Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

కన్నీటి చుక్కల్లో నెలవంక కైత ‘ఉషామహల్‌’

సన్నిధానం నరసింహశర్మ
సెల్‌: 9292055531

వైయక్తికం, కౌటుంబికం, సామాజికంఇవి మూడూ వేరువేరుగా కన్పడినా పరస్పర సంబంధితాలే! ఇవి కవిత్వ వస్తు సంబంధితాలైనప్పుడు విషాద, ఆనంద అనుభూతులు మానవత్వ స్పందన పరిమళాలతో సార్వజనీనాలవడానికి అవకాశం ఉంటుంది. అదిగో, అలా అంటే గుణార్హత కల కబ్బం ఉషామహల్‌. కవి ప్రముఖుడు సూర్యవంశి తన ప్రేమరాశి అయిన అర్ధాంగి హఠాన్మరణా నంతరం తన మౌన సమాధి స్థితిలో, పలికి వెలిగింపజేసిన సహజ రచనలు, ఈ స్మృతి కావ్య కవితలు, కవిత్వంలో శిల్పం లేదా ఇతర సంబంధితాలు తెలిసినప్పటికీ సంభాషణాశైలిలో తన బాధాతప్త భావాలను, అనుభూతులను వచ్చినవి వచ్చినట్లు వ్యక్తం చేశానని కవే చెప్పారు. ఒక సహజ సారళ్య వ్యక్తీకరణతో తన గుండె పగుళ్లను మాటలుగా మలచి కన్నీటి చుక్కల్లో నెలవంక కైతగా రూపొందించిన కవి సూర్యవంశి విషాద మధుర స్మృతులతో కట్టిన కవితా స్మారక నిర్మాణం, యీ ఉషామహల్‌. మంచి కవిత్వమంటే పరవశించే గ్రంథ నిర్మాణ శ్రామికులు, కవులు ఒమ్మి రమేష్‌బాబు, నామాడి శ్రీధర్‌ కవి ఈ పుస్తకం వేయడంలో వెన్నుదన్నయ్యారు. రమేష్‌ అనురాగ పరిమళం అని ముందు రాసిన హృదయ వాక్యాలలో కవి ‘ఈ గ్రంథంలో ప్రేమైక జీవన సుగంధాన్ని నిండుగా అద్దారు’ అన్నది అర్థవంత వాక్యం. గాఢమైన భావుకతతో, సాంద్రమైన కవితలు కవితా విమర్శక భావుకులు తలలూపే విధంగా కవి లోగడగుజరాత్‌పై దళితవాదంపై విప్లవ విరస భావజాలంతో, ఇతరేతర అంశాలపై ఎన్నో కవితలు రాశారు. ఈ ‘ఉషామహల్‌’ విలక్షణ రచన. కవి రాసుకున్న స్వగతంలో వచన వాక్యాలన్నీ కవితా స్పర్శతో రసజ్ఞ పాఠకులను కదిలిస్తాయి. ‘‘ఆమె కమ్మని నిద్రలోకి జారిపోయింది. మళ్లీ లేవనే లేదు. నవ్వు ముఖంతో మాకు వీడ్కోలు పలికింది. నేను నవ్వుతో ఉన్నానని, చావు నవ్వును ఓడిరచలేదని, చివరి గెలుపు నవ్వుదేననే భరోసా ఇచ్చింది. అందుకే కన్నీటి చుక్కలో నెలవంక ఈ ఉషామహల్‌. ఈ పరస్పర ప్రేమ చివరి వరకూ కొనసాగిన నిరంతర పరస్పర సకుటుంబ ప్రేమ నేపథ్యమే నా కవిత్వం, నా పుస్తకం, యీ ఉషామహల్‌ రూపంలో.’’ అన్నారు 121 పుటల్లోని 78 కవితల్లో తొలి కైత ‘ఆంతర్య సరోవరంలో హంస’, చివరి కైత ‘ఉషామహల్‌’ రెండూ కావ్య రసోదాత్త లక్షణాలను పొదిగించుకున్నాయి. భార్య పట్ల కవికి గల గాఢ నిగూఢ ప్రేమ తపస్పుందో అనుభూతి లోతుల్లోంచి వ్యక్తమయింది. తెలుగులో వచన కవితా ప్రక్రియలో వచ్చిన స్మృతి కావ్యాలలో ‘ఉషామహల్‌’ని నిలబెట్టే ఒక ప్రేమాద్వైత కవితలివి. దుఖాన్ని రహస్యంగా గుండెలో దాచుకుంటే ఆరోగ్య భంగం, బతుకు మరీ బరువైపోతుంది. సూర్యవంశి గూడు కట్టిన తన భార్యా వియోగ దుఖాన్ని బహిర్గతం చేసుకున్నారు, కవిత్వ రూపంలో. ధ్వని, వక్రోక్తి, రసం వంటివి లేకుండా సాంప్రదాయిక, ఆధునిక కవితలేవీ బతికి బట్టకట్టలేవు. పని కట్టుకుని అవి ఉండాలని ఏ కవీ రాయడం ఉండదు. సహజంగా కవికి తెలియకుండానే అవి వ్యక్తమవడంలోనే కవితలుగా పరిణమిస్తాయి. సూర్యవంశి కవిత్వంలోనూ అలాగే పరిమళిస్తాయని ఈ పొత్తంలోని కొన్ని ఖండికలు చెబుతాయి. పైన పేర్కొన్న రెండు ఖండికల్లో మరీనూ. ఆంతర్య సరోవరంలో హంసలో ‘‘నేను/ దేహంతో/ ఆమెను ప్రేమించా/ నేను మనసుతో/ ఆమెను ప్రేమించా/ నేను/ నాలో ఆమెను లీనం చేసుకున్నా/ ఆమె నా దైవం, ఆమె నా ధైర్యం’’ అంటారు. ‘‘ఆమెకు ఏమైందో ఏమో!