Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అభ్యుదయ సాహిత్యానికి చిరునామా అవసరాల

పెనుగొండ లక్ష్మీనారాయణ,
అరసం జాతీయ కార్యదర్శి, సెల్‌: 9440248778

అభ్యుదయ సాహిత్యోద్యమానికి ష్ఫూర్తి ప్రదాత గురజాడ సాహిత్యాన్ని మన కప్పగించిన, అప్పజెప్పిన ప్రగతిశీల సాహితీవేత్తలలో ఒకరు అవసరాల సూర్యారావు. కాలక్రమంలో అవసరాల విస్మృతిలోకి జారిపోయారు. ఎంతగా వారి పేరు వినబడకపోయినా, కనబడకపోయినా వారు సృష్టించిన సాహిత్యావసరం మాత్రం నేడు మరింత ఉంది.
తూర్పుగోదావరి జిల్లా పొందూరు గ్రామంలో 14 డిసెంబర్‌ 1923 న జన్మించిన అవసరాల సూర్యారావు శత జయంతి సంవత్సరమిది. వారి జీవితాన్ని, సాహిత్యాన్ని మననం చేసుకునే సందర్భమిది. అవసరాల చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర కావ్యాలను అధ్యయనం చేశారు. విజయ నగరం మహారాజ కళాశాల నుంచి పట్టభద్రలయ్యారు. వందేమాతరం, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ దినపత్రికలలో పని చేశారు. విజయనగరం, విజయవాడ వీరి కార్యక్షేత్రాలు. 30, 31 జులై 1955 లో శ్రీశ్రీ అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభలో పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యునిగా ఎంపికయ్యారు. అవసరాల వారి పేరుతో పాటు ఉత్తరాంధ్రకే చెందిన మరో యిద్దరు ఉత్తమ అభ్యుదయ రచయితలు అవసరాల రామకృష్ణారావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గుర్తుకు వస్తారు.
అవసరాల వారు అందించిన సాహిత్యం: మహాకవి గురజాడ డైరీలు, లేఖలు మాటామంతి మొదలగు రచనలకు సంపాదకత్వం వహించారు. ప్రచురించారు. గురజాడ ఆంగ్లంలో రాసిన ాూుూూూIచీG ుూ RAIూజ్ణు కథను ‘‘సంస్కర్త హృదయం’’గా తెలుగు చేశారు. ప్రఖ్యాత హిందీ రచయిత ముల్కరాజ్‌ ఆనంద్‌ నవల ‘కూలీ’ ని అనువదించారు. ‘నెహ్రూ లేఖలు’ (1969) ను తెలుగు వారికి అందించారు. వీరు నాటక రచయితగా ‘నల్లబూట్లు’ నాటిక (1948), ‘పంజరం’ నాటకం (1958) అందించారు. ‘ఆకాశ దీపాలు’ కథా సంపుటి (1952), అవసరాల కథలు (1955) తెలుగు కథానికా సాహిత్యంలో చిరస్మరణీయాలు. అనిశెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణతో కలిసి ‘కల్పన’ కవితా సంకలనానికి 1953 లో సంపాదకత్వం వహించారు.
