారిని కలిసేరు. ఏంకావాలంటే ఆయన వక్కపొడి తెమ్మన్నారట. ఈవిడ వక్కపొడి తీసుకెళ్ళేరట. ఢల్లీిలో ఆవిడ భార్గవగారింట్లో గుల్‌ మొహర్‌ పార్క్‌ లో వుండే వారు. నేనూ, ఆవిడా వుదయం నించీ సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఎవర్నెవర్నో కలుసుకుని సాయంత్రం/ రాత్రి ఆవిణ్ణి గుల్‌ మొహర్‌ పార్క్‌లో దిగబెట్టేసి నేను నా గదికి చేరేవాణ్ణి. సౌత్‌ ఎక్స్టెన్షన్‌లో కైలాష్‌ వాజపేయినీ, రాజోరీ గార్డెన్‌లో ఎవరో యూపీవాళ్ళనీ కలిసేం. వాళ్ళంతా ఆవిడతో, ‘మీది చాలా మంచి హిందీ. చాలా బావుంది. వింటూ వుంటే సంతోషంగా వుంది’ అనేవాళ్ళు. కానీ ఢల్లీిలోనో లేక ఉత్తర భారతదేశంలో ఎక్కడవున్నా వుండి వుంటే- అన్పిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఆరోజుల్లో అవడం వల్ల, మహిళ కావడం వల్ల ఆవిడ సుదూర తీరాలకి పోలేకపోయారేమో అన్పిస్తుంది. అయినా మరో రాష్ట్రంలో ఉద్యోగం చెయ్యడానికి నిశ్చయించుకుని ఒరిస్సాలో చేరారు, ఆవిడకి ఆంధ్రాలో గవర్నమెంటు ఉద్యోగం వచ్చినా కూడాను. ఇది ఒక విధంగా మంచిదే అయింది. ఒరియా భాష మీద పట్టూ, ఉత్తరోత్తరా చాలా మంచి ఒరియా రచయితల రచనలని పరిశీలించడానికీ, పరిశోధించడానికీ, అనువదించడానికి చక్కటి అవకాశం కలిగింది.
ఆ 1982లో తులసిగారు. ఢల్లీిలో వున్నప్పుడే రాచకొండశాయి బొంబాయినుండి వచ్చేడు. అతన్ని కూడా తీసుకుని మేము మోతీబాగ్‌ లో వున్న ఇలపావులూరి పాండురంగారావు గారింటికి వెళ్ళేం. ఆయన స్కాలరు, పండితుడు, బహుభాషాకోవిదుడు. ‘పోతన’ ని హిందీలోకానికి పరిచయం చేసిన ప్రతిభావంతుడు. అదికాక అప్పట్లో సత్యసాయిబాబా గారికి పర్సనల్‌ అనువాదకుడు. భక్తుడు (తర్వాత కాదు). ఈ మెరుపుల వెలుగుల్లో ఆయనకి, చిన్న, కాదు చిన్నవారేమిటి ఎలాటి గొప్పవారూ కనబడేవారు కాదు. నాది ‘అది ఒక స్థితి’ అని తెలియని పరిస్థితి. ఎందుకో ఆయనకి డాక్టర్లంటే చిన్నచూపో ఏమో, కనీసం అలా వుంది ఆయన ప్రవర్తన. నా దృష్టిలో చాలా ప్రతిభావంతులైన కవులనీ, పండితులనీ అలా తీసిపారేస్తూ, అలాగే నన్నుకూడా తీసి పారెయ్యడం కొంత సేపుకంటే ఎక్కువ సేపు సహించడం సాధ్యం కాలేదు. ఫ్లాష్‌ పాయింట్‌ ఆయన డాక్టర్లకి కవిత్వమేమిటి? సెన్సిటివిటీ ఏమిటి? అన్నచోట వచ్చింది. పైగా, కామా సెమికోలన్లలా బాబాగారు, బాబాగారు అంటున్నాడు ఆయన. అప్పటి నా సోకాల్డ్‌ అభ్యుదయపథంలో సత్యసాయిబాబాగారికి ఉచిత స్థానం లేదు.
కొన్ని విషయాలు పూర్తిగా వివరించకపోతేనే బాగుంటుంది. మా ఇద్దరి డ్యూయల్‌ లో ఆయన పెద్దవాడు. కాబట్టి నాతో ఉధృతంగా వాదులాడలేడు. ఇంటికి వచ్చిన అతిథిని ఏమీ అనలేడు. కనుక ఆ పెద్దాయనే కొంచెం తగ్గేడు. పైగా ఇది డైనింగ్‌ టేబుల్‌ పై జరిగింది. ఇలాంటి ఉపద్రవంలో కూడా తులసిగారు శాంతంగా వున్నారు. మౌనంగా చూస్తూ, వారించలేదు, నివారించలేదు. రాచకొండశాయి కూడా తన బెస్ట్‌ బిహేవియర్‌లో వున్నాడు. అంటే నన్నేమనలేదు. ఆపలేదు.
