Friday, May 31, 2024
Friday, May 31, 2024

రాజపోషకులు లేకున్నా రాజాంలో సాహిత్యం

గార రంగనాథం, 98857 58123

1655లో శ్రీకాకుళానికి ఫౌజుదారుగా ఉన్న షేర్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజాం హుండాను (పాంతాన్ని) పద్మనాయక కులానికి చెందిన పెదరాయుడుకు,భోగాపురం ప్రాంతాన్ని పూసపాటి వంశీయులకు ఇజారాకు(గుత్తకు) ఇచ్చాడు.ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం 8వ భాగం పుట222.అంతవరకు ఈ రాజాం, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాలు గిరిజనప్రాంతాలతో సమానంగాను, కటకంగజపతుల సామంతులైన మన్యపురాజుల ఏలుబడిలోను ఉన్నట్టు అంచనా వేయవచ్చు. ఈ పట్టణాలు ఏర్పడక ముందర ఈ మూడు చోట్ల కుగ్రామాలు ఉండి ఉండవచ్చు. పద్మనాయక వెలమలు రాజాంలో కోటకట్టుకొని కొన్నాళ్ళున్నారు.రాజులుండే పట్టణం కనుక రాజాం అనే కొత్త పేరుతో ఆనాటి నుండే ప్రఖ్యాతమైందని చెప్పవచ్చు.1757లో రాజాంలో ఉన్న తాండ్ర పాపారాయుడికి జడిసి విజయనగరం సేనలు ఫ్రెంచివారితో పాటు ఆకులకట్ట డవిని నరుక్కుంటూ కొత్త త్రోవను చేసుకుని బొబ్బిలి పైకి దండెత్తాయన్నది చారిత్రక సత్యం.ఈ కారణంగా రాజులేని రాజాంలో సాహిత్య సృజనకు ఆస్కారం లేకుండా పోయింది.
ఐతే రాజాం చరిత్రలో తొలిసారిగా సాహిత్య సృష్టి చేసిన కవి కొట్రా వెంకటేశ్వరులు. రాజాం పట్టణానికి ఆరుకిలో మీటర్ల దూరంలోని ఇల్లంనాయుడు వలసను బొబ్బిలి రాజులు ఈయనకు ఈనాంగా ఇచ్చారు.అతడు ఆ గ్రామంలోని చీడి యల్లంనాయుడు అనే మోతుబరి పై 133 పద్యాలతో ఒక శతకం రాసి ఇచ్చాడు.
……………..దేవకీ సతికి బొడము/చిన్ని కృష్ణుడు నీకిడు సిరుల గములు
అరి కరి మృగేంద్ర చీడి కులాబ్ధిచంద్ర/ నవ్యగుణసాంద్ర యల్లమ నాయకేంద్ర!…. ఈ రకంగా కీర్తిస్తూ ఆ శతకం సాగింది. యల్లమ నాయుడు వేరొక చోటు నుండి తానువచ్చి, మరికొందరిని తెచ్చి వలసదారులచే ఏర్పరచినది కనుకనే ఆ గ్రామం ఇల్లంనాయుడు వలస అయి ఉంటుంది.ఈ శతకం మద్రాసులోని ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉంది.ఈ గ్రంథరచన ఎవరు చేశారన్న దానిపై అభిప్రాయ భేదా లుండగా కొట్రా వెంకటేశ్వరులే చేశారని నిడదవోలు వెంకటరావు నిర్ణయించారు.పై గ్రంథంలోనే 223వ పుట. ఈయన చిన్ననాడే పదుగురు మెచ్చేట్లు పద్య రచనలు చేయడం వలన అందరూ ఈయనను బాలకవి అనేవారు.చివరివరకూ ఆ పేరు అలాగే ఉండి పోయింది. సీ॥ బాలానిలోచ్చాలి తైలాల తాపాళి/ కాలోల సమదాళి లాలితములు, సురశాల వరసముత్కరలోల శుకశుకీ/ స్ఫురితాలవన విభాసురతములును ।..