Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మధుర భావనల మాతృవందనం

కంతేటి చంద్రప్రతాప్‌ రచించిన శతక సుమాంజలి మాతృ వందనం ఆద్యంతం అనేక మధుర భావనలతో నవరసభరితంగా ఒక్కో పర్యాయం కంట తడిపెట్టించి, రసవత్తరంగా సాగింది. ఉద్వేగానికి గురిచేసింది! గుండెను పిండేసింది. ‘‘అమ్మ’’ అనే తీయని పదాన్ని వర్ణించి ఎందరో కవులు అనాదిగా చెప్తూనే ఉన్నారు. నేటికీ జరుగుతోంది. అపర గాయకులు గానం చేశారు. వీనుల విందుగా ఉన్నాయి అవి అన్నీ. ధనవంతుని మొదలు, కటిక పేద వరకు, అమ్మలేని బిడ్డ అసంభవమే కదా! అన్నదమ్ములు లేనివాళ్లెందెరో, అలాగే అక్కచెల్లెళ్లు. కాని అమ్మ నవ మాసాలు మోసి, జీవం పోసి జీవాన్ని, జీవితాన్ని ప్రసాదించే మనిషి. అమ్మవాత్సల్యం త్యాగం ఏమని వర్ణించగలం! ఆమె అను రాగంలో ఓలలాడని జన్మ ఎంత ఘోరం! అమ్మను చిన్నతనం లోనే కోల్పోయిన శిశువులను, పసివారిని, అందుకే ‘‘అనాధ’’ లు అంటారు. ప్రతాప్‌ అమ్మను ‘‘జన్మదాత’’ అన్నారు. అనురాగ, ఆప్యాయతతో గోరుముద్దలు తినిపించిన అమృతమయి అమ్మ. మనకు భాషను, ప్రేమను, అనురాగాన్ని, మంచి నడవడిని నేర్పిన తొలి గురువు అమ్మ. ఆమె చిరునవ్వు మనకు దివ్యౌషధము. ఆమె కన్నీరు మనలను విలవిలలాడిస్తుంది. మనిషి పుట్టినది మొదలుఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు తననే పంచ ప్రాణాలుగా భావించి, సర్వం విస్మరించి, ఏకాగ్రతతో ప్రేమించి సేవిస్తుంది. ఆమె లాలనలో ఈ సర్వ జగత్తునూ మరపింప చేస్తుంది. ఆమె ఒడిని మించిన మెత్తని పాన్పు ఈ లోకంలోనే ఎక్కడా లేదంటే అతిశయోక్తి ఏమీలేదు. మనం నలుగురిలో హాయిగా, ఆరోగ్యంగా తిరుగాడి ఆటపాటలతో క్రీడిస్తూంటే మురిసే మొదటి వ్యక్తి మన తల్లే కదా. స్వల్ప అనారోగ్యం కలిగినా తల్లడిల్లిపోయి తన పనులన్నీ పక్కన పడేసి, మనతోనె గడిపి అనేక దేవుళ్లకు మొక్కి, ఎందరో వైద్యులను సంప్రదించి ఔషధాలనిచ్చి, పుష్టికరమైన ఆహారాన్ని ఇస్తుంది. బిడ్డ త్వరగా కోలుకొని తిరగాలని కాంక్షిస్తుంది. ‘‘జనని, జన్మభూమి’’ ఇది వదలి స్వర్గానికి కూడా వెళ్లనక్కరలేదని ఆర్యోక్తి. అలాంటి ఔన్నత్యం మాతృమూర్తిది. మనం పెరిగి పెద్ద అవుతుంటే, మనం నడచి, అడుగులు వేసి, పరుగులు తీస్తూంటే ఆనందించేది అమ్మ. యవ్వనంలోకి అడుగిడినపుడు గర్వించే తొలి వ్యక్తి అమ్మే కదా! మనం విద్య నేర్వడం, ఉన్నత పదవులలోనికి వెళ్లడం, రాణించడం చూసి గర్వంతో పొంగిపోయేది తల్లే. కానీ అవి ఏవీ బయటకు కనిపించనీయదు. దాచేస్తుంది. గుంభనంగా మసలుతుంది. దిష్టి తగులుతుందేమో అని ఆమె భయం. ఉండి, ఉండి మనకు దిష్టి తీస్తుంది. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే, అది అతి అయితే, ‘‘సరే లెండి, అంత వద్దు’’ అని సున్నితంగా ఖండిస్తుంది.
