Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

సాహిత్యంలో ఒక సంచలనం చలం…

సారిపల్లి నాగరాజు, చరవాణి: 8008370326.

‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు వుంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి’’ అని 1925వ సంవత్సరంలోనే చెప్పి ‘స్త్రీ’ అనే రచనతో తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైన పెను మార్పును తీసుకువచ్చిన వారు చలం. ఆయన సాహిత్యం ఒక సంచలనం. తెలుగు సాహిత్యం అంతా భావ కవిత్వ మత్తులో ఊయలలూగుతుంటే చారిత్రక నేపథ్యంలో రచనలు చేసిన స్త్రీ స్వేచ్ఛావాది చలం. సాహితీ లోకంలో చలంగా పాఠకుల మనసులో తనదైన ముద్రను ఏర్పరుచుకున్న గుడిపాటి వెంకట చలం 1894 వ సంవత్సరం మే 19 వ తేదిన సాంబశివరావు, వేంకట సుబ్బమ్మ దంపతులకు మద్రాసులో జన్మించారు. తన తాత గుడిపాటి వేంకట రామయ్య దత్తత తీసుకోవడంతో ఇంటి పేరు మారి గుడిపాటి వెంకట చలంగా ప్రసిద్ధి గాంచారు.
తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన చాలా మంది గొప్ప రచయితలలో చలం ఒకరు. చలం రచనలు దాదాపుగా స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని వెలువడినవే. ముఖ్యంగా సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను తమ రచనలలో పొందుపరిచారు గుడిపాటి. చలం రచనలలో ఇతివృత్తము, తాత్వికత, రచనా శైలీ ఆయనను ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానానికి చేర్చాయి.
గుడిపాటి వెంకటచలం తన మనసులో కలిగే భావాలను వ్యక్తపరచడానికి నవల, కథ, నాటకం తదితర ప్రక్రియలను ఎన్నుకున్నారు. అంతేకాక వ్యాసం, పీఠిక, ప్రేమలేఖలు లాంటివి కూడా ఆయన కలం స్పృశించింది. ఈయన కలం నుండి జాలువారిన రచనలు సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. చలం రాసిన ‘‘శశిరేఖ (1921), దైవమిచ్చిన భార్య (1923), మైదానం (1927), వివాహం (1928), బ్రాహ్మణీకం (1937) మొదలైన నవలలు తెలుగు సాహిత్యంలో మణిపూసల్లా నిలిచాయి. అంతేకాకుండా సుమారుగా వందకు పైగా కథలను రాశారు. పురూరవ, త్యాగం, విడాకులు, శశాంక వంటి నాటకాలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. స్త్రీ వ్యక్తిత్వ వికాసానికి, విముక్తికి దోహదం చేసే రచనలకి రూపకల్పన చేసిన గొప్ప రచయిత గుడిపాటి వెంకట చలం.
చలం ముఖ్యంగా స్త్రీకి ఆర్థిక, హార్దిక, లైంగిక స్వేచ్ఛలు కావాలని కోరుతూ సమాజంపై పోరు చేసాడు. స్త్రీ జాతిని గురించి స్త్రీ విముక్తి గురించి ఎవరూ ఆలోచించని సమయంలో స్త్రీని గురించి పట్టించుకొని ఆ దిశగా రచనలు చేయడం చలం చేసిన గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. చలం జీవితంలో చూసిన అనుభవాలని, సంఘటనలను తన సాహిత్యంలో రూపు దిద్దారు. చలానికి స్త్రీ, పురుష సంబంధాల పట్ల, కుటుంబ జీవనం పట్ల నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నవారు. సొంత అభిరుచులు, కోరికలు వ్యక్తం చేసుకోవడానికి, శరీర వాంఛలు తీర్చుకోవడానికి సమాజంలో స్త్రీకి గల అవరోధాలన్నింటినీ ఆయన ఎదురించి నిలబడ్డారు. స్త్రీలు వ్యక్తిత్వ వికాసం కోసం చేసే ప్రయత్నాలను సమర్ధించారు.
గుడిపాటి వెంకట చలం రాసిన నవలలో ‘‘మైదానం’’ (1927) విశిష్టమైనది, ప్రత్యేకమైనది. 1927వ సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో ఈ నవల పాల్గొంది. కానీ బహుమతిని మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. ఆ పోటీలో విశ్వనాథ సత్యనారాయణ గారి ‘‘వేయిపడగలు’’, అడవి బాపిరాజుగారి ‘‘నారాయణరావు’’ నవలలు బహుమతులు దక్కించుకున్నాయి. చలం ఈ జీవితం ఎందుకు అని ప్రశ్నించుకోగా దానికి సమాధానంగా… ‘‘జీవితం అంటే ఆనందానికి, సెక్స్‌ ద్వారా కలిగే ఆనందానికి, స్వేచ్ఛలో సెక్స్‌ ద్వారా కలిగే ఆనందానికి’’ అని మూడు రకాలుగా ఉంటోంది. ఈ దృష్టితోనే సమాజంలో స్త్రీల పరిస్థితుల్ని విశ్లేషించి భావ విప్లవానికి బాటలు వేశారు చలం.