ఇత్యాదిగా సాగుతుంది ఈయన కవిత్వం. విస్మృత కళింగాంధ్ర కవులు పుట 86 అడిదం రామారావు. నాటికీ నేటికీ రాజాం ప్రాంతం మామిడి తోటలకు ప్రసిద్ధి. సంపాదించిన పండ్లను తాండ్రచేసి ఎండబెట్టుకొన ేవాడు బాలకవి.వాటిని కాకులు పొడుచుకొని తినేవి. ఆ కాకుల్ని తిడుతూ ఓ పద్యం చెప్పాడు. ఉ॥ నీ కుటిలత్వము న్విడువ నేరవు తిట్టెదఁ, దాండ్ర గైకొనన్‌ రాకుÑపరాకు చేనయిన రాకుÑవివేకము దెచ్చుకొమ్ముÑ నా వాకులు దప్ప వారయ ధృవంబుగ నమ్ము మనంబులోన యో కాకామ! నీకుఁ దెల్పెదఁ జికాకొనరింపకు నేఁ గవీంద్రుడన్‌ ॥ వి.క.క 82 పుట..ఈ విధంగానే ఎలుకల్ని, పంది కొక్కుల్ని మరో పద్యంలో తిట్టాడు. ఇతని కాలం గూర్చి చెప్పాలంటే అడిదం సూరకవి గూర్చి చెప్పాలి.బాలకవి బొబ్బిలివారి నుండి మాన్యం పొందినట్టే సూరకవి విజయనగరం రాజులనుండి చీపురు పల్లి దగ్గరలోని గురివిందాడ ను మాన్యంగా పొందాడు.అక్కడికి దగ్గరలోని ‘ కంచరాల’ గ్రామంలో కొంత మాన్యం ఉండేది.కంచరాల అంటే ప్రస్తుతం గెడ్డకంచరాం అయుంటుంది. వీరిద్దరి గ్రామాలూ పంటలు పండనివే! అందుచేత భుక్తి కోసం స్నేహితులుగా తిరుగుతూ వీరఘట్టాం చేరుకొని పర్వతాలు అనే కోమటి కవిని ఓడిరచారట.ఆ సందర్భంలోనిదే ఈ పద్యం. ఆ,వె. నరుని నొగలు మీద హరియున్న చందాన/సూరకవి వరేణ్యు జోగఁ గూడు కొట్ర బాలకవి యకుంఠ వాగ్ధాటికిఁ/ బర్వతాలు గాఁడు పారిపోయె!వి.క.క 81 పుట....వీరిద్దరు మిత్రులూ ఒకరినొకరు శ్లాఘించుకొంటూ చెప్పిన పద్యాలు కూడ ఉన్నాయి. అంతిమంగా వీరు 1720 90 మధ్యకాలం లోని వారని సాహిత్య చరిత్ర కారులు నిర్ణయించారు.ఈ రాజాం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో బాలకవివలస అనే ఊరు ఉంది. మరో వందేళ్ళు దాటిన తరువాత 1901లో ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్రరావు ఈ ఊరిలోనే జన్మించారనడం ఒకింత గర్వకారణం. రాజాంలో ఆరోగ్యశాఖలో పనిచేసిన మేడూరి సీతారామయ్య శర్మ 1955 లోనే గీతాంజలిని అనువదించారు.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కారణంగా బరంపురంలో తెలుగు భాషకు ఆదరణ తగ్గింది.దాంతో అక్కడి ప్రఖ్యాత వేగుజుక్క ముద్రణాయంత్రాన్ని తీసుకొని ప్రముఖ సాహితీ వేత్త దేవరాజు వెంకట కృష్ణారావు 1959లో రాజాం చేరారు .తన వేగుజుక్కలో అప్పటికి దశాబ్ద కాలంగా పని చేస్తున్న గంధవరపు వెంకటరావుకు వేగుజుక్కను అప్పగించి 1966లో రాజాం లోనే మరణించారు.నేటికీ అదే పేరుతో ఆ ప్రెస్సు రాజాంలో పని చేస్తోంది.