ఒకసారి ఆజాద్‌ భవన్‌కీ, మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌కి వచ్చారు. చాసోగారి కథల్ని పుస్తకంగా ఇంగ్లీషులో పెంగ్విన్‌ ద్వారా తేవాలనే ప్రయత్నాలలో వుండేవారు. ఆ సందర్భంగానే శ్రీ వేంకటేశ్వర కళాశాల ప్రొఫెసరు పాండురంగారావుగారింటికి ఒకసారీ, మరొకసారి సుజన్‌ సింగ్‌ పార్క్‌ లోవుండే కుష్వంత్‌ సింగ్‌ గారింటికి వెళ్ళాం. నేను కుష్వంత్‌ సింగ్‌ గారింటి బయటే వుండిపోయాను. తులసి గార్ని ఓ సాహిత్య మిత్రుడు కుష్వంత్‌ సింగ్‌ గారి దగ్గరికి ఇంట్లోకి తీసుకు వెళ్ళాడు. నేను బయటే వుండాలని ఆ సాహితీ మిత్రుడు కండిషన్‌ పెట్టాడు. మనకి పని ముఖ్యం అని బయటే వున్నా.
ప్రయత్నాలెన్నున్నా ఎలా వున్నా ప్రాప్తమున్న తీరానికి పడవసాగిపోతుంది. చేరిపోతుంది. నేనీ అమెరికా వచ్చింతరువాత దాని గురించే కనుక్కోమనీ, నారాగారిని అడగమనీ ఫోన్‌ చేశారు తులసి గారు. నేను నారాగారికి ఫోనూ మెయిలూ చేసీ, ఇచ్చీ, మెసేజి పెట్టేను. తులసి గారిని కాంటాక్ట్‌ చెయ్యమనీ, మాట్లాడమనీ. ఆయన మాట్లాడేరు. పుస్తకం వచ్చింది.
పెంగ్విన్‌ వాళ్ళు వేసేరు: A ణశీశ్రీశ్ర్ణీం వీaతీతీఱaస్త్రవ aఅస ూ్‌ష్ట్రవతీ ూ్‌శీతీఱవం. అనువాదం వెల్చేరు నారాయణరావు మరియు డేవిడ్‌ షుల్మన్‌. అంతేకాదు, ‘కథలను ప్రేమించే చాగంటి తులసి కోసం’ అని అంకితం కూడా ఇచ్చేరు.
అనువాదాలు తులసిగారు ఎన్నో చేసినా, కొన్నిటి గురించి నేను చూసినవీ, అనుకున్నవీ రాస్తాను. మహాదేవివర్మ గీతాలు ఆవిడ అనువదించేరు. దాంట్లో మహాదేవివర్మ వేసిన చిత్రాలు కూడా కలిపి ప్రచురించేరు. దానిమీద ఆవిడ కోరికమీద నేను ఇంగ్లీషులో ఒక వ్యాసం రాసేను. దాంట్లో మహాదేవివర్మ వంటి కవయిత్రిని అనువదించడంలో వున్న ఇబ్బందుల్నీ, కష్టాల్నీ, నా అవగాహనమేరకు చెప్పేను. సంస్థలు చెయ్య వలసిన పనులని వ్యక్తులు చెయ్యడం సామాన్యవిషయమేమీ కాదు. తన రోజుల్లో మహాదేవివర్మ చేసినటువంటి పనులనే తన సమయంలో తులసిగారు కూడా చేసేరని, చేస్తున్నారని నా వుద్దేశ్యం. మహాదేవివర్మ మీద ఆవిడకున్న గౌరవం, ఇష్టం గమనించేను. మనదేశంలో ఎంత గొప్పవారికైనా ప్రభుత్వ గౌరవాలు అందడంలో ఆలస్యం కావడం సహజం. మహాదేవివర్మకి జ్ఞానపీర్‌ అవార్డు రావడంలో జరిగిన విలంబానికి ఆవిడే విధంగా తీసుకున్నారో నాకు తెలియదుగాని, తులసిగారు కొంతలో కొంత బాధపడ్డారనే చెప్పాలి.