‘‘మైదానం’’ నవల స్వేచ్ఛకు ప్రతీక. ‘మై’ అంటే శరీరం, ‘దానం’ అంటే ఇవ్వడం. ‘‘మైదానం’’ నవలలో నాయిక రాజేశ్వరి. ఆమె అమీర్‌కు, మీరాకు శరీరం దానం చేయటం వల్ల కూడా దీనికి ‘‘మైదానం’’ అనే పేరు కూడా వచ్చి ఉంటుంది. ‘‘మైదానం’’ నవలలో రాజేశ్వరి సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన స్త్రీ. ప్రేమ, మోహం ఏమీ లేని ఒక లాయరుకు ఇచ్చి రాజేశ్వరిని తన తల్లిదండ్రులు వివాహం చేస్తారు. తన మనసులోని కోర్కెలను గ్రహించలేని వ్యక్తితో సంసారం చేయలేకపోయింది. అమీర్‌ అనే మహమ్మదీయ వ్యక్తిని చూసి, తన మనసుని అమీర్‌కు ఇచ్చి. అతనితో వెళ్ళిపోతుంది. కట్టుబాట్ల మధ్య కంటే స్వచ్ఛమైన మైదానాలలోనే ప్రేమికులు స్వేచ్ఛగాఉండగలరని చలం ఈ నవలలో చూపారు.
వివాహ వ్యవస్థను కాదని, మోహం లేని భర్తను వదిలి అమీర్‌తో మైదానాలకు వెళ్ళిన రాజేశ్వరికి అమీర్‌ ప్రవర్తన తీవ్ర క్షోభను కలిగిస్తుంది. అమీర్‌ తోళ్ళ సాహెబ్‌ కూతురిని ప్రేమించడం మరింత బాధను కలిగిస్తుంది. అప్పటికే గర్భవతి అయిన రాజేశ్వరిని అమీర్‌ గర్భంవదిలించుకోమని బలవంతం చేస్తాడు. చివరికి రాజేశ్వరికి ఇష్టం లేకపోయినా శిశు హత్యకు ఒప్పుకుంటుంది. అన్నీ వదులుకొని వచ్చిన రాజేశ్వరిని అమీర్‌ ఘోరంగా బాధిస్తాడు.
అమీర్‌ మరో చోటికి వెళ్తూ ఆరు నెలల్లో తిరిగి వస్తానని చెప్పి రాజేశ్వరికి తోడుగా మీరాను పెట్టి వెళ్తాడు. అమీర్‌ వెళ్ళిపోయాక అనారోగ్యంతో ఉన్న రాజేశ్వరికి మీరా సేవలు చేసి దగ్గరవుతాడు. రాజేశ్వరి మనసు క్రమేపి మీరా వైపు మళ్ళుతుంది. అంతవరకూ తమ్ముడిగా భావించిన రాజేశ్వరి మీరా పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. సమాజ నియమాలను మరచి స్త్రీలు అవసరార్ధం ఒకరి కంటే ఎక్కువ మందిని కోరుకోవచ్చనే విషయాన్ని రాజేశ్వరి మీరాను కోరడంలో చలం చూపిస్తారు. నవలలో రాజేశ్వరి అమీర్‌ కోసం త్యాగం చేయడం కనిపిస్తుంది కానీ, అమీర్‌ మాత్రం తన స్వార్థమే తను చూసుకున్నాడు. మీరాతో రాజేశ్వరి సన్నిహితంగా ఉండడం చూసిన అమీర్‌కు కోపం వస్తుంది. మీరా మీద కోపం, పగ, అసూయ, ఈర్ష్య అన్నీ పెంచుకుంటాడు. మీరా మీద ఉన్న కోపంతో గొడవకు వెళ్తాడు. మీరాను కత్తితో పొడిచి చంపబోతాడు, రాజేశ్వరి మీరాను కౌగలించుకొని అమీర్‌ కత్తికి అడ్డు పడుతుంది. చివరికి అమీర్‌ తానే ఆత్మహత్య చేసుకుంటాడు. కుల మత భేదాల్ని, నీతి నియమాల్ని, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను అన్నింటినీ వదిలి అమీర్‌తో మైదానాలకి వచ్చి స్వేచ్ఛని పొందాలనుకొన్న రాజేశ్వరి చివరాఖరికి హతాశురాలుగా మిగిలిపోతుంది. కుల పెద్దలు, కుటుంబ సభ్యులు, సమాజం కుదిర్చిన వివాహం అసహ్యకరమైనది అయినప్పటికీ అందులో భద్రత ఉంటుందని ఆలోచిస్తుంది రాజేశ్వరి. మనసుకు నచ్చిన వ్యక్తితో ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా గడపడానికి కుటుంబాన్ని వదిలి వచ్చిన రాజేశ్వరి నవలాంతంలో భంగపడినట్లు రచయిత చిత్రీకరించారు.
‘‘మైదానం’’ నవల కామదాహాన్ని కలగజేస్తుందని, నైతిక విలువలు త్యజించి యువతీ యువకులు ఉద్రేక స్వభావంతో పతనమవుతారని విమర్శకులు భావించారు. ఈ నవల వల్ల ఆనాటి సమాజం మనో భావాలు దెబ్బతిని చలం పట్ల తీవ్ర నిరసన, వ్యతిరేకతను చూపించారు. సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలు, అంధ విశ్వాసాలు తొలిగిపోవాలని, వ్యక్తుల ఆలోచనలో, ఆచరణలో మార్పు రావాలని చలం కాంక్షించారు. సమాజంలో స్త్రీ పట్ల ప్రవర్తించు తీరు, ఆమె స్వేచ్ఛకు అడ్డంకులు కల్పించడం చలాన్ని కదిలించాయి. చలం కలం స్త్రీ సమస్యల వైపుగానే కేంద్రీకృతమై రచనలు గావించారు.
(ప్రముఖ కథకులు, నవలాకారులు గుడిపాటి వెంకట చలంగారి
మైదానం నవల మీద …)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img