1969లో కొందరు కవి పండితులు రాజాంలో శారదా రచయితల సమితి ఏర్పాటు చేశారు.వారి సాహిత్య చర్చలకు,పుస్తక ముద్రణలకు వేగుజుక్క వేదిక అయ్యేది.రచయితల సమితిలో సుమారు ఇరవైమంది ఉండగా అందరూ పద్యం,కవిత,నవల, కథ ఇలా ఏదో ఒకటి రెండు ప్రక్రియలలో రాసిన వారే!ఆ రోజుల్లో సమస్యా పూరణం ఓ ఉద్యమంలా సాగేది.వాక్సుధాలహరి బిరుదాంకితుడు పప్పు చిట్టిదాసు ‘రామ కథామృతం,కృష్ణ కథామృతం’ అనే గ్రంథాలను రాశారు. వారు కొన్నాళ్ళు ‘విజయ సారధి’అనే వారపత్రికను నడిపించారు.
ఇదే రచయితల సమితి సభ్యుడుగా సుందరాడకు చెందిన చిగురుకోట వెంకట రమణ గౌరీశతకాన్ని, వెంకట రామలింగయ శతకాన్ని, సావిత్రీ చరిత్ర ప్రబంధాన్ని, రక్తి, భక్తి, భుక్తి అనే అంశాలతో కూడిన ‘మాయా ప్రపంచం’ అనే ఖండకావ్యాన్ని రచించారు.గంధవరపు వెంకటరావు మారిన దొంగలు, తోడుకోసం, దైవసంకల్పం, పూల బంతులు అనే నవలలు రాశారు. దామెర వెంకటరావు రవీంద్రుడు రాసిన గీతాంజలిని అదే పేరుతోను, స్ట్రే బర్డ్స్‌ ను స్వేచ్ఛావిహంగాలు గాను అనువదించారు. ఆంగ్ల మేధావుల అక్షర సత్యాలకు స్వేచ్ఛా కవితానువాదంగా ‘పరిమళ భావ తరంగాలు’ ను రచించారు. ఆయన రచించిన తొలి కవితా ఖండ కావ్యం ‘యవనిక’.కాకరాపల్లికి చెందిన ప్రసిద్ధకవి గెడ్డాపు సత్యం.వీరు జైత్రయాత్ర, మృత్యుంజయుడు, శివకేశవం (సవ్యాఖ్యానం),ప్రసన్నధర్మం అనే లఘుకావ్యాలను రాశారు.ఆయన రాసిన కవితా వైజయంతి అనే ఖండకావ్యం ఆధునిక పద్యసాహిత్యానికి ఎత్తిన వైజయంతి అనవచ్చు. సిరిపురానికి చెందిన వీరి సాహిత్య గురువు ఉరిటి సూర్యనారాయణ భక్త కైకేయి, కుసుమ హరనాథాంజలి అనే గ్రంథాలను రచించారు.
భావశ్రీ అనే కలం పేరుగల వాండ్రంగి రామారావు శతాధిక గ్రంథకర్త.ఈయన గ్రంథాలు సుమారు 50 ముద్రితం కాగా, అంతకంటే ఎక్కువ అముద్రితంగా ఉండిపోయాయి. కాకినాడ రామమూర్తి ఆచారి 200 పుటల గార్హస్త్యం అనే పుస్తకాన్ని రచించారు. రసూల్‌ అనే టైలర్‌ ను గొప్పసాహితీ వేత్త,రచయితగా ఇప్పటికీ చెప్పుకుంటారు.అన్నంరాజు సుందర రామయ్య,ముట్నూరి అనంతశర్మ,కొండవేటి జగ్గారావు,శ్రీపాద లక్ష్మీనారాయణమూర్తి,రాపాక అప్పారావు,తనికెళ్ళ భానుమూర్తి, బలివాడ కృష్ణారావు, కోవెలకొండ నారాయణస్వామి లతోపాటు సరుబుజ్జిలి నుండి టంకాల చినప్పలనాయుడు కూడా రచయితల సమితి సభ్యుడే! ఈ విధంగా మూడు దశాబ్దాలు నడిచిన‘శారదా రచయితల సమితి’ని రాజాంలో వెలసిన తొలి సాహితీ సంస్థ గా పేర్కొనవచ్చు.
