Friday, May 3, 2024
Friday, May 3, 2024

‘ఈ’ కాలపు యుద్ధం

రాజులు యుద్ధాలు చేసినప్పుడు
రక్తపాతంతో పాటు
రాజ్యాలు కోల్పోవటం, లేదా
కొత్త రాజ్యాలు ఆక్రమించటం
చరిత్ర కళ్లల్లో నిక్షిప్తమైన
వాస్తవ వర్ణచిత్రాలు
రాజ్యాలు అంతరించాయి
రాజులూ కనుమరుగయ్యారు
ఇప్పుడు ప్రజాస్వామ్యం
కొత్త నేత్రమైంది
అయినా, దృశ్యాలూ మారలేదు
వాటి రంగులూ మారలేదు
ప్రజల్లోంచిప్పుడు
కొందరు నాయకులు
పాలనా పాదుకి పుష్పించిన
పారిజాత పుష్పాల్లా తళుక్కుమంటున్నారు
‘నేనే’ పాలన చేయాలన్న
బలమైన రాజ్యకాంక్ష
పాత నీటిని గెంటేసి
కొత్త నీరొచ్చినట్టు
పునరావృతమైంది
వర్తమాన మకుటంలాగ
కేంద్ర బిందువులోంచొక పుష్పం
చక్రవర్తయి చక్రం తిప్పుతుంది
చుట్టూరా సామంతరాజులు
భిన్న వర్ణాలతో ప్రకాశమౌతారు
చక్రవర్తి ఆలోచనా ధోరణి
నచ్చని సామంతుడు తలెగరేస్తే
వాడి మెడ మీదికి, ఆంక్షల చురకత్తి
చూపు, రక్తవర్ణమై నిలుస్తుంది
తల నరికి, సామంత రాజ్యాన్ని
గుప్పిట బిగించుకోవటానికి
వేగుల మంత్ర మందిరంలో
రహస్య మంతనాలు, కొత్త
ఆలోచనలకి జీవం పోస్తాయి
చక్రవర్తి, సామంతుల నడుమ
మాటల యుద్ధం
తారాస్థాయికి చేరుతుంది
ఒకరిపై ఒకరు
నిందారోపణల అస్త్రాలు
కసిగా సంధించుకుంటారు.
ఒక్కోసారి మానవత్వం కూడా
నేలకు కూలి, మట్టి కరుస్తుంది
ఎన్ని అవాంతరాలు ఎదురైనా
మరెన్ని అవతారాలెత్తయినా సరే
సామంత రాజ్యంలో
తన జెండా ఎగురవేయాలన్న తపన
రాజాధిరాజుకి
జీవితాశయమౌతుంది
ఒక్కటి గమనించాలిక్కడ
జయాపజయాల సంఘర్షణలో
సామాన్య ప్రజానీకమే సైనికులు
ఏ కాలమైనా, సైనికులే కీలకం!
ఎస్‌.ఆర్‌.పృథ్వి, 9989223245

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img