Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

మనిషి మానసిక పరివర్తనకు పెద్దపీటేసిన నవల

సాహిత్యపక్రియల్లో నవల విస్తృతమైన కాన్వాస్‌ కలిగి ఉంటుంది. సామాజిక రుగ్మతలను విఫులంగా లోతుగా చర్చించడానికి అవకాశం కలిగి ఉంటుంది. సమాజం మోస్తున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలను ఎదుర్కొని పరిష్కారం వైపునకు ఏ విధంగా అడుగులేయాలో, ఎక్కడనుంచి ఈ చైతన్యం పురుడు పోసుకోవాలో సమగ్రంగా అవగాహన కల్పించేందుకు నవలా సాహిత్యానికి మించిన మరో ప్రక్రియ లేదంటే అతిశయోక్తికాదు.
వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి ‘చెరువు గండి’శీర్షికతో దళిత మహిళ, పెత్తందారీతనం, ఆధిపత్యవాదం, దోపిడీతత్వం, ముప్పేట పెరిగిన భూస్వాముల దుర్మార్గాలను ఎదిరించి, చివరకు వారిలో కనువిప్పు కలిగించే విజయాన్ని ఏ విధంగా సాధించిందో అద్భుతంగా ఆవిష్కరించారు ఈ నవలలో. ఈ నవల 1947 ఆగష్టు 14న మొదలౌతుంది. నేటికీ 75 సంవత్సరాల చరిత్రను ప్రతిబింబిస్తూ మూడుతరాల జీవితాల్ని కళ్ళకు కట్టిస్తూ, సామాజిక పరిణామక్రమాన్ని చర్చిస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, కుల మత వివక్షలు అంతరించి పోకుండా మారాకు తొడుగుతున్న వైనాన్ని, ఆర్థిక దోపిడీకి,శ్రమ దోపిడీకి అలవాటు పడ్డ పెత్తందార్లు చేసే ఆగడాలు, అమానుష చర్యలు, సరికొత్త రూపుదాలుస్తూ పేదలరక్తాన్ని పిండేతీరును ఈ నవలలో రచయిత ఎత్తిచూపారు.
‘చెరువు గండి’ నవల ఒక ఊరి కథలాగా రాసినా, సమాచారం మాత్రం దేశ కాలమాన పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుంది. ఈ నవలలో ప్రధాన కథాంశం రాయలసీమలోని దుర్గం దగ్గరలో ‘చెరువు గండి’ అనే గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబానికి, ఒక శ్రామికవర్గ దళిత కుటుంబానికి మధ్య జరిగిన ఘర్షణ, సుధీర్ఘపోరాటమై శ్రామికవర్గం విజయాన్ని సాధించిన అంశాన్ని ఆసక్తికరంగా చిత్రించడం జరిగింది. ఆధిపత్యవాదుల ఆగడాలకు కళ్ళెంవేసే యత్నంలో శ్రమించిన ఓ మహిళ కథగా దీన్ని అభివర్ణించవచ్చు.
ఈ నవలలో కథానాయిక ఎర్రమ్మ. ఈమె ఒక దళిత మహిళ. ఈమె తండ్రి ఇరగన్న. ప్రక్కనే ఉన్న ఉరగుండ్లోల్లపల్లి వాసి శామ్యూల్‌ అనే ఆయన ఎర్రమ్మకు అక్షరజ్ఞానం అందించిన గురువు. అంతేకాదు ఎర్రమ్మ అక్షరజ్ఞానంతో అన్యాయాలను ఎదిరించి ప్రశ్నించడం నేర్చుకుంది. ఎర్రమ్మ, దాశయ్యలకు ఇద్దరి కొడుకులు, వారిని చదివించారు.
ఆ వూళ్ళో దేవస్రష్ట, ఆయన కుమారుడు అగ్నిస్రష్ట, ఆయన కుమారుడు ‘రత్నసభారాధ్య’వంశపారంపర్య హక్కుతో పెత్తందారీ వెలగబెడుతూ దోపిడీతనానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారి ఊరిని వేధిస్తుంటారు. పేద దళితులకు చిన్నచిన్న అప్పులు యిచ్చి ఆస్తులు లాగేసుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటైపోయారు.