అనంతర కాలంలో రాజాంలో బి.వి.ఎ.రామారావునాయుడు చేత ‘చేతన’ సాహితీ మిత్ర సమాఖ్య,వెలుగు రామినాయుడు నడుపుతున్న ‘వెలుగు’సాహితీ సాంస్కృతిక సంస్థ,ప్రస్తుతం ఆరున్నరేళ్ళుగా ఈ వ్యాస రచయిత నడిపిస్తున్న ‘రాజాం రచయితల వేదిక’ స్థాపించబడ్డాయి.
రాజాం రచయితల వేదిక 17 సాహిత్య వ్యాసాలతో ‘సాహితీసౌరభాలు’ అనే వ్యాససంపుటిని వెలువరించింది. వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తరంగధ్వానాలు అనే ప్రగతిశీలమైన ఆటవెలది పద్యాలను రాసి పుస్తకంగా తెచ్చారు.ఈ రచయితల వేదిక నెలకొక సాహిత్య ప్రసంగంతో పాటు, ఆరు వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకొంది. పుస్తకావిష్కరణలు,పుస్తక సమీక్షలు నిర్వహిస్తోంది. అందుచేతనే కణుగుల వెంకటరావు ‘శ్రీకాకుళం జిల్లా సాహిత్య రాజధాని రాజాం’ అని కొనియాడారు.
‘నిజం’ పేరుతో నిజం గీతాలు, ఎర్ర మందారాలు, నివురు,నాలుగో పాదం, అలలు అనే ఐదు కవితా సంపుటాలు వెలువరించిన గార శ్రీరామమూర్తి ఇదే ప్రాంతానికి చెందిన మందరాడలో పుట్టారు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు కళారత్న మీగడ రామలింగస్వామి రాజాంలోనే జన్మించారు.1942లో గజరాయనివలసలో పుట్టిన చెళ్ళపిళ్ళ సన్యాసిరావు రాజాంలో అర్థశతాబ్దిగా నివసిస్తున్నారు. ఈయన వివేక వర్ధని,చైతన్యదీపిక, అనే వ్యాససంపుటాలను, కవితా మృతం, మానవుడు` మహనీయుడు,మాతృభూమి అనే కవితా సంపుటాలను రచించారు. నేతేటి నరసింగరావు పుష్పగుచ్ఛం,సర్వేశ్వర శతకం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలతోపాటు, ధన్వంతరీ శతకం అనే ఆయుర్వేద శతకాన్ని రాశారు. యామన బసవయ్య కంద రామాయణాన్ని, తథాగతుడు అనే పద్య కావ్యాన్ని రచించారు. వీరితోపాటు భూపతి నారాయణస్వామి, ముళ్ళపూడి సరసరాజు తదితరులు పద్య రచయితలు, వారు ఇక్కడికి సమీపంలోని జి.సిగడాంకు చెందినవారు.
ఖండాంతరాలలో తెలుగు భాషాసేవ చేసిన వెల్చేరు నారాయణరావు రాజాంకు సమీపంలోని అంబఖండిలో పుట్టారు. ఆ ఊరిలోనే జన్మించిన మానుకొండ చలపతిరావు ఒకనాటి ఉన్నత స్థాయీ పాత్రికేయుడు. రాయలసీమకు ఆ పేరును సూచించిన చిలుకూరి నారాయణరావు పుట్టిన ఆనందపురం అగ్రహారం ఇక్కడికి దగ్గరలోనే ఉంది.
రాజులేని రాజాంలో ఎవరి పోషణా లేకుండానే నాటినుండీ నేటివరకూ సాహిత్య స్రవంతి ప్రవహిస్తుండడం చెప్పుకోదగ్గ విషయం.కారణం ఏదయినా ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాలో రాజాం ప్రాంతంలోనే ముందుగా సాహిత్యం ఉద్భవించిందన్నది చారిత్రక సత్యం.ఈ ప్రాంతపు రచయితలు గతంలో ఎలా ఖండాంతరాలలో ఖ్యాతిగాంచారో భవిష్యత్త్తులోనూ అలాగే రాణిస్తారని ఆశపడడం తప్పుకాదేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img