‘కళలలో వాస్తవికత’ వంటి వ్యాసాలు రాశారు. కొన్ని గేయాలనూ అల్లారు. ముందుగా వీరి కథలను గురించి మాట్లాడుకుందాం. ఆకాశ దీపాల సంపుటిలోని వీరి ‘కొత్త పుంతలు’ కథ స్పష్టమైన మార్క్సిస్టు ఆర్థిక దృక్పథం నుంచి తెలుగులో వచ్చిన కథలలో అత్యుత్తమమైనది. ఈ కథను అరసం గుంటూరుజిల్లా శాఖ అక్టోబర్‌ 1988లో ప్రచురించిన ‘కథా స్రవంతి’ మూడవ సంకలనంలో సంకలనకర్తగా నేను చేర్చాను. తరువాత కొడవంటి కాశీపతిరావు సంకలనంచేసిన ‘కథలవాకిలి’ (1999), విశాలాంధ్ర ప్రచురణాలయం వారి ‘ఉత్తరాంధ్ర కథలు’ (2014)లోనూ ఈ కథ చేరింది. తెలుగులో వచ్చిన అనేక కథా సంకలనాలలో అవసరాల వారి ఈ కథే కాదు మరే కథా చేరలేదు. ఎందుచేతనో మరిచిపోయారు వీరిని మరి!నాకెంతగానో నచ్చిన కథకులకు పాఠ్యాంశంలాంటి ఈ కథానికను రేఖామాత్రంగా పరిచయంచేస్తాను. ఊళ్లోఅన్నారు. ఈ కథా కేంద్రం విజయనగరం కావచ్చు. చుట్టల కంపెనీ యజమాని కార్మికులు ఎంత మొత్తుకున్నా, అడిగినా, ఆందోళన చేసిని కూలీరేట్లు పెంచడు. పైగా పోలీసులను ఉసిగొల్సుతాడు. అక్కడ పనిచేసే పైడితల్లి కార్మికులను సమావేశ పరిచి వారినుండి మూలధనం సేకరించి వారందరి సమష్టి యాజమాన్యంలో చుట్టల కంపెనీని ఏర్పాటు చేసి చౌక ధరకు అమ్మకం ప్రారంభించాడు. లాభాలు ఆర్జించటమే కాదు, ఇంతకు ముందు వారు పని చేసిన యజమాని తన కంపెనీని మూసి వేసి వీళ్ల దగ్గరే చట్టలు కొని అమ్మటం జరుగుతుంది. ఈ కథ శ్రామిక శక్తి విజయానికి ప్రతీక. ‘అవసరాల కథలు’ సంపుటిని కథావాహిని శీర్షికన ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ గద్దె లింగయ్య సంపాదకత్వంలో 1955 లో ఒక్క రూపాయికే అందించింది. ఇందులో లలిత కళ్లు, ఉక్కు పిడికిలి, మనోరథం, మేకప్‌, పిచ్చిబొమ్మ, ఆల్‌ ఈజ్‌ వెల్‌ కథలున్నాయి. ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో ‘ఉప్పు పిడికిలి’ ని ‘ఉక్కు పిడికిలి’ గా చిత్రించిన కథ యిది. వరహాలు నిస్వార్థపరుడైన కాంగ్రెస్‌ కార్యకర్త. ‘స్వరాజ్యం లేనిదే నౌఖరీ నాకెందుకని’ రిజిష్ట్రారు ఉద్యోగానికి తిలోదకాలిచ్చాడు. ‘వరహాలే కాంగ్రెస్‌! కాంగ్రెస్సే వరహాలుగా గుర్తింపు పొందాడు. తీరా ఎన్నికల సమయానికి అప్పటి వరకూ కాంగ్రెసును వ్యతిరేకించిన, అవహేళన చేసిన డబ్బు చేసినాఅప్పలస్వామి కాంగ్రెస్‌లోకి చేరి శాసనసభకు పోటీ చేయాలనే తలంపుతో ఉంటాడు. అయితే వరహాలుకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉందనే భయం అతన్ని వెంటాడుతుంది. ఈ కథలో ‘డబ్బున్నవాడు రాజకీయాల్ని బిజినెస్‌ చేస్తున్నాడు’, వ్యాపారస్తుల్ని రాజకీయాల్లోంచి తరమడమే మన పని’ అనే ఈ మాటలు దాదాపు ఏడు దవాబ్దాల తరువాత నేడు మరెంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరో మంచి కథ ‘‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’’ : ‘‘ఏ ప్రభుత్వానికీ విచారణ లేకుండా మనిషిని బంధించే అధికారం లేదు’’ , ‘‘రాజకీయ ఖైదీల్ని రాజకీయ ఖైదీల్లాగా చూడాలి’’, ‘‘ఏ నేరం లేకుండా మనల్నిక్కడ బంధించి, అక్కడ మన కుటుంబాల్ని మార్చటానికి వీళ్లెవ్వరు?’’