Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బౌద్ధ తాత్త్వికతను కవిత్వీకరించిన ‘సమతా వసంతగానం’

డా॥పి.వి.సుబ్బారావు, సెల్‌: 9849177594

‘సమతా వసంతగానం’ కవితా సంపుటి రచయిత నేతల ప్రతాప్‌కుమార్‌. అంబేద్కర్‌ వాద కవిగా గతంలో ‘అన్నం గిన్నె’ (2006), ‘బీమ్‌ పాలరాగం’ (2012), ‘పుట్టినరోజు ఒక్కటే’ (2016) వంటి కవితా సంపుటాలు ప్రచురించి పాఠకులకు సుపరిచితులయ్యారు. ఇప్పుడు బౌద్ధ తాత్త్వికతను సమతా వసంతగానంగా కవిత్వీకరించాడు. ఇందులో 22 కవితా ఖండికలున్నాయి. ‘నా కొక మతం కావాలి’ ఖండికలో ‘మనిషిని మనిషిగా చూడగలిగే మత ధర్మం కావాలి/ ధర్మమైన మతం కావాలిఅంటాడు. ప్రజల్ని కర్మ సిద్ధాంతపు భ్రమల్లో ముంచని ‘మాయ మర్మంలేని స్వచ్ఛమైన మతం కావాలి/ అచ్చమైన మతం కావాలి/ మానవుణ్ణి మహోన్నతుడిని చేసే జీవం ఉన్న మతం కావాలి’ అంటాడు. ‘ద్వేషంపై ద్వేషం’ కవితలో మదిలో ద్వేషం రేగితే ‘‘చెదపట్టి ఇల్లంతా తినేసినట్లు/ ఎదపట్టె/ హృదయంలోని హృదయాన్ని తినేస్తుంది’’. అంటూ సముచితమైన దృష్టాంతంలో కవిత్వీకరించాడు. బౌద్ధ సిద్ధాంత దృక్కోణంతో ద్వేషంపై ద్వేషం ప్రకటించి నిరసించాలంటాడు. ద్వేషం నశిస్తేనే ప్రేమ వికసిస్తుందంటాడు. ‘మనిషి’ అనే మాటకు సంపూర్ణత్వం సిద్ధిస్తుందనడం ఔచిత్యంగా ఉంది. ‘అందమైన అబద్ధం’ కవితలో ‘‘ఆత్మలేకుండా/ ప్రాణి ఎలా ఉంటుందనేవాడికి/ ప్రాణి లేకుండా/ ఆత్మ ఎలా ఉంటుందనే ప్రశ్న? జవాబు’’ఆత్మకు అస్తిత్వమే లేదంటూ మరణించిన శరీరంలో ఆత్మ నశించిపోతుందంటాడు. కాని బౌద్ధం ఆత్మ లేదంటుంది/ అందుకే ఆత్మ ఒక అందమైన అబద్ధం’’ అంటాడు. ఆత్మ లేకుండా ప్రాణి ఎలా ఉంటుందన్న కవి, ఆత్మ ఒక అందమైన అబద్ధంతో ముగించాడు. ఇక్కడ స్వవచన వ్యాఘాతం కలుగుతుంది. ఈ విషయాన్ని కవి ఆలోచించకపోవటం లోపం. ‘అహింసా పరమోధర్మః కవితలో ‘‘ప్రాణుల పట్ల అనిర్వచనీయమైన ప్రేమ పంచుకుంటూ’’ మాంసాహారులు శాకాహారులయ్యారు/ ప్రేమ, కరుణ, అహింస తమ పరమావధిగా బుద్ధులు ప్రబోధాలు గావించారు’’అంటాడు. బౌద్ధ సిద్ధాంతాలైన ప్రేమ, కరుణ, అహింసలను ప్రబోధించింది బుద్ధుడు ఒక్కడే. ఇక్కడ ‘బుద్ధులు’ అని బహువచన ప్రయోగం చేయడం అనౌచిత్యంగా ఉంది. సమతా వసంతగానం కవితలో ‘గతించిన కాలం/ గొంతు చించుకున్నా తిరిగి రాదు’’అంటాడు. జాషువా ఫిరదౌసిలో ‘‘గడచిపోయిన కాలమ్ము క్షణము మరల్ప సాధ్యమే?’’ అన్న దానికి భావానుసరణలా ఉంది. మానవుడు జీవిత కాలంలో సాధించిన ఘనతను, సత్యాన్ని ప్రజలకు పంచుతూ ‘కాలం నీ కాలానికి గాలం వేసేలోగా’/ నువ్వు తెలుసుకున్న సత్యమేదో/ నిస్సంకోచంగా నలుగురికి చేర్చాలి’ అంటూ తాత్త్విక దృష్టితో జీవితం ముగిసేలోపు తాను తెలుసుకున్న సత్యాన్ని నలుగురికి పంచడం మంచిదంటాడు.
‘‘నాలుగు గింజలు దొరికిన పక్షి/ తన పిల్లల నోట్లో తెచ్చిపోసినట్లు/ ధమ్మం తెలిసిన వ్యక్తి/ ఆ మార్గంలో అందరికీ చేరవేయడానికి నిరంతరం పరిశ్రమించాలి’’అంటాడు. ఈ సంపుటిలో కవితా ఖండిక లన్నింట్లో కవి బౌద్ధ ధర్మాలను, తాత్త్వికతను కవిత్వీకరించాడు. బౌద్ధ దర్మానుయాయులు, బౌద్ధ మతాభిమానులు, ఆధునిక కవితా ప్రియులు చదువదగిన కవితా సంపుటి ‘సమతా వసంతగానం’. కవి నేతల ప్రతాప్‌కుమార్‌, ప్రచురణ: అంబేద్కర్‌ ప్రబుద్ధ భారతి, హైదరాబాదు, వెల: రూ.75/ అన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లో లభ్యం లేదా నేతల ప్రతాప్‌కుమార్‌, అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం, పైడిపర్రు 534211, సెల్‌ నెం: 9550436286/ 9182262655 ద్వారా కాపీలు పొందవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img