దేవస్రష్ట గుండెపోటుతో మరణించాక అగ్నిస్రష్ట ఆగడాలకు హద్దులేకుండా పోయింది. కరణాన్ని అన్యాయంగా చంపిస్తాడు. ఎర్రమ్మ భర్త దాశయ్యను కొట్టించి అవిటివాణ్ణి చేయిస్తాడు. తరువాత ఆ బాధలతోనే దాశయ్య మరణిస్తాడు. అట్లే అగ్నిస్రష్ట రాజకీయ ప్రత్యర్థి చెంగల్రాయుడిని ఖూనీ చేయిస్తాడు. చివరకు తన భార్య అనసూయను బావిలోకి నెట్టి చంపేస్తాడు. ఇట్లా ఊర్లో చాలామంది మహిళలు అగ్నిస్రష్ట బాధితులే.
ఊళ్ళో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చూస్తూ, వాటిని నిలువరించే శక్తిలేక ఎర్రమ్మ పెద్ద కుమారుడు ‘బార్గవ’ నక్సలైట్లలో కలుస్తాడు. బార్ఘవ అగ్నిస్రష్టను చంపేందుకు ప్లాన్‌ చేస్తాడు కానీ తృటిలో అగ్నిస్రష్ట తప్పించుకుంటాడు. ఎర్రమ్మ ‘వాణ్ని నేను చంపుతాను, వాణ్ని నాకు వదిలేయ’మంటుంది. చివరకు పీడితమహిళల సహకారంతో ఎర్రమ్మఅగ్నిస్రష్టను చంపింది.
అగ్నిస్రష్ట కుమారుడు రత్నసభారాధ్య ఎన్నికల్లో గెలిచి హోంమంత్రి అవుతాడు. ఎట్టకేలకు బార్గవను చంపిస్తాడు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో రత్నసభా రాధ్య ఓడిపోతాడు. తరువాత నక్సలైట్లు మిలిటరీ దుస్తుల్లో వచ్చి రత్నసభారాధ్యను బంధించి యింటినుండి ఎత్తుకుపోతారు. ప్రజాకోర్టు నిర్వహిస్తారు. ప్రజలు హాజరై అతన్ని చంపమంటారు. కానీ ఎర్రమ్మ అతడిని నలగకుమ్ముతుంది, చంపటానికి ఆమె ఒప్పుకోదు. పార్టీ నాయకులు కూడా ఎర్రమ్మ మాటను అంగీకరించి అతన్ని ప్రాణాలతో వదిలేస్తారు.
తరువాత రత్నసభారాధ్య పునరాలోచనలో పడతాడు. తన నీచ జీవితాన్ని గురించి అసహ్యంగా భావిస్తాడు. ఎర్రమ్మ యింటికిపోయి ఆమె పాదాల మీదపడి తన తప్పులు ఒప్పుకొని తాను మారిపోయిన విషయం చెప్తాడు. తన ఆస్తి మొత్తం ‘చెరువు గండి’ గ్రామానికి ఖర్చు చేయడానికి నిశ్చయించుకుంటాడు. ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎర్రమ్మ, రత్నసభారాధ్యలో మానసిక పరివర్తన తేగలిగింది. తరువాత ఎర్రమ్మ ప్రశాంతంగా మరణిస్తుంది.
ఈ నవల విప్లవ భావాలను రాజేసింది కానీ, దళిత వర్గాల్లో ప్రజాస్వామ్య భావాలతో ‘మనిషిని చంపడం కాదు ముఖ్యం వారిలో మానసిక పరివర్తన తేవాలనేది ముఖ్యం’ అనే సందేశాన్ని చివరకు అందిస్తుంది. ఎర్రమ్మ ఒక సందర్భంలో బలాత్కారానికి గురవుతుంది. కానీ స్త్రీ ఒంటరిగా ఉన్నపుడు పశుబలంతో సెక్స్‌ పరంగా అనుభవించినంత మాత్రాన శీలం పోయినట్లు కాదనే సందేశాన్ని ఈ నవల అందిస్తుంది. పగ, ప్రతీకారం తీర్చుకోవడం కాదు ముఖ్యం. తప్పు చేసేవాణ్ణి మార్చడం, వాడి మానసిక పరివర్తనలో మార్పు తేవడం ముఖ్యం అనే సందేశాన్ని యిస్తుంది ఈ నవల.