‘‘మానవ చైతన్యం ముందు తుపాకులు, ఉరికొయ్యలు, జైలుగోడలు, విచ్చుకత్తులు వోడిపోక తప్పదనే ధైర్యం, స్థైర్యం’’ యిచ్చారు ఈ కథలో. ఏనాడో రాసిన ఈ కథలో పౌరహక్కులను ప్రస్థావించారు. ఇంకా ఈ కథ నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. కృష్ణాజిల్లాలోని ‘ఎలమర్రు’ గ్రామంలో ఆనాడు జరిగిన దుశ్చర్యలను గుర్తు చేశారు. ‘ఎర్రజెండా జిందాబాద్‌’ నినాదాలనూ వినిపించారు. రాజకీయ డిటెన్యూల కష్టాలను, వారు జైలులో పడుతున్న క్లేశాలను చిత్రించిన కథ ఇది. ఇంత జరుగుతున్నా జైలు అధికారులకు ‘‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’’ గా కనిపించటం అవసరాల వారు వేసిన చురక. కల్పన కవితా సంకలనం గురించి: ‘‘అభ్యుదయ సాహిత్య పథంలోని గత ఉద్యమాల శతాబ్దపు 5వ దశకానికి ముందరి బలమైన కవితా పాదముద్రలీ కల్పన’’. ప్రగతిశీల కవితోద్యమ మహాప్రస్థానంలో ఉరుకులెత్తిన నవచేతన దళమెత్తిన పతాక రెపరెపలీ కల్పన. 1953 లో చేతన సాహితి వెలువరించిన ఈ కవితా సంకలనాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ నిషేధాన్ని తొలగించింది. ఈ కవితా సంకలనంలో ‘చింతన’ శీర్షికన సంపాదకులు గొలుసుకట్టు రీతిలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో అవసరాల వారు రాసినది పేర్కొనదగినది. ‘‘కాల్పనిక యుగం తన ముందు యుగంపై తిరగబడినట్లే కాల్పనిక కవితా యుగంపై ఆధునిక యుగం తిరుగుబాటు చేసి విప్లవ పరివర్తన తీసుకొచ్చింది. ఈ మహోదయ ప్రథమ రేఖలు శ్రీ శిష్ట్లా రచనలలో కనిపించాయి. కాల్పనిక యుగంపై విముఖత్వము నూతనత్వం కోసం ఒక అవ్యక్తవేదన ప్రస్ఫుటమౌతాయి. అధునాతన పాశ్చాత్య సాహిత్య రీతుల నుంచి విడిపడి, నూతన పధాన్ని అవలంబించి, రానున్న మార్పుకు అంకురార్పణ చేసిన ప్రథముడీయన. శ్రీశ్రీతో విస్ఫష్టంగా ఆధునిక యుగం ప్రారభమైందని చెప్పవచ్చు. ఈ యుగ వేధనను, అశాంతిని, విముక్తికై పోరాడుతున్న ప్రగతి శక్తుల సంఘర్షణను తన కావ్యాలలో శ్రీశ్రీ ప్రచండ శక్తితో రూపొందించాడు. ఈయన ధోరణి అనేకులకు మార్గదర్శకమయింది’’ అని విశ్లేషించారు. ఈ విశ్లేషణ కవిత్వ ప్రక్రియపై అవసరాల వారికి ఉన్న నిశితమైన, స్పష్టమైన అవగాహనను వ్యక్తం చేస్తుంది. 55 మంది కవుల 129 కవితలున్న కల్పన సంకలనంలో అవసరాల వారివి నాలుగు కవితలున్నాయి. అవి: కత్తెరలో కంఠం, కాటూరు, యలమర్రు, కడలూరు.., కలకత్తా కాళి ముందు, నిజంగా, బలంగా! ‘‘కూలిపేటల కదల కాకిచే కబురంపు గగనమంతా నిండ ఎర్రజెండాలెగురు! ఎందరో అందరూ మన బాట! మన పాట! ఎందరో అందరూ అందరూ అందరూ ముందుకే! ముక్తికే! ఎందరో అందరూ!’’ ఎందరో మృతివీరులను, ‘కత్తెరలో కంఠం’ లో స్మరించుకుంటూ విముక్తి పథంలో పయనిద్దాం అని పిలుపిచ్చారు.