ఇవన్నీ మనకు రక్ష. వయసు పెరిగి, బాల్యం, కౌమార్యం దాటి గృహస్తుగా మనం ఎదుగుతాము. భార్య వస్తుంది. ఆడపిల్లకు వివాహమయి భర్త వస్తాడు. సరే! ఆ క్రమంలో అమ్మకు కూడ వయసు మళ్లుతుంది. ఆమె భౌతికంగా అలసి, శక్తులన్నీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. డబ్బై సంవత్సరాలు వచ్చేసరికి, నీరసం ఆవహిస్తుంది. ఆరోగ్యంలో తేడాలు వస్తాయి. రుగ్మతలు కలుగుతాయి. నిద్ర సరిగా పట్టదు. మనం ‘‘బిజీ’’, ‘‘యమ బిజీ’’ అయిపోయి కనీసం ఆమెను పలుకరించకపోతే ఆమె ఎంత నొచ్చుకుంటుందో గ్రహించాలి. ముఖ్యంగా కొడుకులు తల్లిని కనిపెట్టి, ఆమె మంచిచెడులను చూడవలసిన బాధ్యత అనాదిగా మన ఆచారం. దురదృష్టవశాన నేడు అది లోపిస్తున్నది. చెప్పుడు మాటలు విని, రాయి వలే, శిలవలే మారితే ధనంపై, ఆస్తిపై కాంక్షతో ఆప్యాయతను విస్మరిస్తే, ఆమె మనసు రోదిస్తుంది. అలమటించిపోతుంది. తల్లడిల్లిన ఆ తల్లి మనసుకు ఓదార్పు కేవలం నీవు ‘‘అమ్మా’’ అని ఆప్యాయంగా పలుకరించినపుడే కలుగుతుంది.
అలతి అలతి పదాలతో కూర్చిన యీ మాతృ వందన శతకంలోని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. ఎంతో అర్థాన్ని ఇముడ్చుకొని ఉన్నా యి యీ పద్యాలన్నీను. అతి తేలికగా సామాన్యులకు సైతం అర్థమవుతాయి. కాని కింద, ఇంకా తేలికగా ప్రతాప్‌ మాటలలో కూడా వివరణ ఇచ్చారు. అనేక కోణాల్లో ‘‘అమ్మతనం’’ మధురమైన భాషలో వర్ణించారు. మనలో మానవత్వాన్ని తట్టిలేపే మహా ప్రయత్నం చేశారు. ఎంతగానో సఫలీకృతమయ్యారు. చంద్రప్రతాప్‌ పేరులోనే చంద్రుని చల్లతనం, మరో ప్రతాపం, ప్రభావం ఇమిడి ఉన్నాయి. స్త్రీమూర్తికి వారిచ్చే గౌరవం అసమానం. అందులోనూ అమ్మకు వారి వందనం, మేము వారికి శతకోటి వందనాలను సమర్పించేందుకు అవకాశమిచ్చింది. ధన్యవాదాలు. ఈ పద్యాలు చదివి హృదయం కరగని వారు మనుషులు కారు పాషాణులు. చంద్రప్రతాప్‌కి అభినందనలు. ఇంకా మంచి రచనలు చేస్తూ వర్థిల్లాలని కోరుతున్నాను.
కాళ్లకూరి శేషమ్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img