అనువాదప్రక్రియలో ఇంత కృషిచేసిన తులసిగారికి అనువాదానికై సరి తగిన అవార్డు రాకపోవడం ఈ ప్రోసెస్‌ లో వున్న లోపాలనే చూపిస్తుంది. ఆవిడని అనువాదాలకి సెలెక్షన్‌ మెంబర్ని చేశారు. ఆవిడ తన కర్తవ్యాన్ని చక్కగా దిగ్విజయంగా నిర్వహించేరు. నేను చాలా ఏళ్ళ క్రితం ఎప్పుడో చిన్నప్పుడే నా కథలు అనువాదం చెయ్యొచ్చుగా అనో, చెయ్యండి అనో అడిగాను.ఆవిడ చేస్తాను. ముందు నాన్న, తర్వాత మరికొందరు. నువ్వూ వున్నావు నా లిస్ట్‌ లో అన్నారు.
ఒకటి రెండు కథలు చేసినా, ‘తెలుగుకీ శ్రేష్ఠ కహానియా’ 12 అనువాద కథల పుస్తకంలో నా కథ చేర్చినా, నిజంగానే నా కథల్ని అనువదిస్తారను కోలేదు. నిజానికి ఆవిడ నా కొకసారి ఫోన్‌ చేసి ఏదో ఒక కథలో ఆవిడకి కలిగిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించినపుడు, వద్దనే అన్నాను. అతి కష్టం మీద ఆ తెలుగు కథల పుస్తకం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీట్ని అచ్చు వెయ్యడం, పుస్తకంగా తేవడం అన్ని కష్టమే, వద్దన్నాను.
ఆవిడ నిన్ను సలహా అడగలేదు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు అన్నారు. నే వేసుకుంటా, నే చూసుకుంటా అన్నారు. మాటల్లో అర్థమైనదేమిటంటే, అప్పటికే ఆవిడ 8 కథలదాకా అనువదించేరు. మరో నాలుగు కలిపి 12 పూర్తి చేద్దామనుకున్నారు. చేసేరు. ‘రాగ్‌ మాలిక’ పూర్తిచేసేరు.
ఉర్దూ, హిందీ కాని, రెండూ కలసిమెలసిన హిందూస్థానీ ఆవిడకిష్టం. ఆది ప్రజల భాష, మతసామరస్యమైన భాష. నా కథలకి సరిపోతుందనీ, సరితూగుతుందనీ, భావించి ఆవిడ అలాంటి భాష వాడేరు. హిందీ భాషీయులు సంస్కృతీకరించిన హిందీనే ప్రామాణికంగానూ, సముచితంగానూ భావిస్తారని తెలిసినా పట్టించుకోలేదు.
అనువదించినపుడూ, ప్రూఫ్‌ రీడిరగులోనూ ఆవిడ శ్రద్ధ, పెర్‌ ఫెక్షన్‌ గురించిన తపనా నా స్వంత అనుభవం ద్వారా తెలుసుకున్నాను. తప్పులు రాకుండా వుండాలనే దృష్టితో ఆవిడ కొన్ని గంటలు ఆ డిటిపి చేసే అమ్మాయి పక్కన కూర్చుని చేయించేరు, విజయనగరం నుండి విశాఖపట్నం వెళ్ళి మరీ. నా పుస్తకమనే కాదు. ఏ పుస్తకమయినా అంతే శ్రమ పడతారు. ‘నీ ఉత్తరం అందింది’ అనే చాసో గారి మిత్రుల ఉత్తరాలు కూర్చినపుడు కూడా ఫ్రెంచి మొదలైన ఇతర భాషాపదాలూ, పేర్లూ, ఏవీ తప్పు రాకూడదని ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. ఆ మధ్య ఒకసారి ఫోన్‌చేసి ఆరుద్రగారు రాసిన ‘అప్పలస్వామిగారూ’ అనే కవిత కావాలన్నారు. కొంచెం కష్టపడి వెతికి పంపేను. అదికూడా ఆ కవితలో వాడిన కొన్ని పదాలూ, పేర్లూ సరిగా రాసేనో లేదో తను రాసిన వ్యాసంలో అని చూసుకోవడానికి.
ఇంత శ్రద్ధగా ఏ పనైనా చేస్తారు కాబట్టే నా అశ్రద్ధమీద ఆవిడకి కోపం. నేను చెయ్యగలిగిన (చెయ్యగలనని ఆవిడ అనుకుంటున్న) చాలా పన్లు,
రాయడం వగైరాలు, నేను చెయ్యడం లేదని. ఉన్న (నిజానికి అంతగా లేని) ప్రతిభని నేను సరిగా వుపయోగించడం లేదని.
ఒకసారి రవీష్‌ కుమార్‌ ఫేస్‌ బుక్‌ లో రాసి పబ్లిష్‌ చేసిన లప్రేక్‌ (లఘు ప్రేమ్‌ కహానియా) పుస్తకం కావాలన్నారు. నేను ఆస్ట్రేలియా నుండి ఎవరో చేసిన డీటెయిల్డ్‌ రివ్యూ మాత్రం పంపగలిగేను. కాని ఆవిడ ఆ పుస్తకాన్ని సంపాదించేరు.