‘‘అది ఆంధ్రావని గ్రామం ఎలమర్రు../ అది కృష్ణాజిల్లా గ్రామం కాటూరు’…కట్టుబట్టలు బెరడులా ఒలిపిస్తే అడగండయ్యా అడగండీ!… అడుగుతున్నాం, కావాలి సమాధానం! తేలాలి నిజా నిజం!!’’ అని పాలక పక్షాన్ని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. బాధితుల పక్షాన తన గొంతును వినిపించారు. ‘‘నిజంగా, బలంగా, బలంగా నిజంగా/ తెలుగు తోట, పూలపాట/ స్వర్ణ స్వప్న స్వర్ణ రేఖ/ తెలంగాణ! తెలంగాణ’’ అని కీర్తిస్తూ వీరాంగన తెలంగాణలో ‘‘యుగ యుగాల పరిపాలన/ తరతరాల పరపీడన/ పోతున్నది పోతున్నది/ఏడ్చిఏడ్చి పోతున్నది/ ఓడి ఓడి పోతున్నది!!’’ అని నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణా విముక్తిని కాంక్షిస్తూ ఆ సాయుధ సమరానికి సంఫీుభావంగా అవసరాల వారు సర్పించిన కవితే ‘‘నిజంగా, బలంగా!’’ బెంగాల్‌ కరువుకు చిత్రించిన కవిత ‘‘కలకత్తా కాళి ముందు’’.
అవసరాల వారి కవితలు గేయరీతిలో సాగాయి. మంచి తెలుగు నుడికారంతో శక్తిమంతంగా భావాన్ని అందిస్తూ సాగాయి. ప్రజా పక్షం వహించిన కవితలు, ప్రజా పోరాటాల విజయాలను కాంక్షించిన కవితలు, ఎర్రజెండాను సమున్నతంగా ఎగరేసిన కవితలు. అవసరాల వారు నాటక రచయితగా సుప్రసిద్ధులు. 1948 లో రాసిన ‘నల్లబూట్లు’ ను పోలీసు యంత్రాంగానికి ప్రతీకగా చిత్రించారు. ఈ నాటికలో రాజ్య స్వభావం, పోలీసు యంత్రాంగం సహాయంతో ప్రభుత్వాలను నడపటం, పోలీసులు సహజత్వాన్ని కోల్పోవటం కనిపిస్తాయి. అనేక సంఘటనలు సమకాలీనతను దర్శింపజేస్తాయి.
అవసరాల వారి మరో ప్రసిద్ధ నాటకం ‘పంజరం’ (1958) గుడివాడలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో ఉత్తమ రచన బహుమతి పొందింది. అకారణంగా భర్త ఆమెను అనుమానించి, వేధించి వెళ్లగొట్టిన నేపథ్యంలో జ్యోతి అనే మహిళ జీవితాన్ని నాటకంగా మలిచారు. ‘‘జీవితంలో అనేక పరిస్థితుల వలన, పతనమౌతున్న వ్యక్తులు ఎప్పుడూ అలాగే పడి ఉండాలని సమాజం శాసిస్తుంది. వాళ్లు మానవులుగా ప్రశాంతంగా జీవించడానికి హక్కు లేదని ఏ సమాజం నిర్దేశిస్తుంది! అలాంటి సమాజాన్ని కాదని ప్రతిఘటించే హక్కు నాకూ వుంది.అని సమాజాన్ని ప్రశ్నించే, స్వేచ్ఛను కాంక్షించే భావనను ఈ నాటకం ప్రతిభావంతంగా చెప్పింది. స్త్రీల పట్ల అవసరాల వారికున్న అభిమానం, సానుభూతిని ప్రదర్శించే నాటకమిది. నల్లబూట్లు, పంజరంలను అరసం కార్యకర్తలు వల్లూరు శివప్రసాద్‌, గంగోత్రి సాయి తమ సంపాదకత్వంలో వెలువడిన నాటికలు, నాటకాలు సంకలనంలో చేర్చారు.
అవసరాల సూర్యారావు 24 మార్చి 1963 న అనారోగ్యంతో 40 సంవత్సరాల పిన్న వయసులోనే అమరులయ్యారు. జీవితంలో ఎన్నో కష్టాలను, ప్రమాదాలను ఎదుర్కొన్న వ్యక్తి అవసరాలవారు. ప్రజా రచయిత, ప్రగతిశీల సాహితీవేత్త అవసరాల వారికి జోహార్లు.
(33 వ విజయవాడ పుస్తక మహోత్సవంలో 16 ఫిబ్రవరి 2023 న చేసిన ప్రసంగానికి అక్షర రూపం)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img