ఈ నవలలో అగ్నిస్రష్ట భార్య అనసూయ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఎర్రమ్మ భర్త దాశయ్య రాసి యిచ్చిన బాండ్లను చాటుగా వారికే యిచ్చేస్తుంది. దానికి కారణం అగ్నిస్రష్ట ఎర్రమ్మను బలాత్కారంతో లొంగదీసుకున్న విషయం తెలిసి తప్పుడు సంబంధం కొనసాగకూడదనే భావనతో ఎర్రమ్మ కుటుంబాన్ని అప్పులనుండి విముక్తి చేస్తుంది.
ఈ నవల ప్రభుత్వంవారు బ్యాంకుల ద్వారా రైతుకూలీలకు అప్పులు ఇప్పించి, ఆడవాళ్ళ అదనపు ఆదాయాన్ని సంపాదించే ఎసలుబాటుతనాన్ని కల్పించడం కూడా ఒక మోసమేననే విషయాన్ని బట్టబయలు చేస్తుంది. బ్యాంకు అప్పుకు వడ్డీ కట్టలేక, ఖర్చులు పెట్టుకొని కలలు కల్లలుగా మిగిలిపోతున్న విషయాన్ని నవలాకారుడు బాగా తెలియజెప్పాడు.
ఎర్రమ్మ నేటి ఓట్ల రాజకీయం రంగుల్ని బయటపెట్టింది. రాజకీయాల్లో పాలకపక్షం, ప్రతిపక్షం తరుపున పోటీ చేసే వాళ్ళిద్దరూ డబ్బున్నవాళ్లే. ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఓట్లను కోట్లతో కొని గెలవాలనుకునేవారే. అంటే ప్రజాస్వామ్యం అసలైన విలువల మీద నమ్మకం లేనివాళ్లు, అడ్డదారిలో అందలం ఎక్కాలనుకునేవారు. అది ఒక విధంగా అరిష్టం. ఇది ప్రజల దౌర్భాగ్యం. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆడే ఆట అందరికీ తెలియ చెప్పడానికి ఊతమిచ్చింది ఈ నవల.
ఎర్రమ్మ చిట్టచివరకు ఒక పరిపక్వమైన మానసికస్థితి గల శాంతమూర్తిగా మారిపోతుంది. చచ్చిన కొడుకును రత్నసభారాధ్యలో చూచుకుంటున్నాననే స్థితికి చేరుతుంది. ‘‘రత్నసభారాధ్య! నీవు నా కొడుకుతో సమానం, నా చనిపోయిన కొడుకుకోసం బతికిన కొడుకును చంపను’’ అంటూ భూదేవంత ఓర్పు క్షమాగుణం కనబరుస్తుంది ఎర్రమ్మ.
క్షుద్ర రాజకీయాల గుట్టు విప్పడమే కాకుండా, స్వచ్చమైన మార్పు మనుజుల్లో రావాలని కోరుకున్న వీరవనిత ఎర్రమ్మ. సమాజంలో దోపిడీ ఆగాలి. కూడు గుడ్డ ఇల్లు విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలనే దేశ సౌభాగ్యాన్ని కాంక్షించిన వనిత ఎర్రమ్మ.
వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి ‘చెరువు గండి’ నవలను చైతన్యవంతమైన పోరాటస్పూర్తితో, విఫ్లవ భావాలతో, ప్రజాస్వామ్య విలువలతో, మనిషి మార్పుకు దోహదం చేసే విధంగా తీర్చిదిద్దారు. నేటికాలం ఆర్థిక ప్రలోభా లతో, అనైతిక విలువలతో, స్వార్థం పెట్రేగిపోతున్న అప్రజాస్వామ్యంలో కాగిపోతుంది. దీన్ని మార్చడానికి ఎంతైనా దోహదపడే విధంగా రచయిత నవల రాశారు. నవల రచనాశైలి పాఠకుణ్ణి వెంటాడే విధంగా ఉన్నది. అందరూ చదవదగినదిగా ‘చెరువు గండి’ నవలను భావిస్తాను.
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సెల్‌్‌:9948774243

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img