అహమ్మదాబాదునుంచి ఒకాయన ఇంగ్లీషులో పాత హిందీ పాటలమీద రాసిన ఓ పుస్తకాన్ని వి.ఎ.కె రంగారావుగారి ద్వారా తెప్పించేరు నాకిద్దామని.
నన్నెప్పుడూ కథలపుస్తకం వెయ్యవా? ఆమాత్రం డబ్బులేదా నీ దగ్గర అని అడుగుతుండేవారు. నేను వేద్దామనే నిర్ణయానికి వచ్చినపుడు
ముందుమాట రాయమంటే రాయనన్నారు. మీరు రాయకపోతే ఎవరు రాస్తారు అన్నాను. రాసేరు. కొంచెం ఎక్కువమార్కులు వేసినట్టున్నారు. అంటే ఏంలేదు, తగినమార్కులే వేసేను, నేను ఎక్కువమార్కులు వేయను అన్నారు.
ఒక పెద్దాయన నా కథలు బావులేవన్నాట్ట. ఆవిడ చెప్పేరు. పోన్లెండి. అన్నీ అందరికీ నచ్చాలని లేదుగా అన్నాను.
కొన్నాళ్ళకి ఆవిడ సడన్‌గా ఓ రోజు ఫోన్‌చేసి, నేను నీకు తప్పు చెప్పేను. ఇవాళ ఆయన అన్నాడు, శ్యామ్‌ కొన్ని చాలా మంచి కథలు రాసేడని. నేను నీకు తప్పుగా చెప్పేసేను అన్నారు.
పోనీలెండి. అతను ముందర వెలిబుచ్చిన అభిప్రాయం తప్పో, ఇప్పటి ఈ అభిప్రాయం సరిjైుందో తెలీదు కదా! ఏమైన అన్నీ అందరికీ నచ్చక్కర్లేదు కదా! అదీ ఆవిడ నిజాయితీ, సిన్సియారిటీ. మనం అన్ని విషయాల్లోనూ ఆవిడతో ఏకీభవించనక్కరలేదు. ఎవరూ ఎవర్తోనూ నూటికి నూరుశాతం ఏకీభవించలేరు. కాని ఆవిడ రచనల్లో నిజాయితీ వలన నిండిన సౌరభాలూ, వ్యాపించే పరిమళాలూ మాత్రం వుంటాయి.
ఆవిడ వచనమే ఎక్కువరాసినా, కవిత్వంపట్ల ప్రత్యేకమైన ఆకర్షణ వుంది. ప్రకృతిపట్లా అటువంటి ఆకర్షణే వుంది. ‘రంగంటే ఇష్టం’, ‘వెన్నెల’, ఇంకా కొన్నికథల్లో పూలవర్ణనలూ, ఉదాహరణలూ, ఈ విషయాన్ని నిరూపిస్తాయి. కవిత్వం పట్ల ఆకర్షణే ఆవిడచేత కొన్ని కూనలమ్మ పదాలూ రాయించింది. మఖూం మొహియుద్దీన్‌ రచన – ఏక్‌ చంబేలీ కే మండ్‌ వే తలే- (చాచాచా 1964 సినిమాలో రఫీ, ఆశా పాట) ని అనువదింపజేసింది ఆ మధ్య.
ఆవిడకి ఇంకా ఇంకా చదవాలనీ, తెలుసుకోవాలని వుంది. ఉత్సాహంగా, హుషారుగా, చురుగ్గానే వున్నారు. శరీరం ఇంకా చాలాకాలం సాయం చేస్తుందని ఆశిస్తున్నాను.
‘వో సుబహ కభీతో ఆయేగీ, వో సుబహ కభీతో ఆయెగీ’ అన్నాడు సాహిర్‌. ఆయన అలా ఎందుకన్నాడో గాని ‘సుబప్‌ా జరూర్‌ ఆయెగీ. సుబప్‌ా కా ఇంతజార్‌ కర్‌ ‘ అన్నాడు జాన్‌ నిసార్‌ అఖర్‌. ‘మానవాళికి మంచికాలం రహిస్తుందా? నిజంగానే… నిజంగానే’ లాంటి సంశయాలేం లేవు తులసి గారికి. ఆవిడ నిస్సందేహంగా ఆశావాది. మాలాంటి ఎగ్నోస్ట్‌ కాదు. స్పష్టత ఆవిడ విశిష్టత. ఆఖరిగా, తరక్కీ పసంద్‌ అభ్యుదయ సాహిత్యవేత్త ఆవిడ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img