/ ఆమెకు శాశ్వత విశ్రాంతి రోజు/ ఒక కమ్మని మహానిద్రలో/ మాకు నవ్వుతూ మౌనంగా/ వీడ్కోలు పలికింది.’ అంటారు. ‘‘ఆమె నిర్వాణం/ ఒక కాలాతీతమైన అనువాదం’’ అనడంలోని భావ వ్యక్తీకరణ లోతైనది. ‘‘ఇప్పుడు నా నీడ సైతం/ నాకు భారం/ ఆమె చివరి చూపును చూస్తూ / లోపల చిన్నపిల్లాడిలా/ కుమిలి రోదిస్తూ/ నా అమ్మను తలచుకున్నాను... కవి తన బాధను సాధారణీకం చేస్తూ ‘‘నిన్ను ప్రేమించే వాళ్లు/ నీవు ఎంత ఆపినా/ నీ కళ్లు గప్పి వెళ్లిపోతారు/ వెళ్లిపోయే ముందు/ వాళ్లపట్ల నీ దూరాన్ని ప్రేరేపిస్తారు/ అంటారు. దూరాన్ని ప్రేరేపిస్తారనడం అనుభవ పూర్వక వాక్య బంధనం. దాంపత్యాన్ని ‘‘చుట్టూరా వెంటాడే/ చీకటి భయాలు/ ప్రతి ప్రమాదాన్నీ అధిగమించే/ జంట ప్రమిదలు/ అదే దాంపత్యం’’ అంటూ నూతన నిర్వచనం ఇస్తారు. జంట ప్రమిదలన్న సూర్యవంశి ఇప్పుడు ఒక ప్రమిదగా మిగిలారు ఒక ప్రమిద వెళ్లి పోయాక. కవి దృష్టిలో ఆమె వెళ్లిపోలేదు. అందుకే ‘‘తను ఉన్నప్పుడు/ లేనప్పుడు/ నేను ఒంటరినికాను/ తను నాలోనే ఉంది/ అని మానసికంగా తమాయించు కుంటారు. ఈ ఖండికలో భార్యాభర్తల రెండు జీవితాల ప్రేమ వికసనాలు, పరిమళాలు, జీవన సుందర సంయుక్త దృశ్యాలు, ప్రాకృతిక తాదాత్మ్య విశేషాలు, జీవన నిత్య నైజాలుఇన్ని నిబిడీకృతమై ప్రాకృతిక కృతిలా విశదమౌతుంది. ‘ఆంతర్య సరోవరంలో హంస’ అనడమే ఒక ఉన్నతానుభవ అనుభూతి వ్యక్తీకరణ. రాణిలా బతికి, మహారాణిలా వెళ్లిపోయిన ఉషారాణికి కట్టిన ఉషామహల్‌ గ్రంథ శీర్షికానామ కవిత కవి కన్నీటి చుక్కల్ని సానుభూతి గల మన కళ్లల్లో ప్రతిబింబాల్ని చేశాయి. ‘‘జార విడుచుకున్న/ నా పంచ ప్రాణాలను/ వణుకుతున్న చేతులతో/ నేల తల్లి ఒడిలో/ నింపాదిగా పడుకోపెట్టాను/ నాలుగు దశాబ్దాలు కాదు/ యుగయుగాల ప్రేమ/ మధ్యంతరంగా/ ఇలా ముగిసింది.’’ అంటూ ‘‘ఎండ వచ్చినప్పుడు ఆమెపై చెట్టు నీడలు వాలి/ కదలి కదలాడుతుంటే/ మా వారసులు ఆమెతో ఆడుతున్నట్లు’ ఉందంటారు. గొప్ప భావంతో తారాస్థాయిని చేరిన కైత ప్రేమ ఖండిక. ‘‘చీకట్లో తారల్లా/ మౌనంగా పలుకుతాయి/… తెలిసీ తెలియనట్లు/ తాకీ తాకనట్లు ఎప్పటికీ అవ్యక్తం/ ఒక అద్భుత సుగంధం ప్రేమ…’’ ఆ పరిమళం ఎలా ఆవహిస్తుందో/ ప్రేమించే వాళ్లకే తెలీదు.’’ ఇది ఆంతరంగిక శోధనా ఫల వాక్యం.
‘‘ప్రేమలో దాస్యమే యాజమాన్యం’’` ఇది మొత్తం మీద ప్రేమకు నిర్వచించలేని ఒక అమూల్య స్ఫాటిక ఉత్పత్యర్థం. ‘‘ప్రేమ దూరాలను పూడ్చే (క్షితిజం ఒక అభాసం) అతిక్రమణ కాదు. అంటూ ‘‘ఎత్తిన వెయ్యి కత్తులకు ప్రేమ లొంగుతుందా/ ఒక తడిచాలు/ ప్రాణం ఇచ్చేస్తుంది… ‘‘ప్రేమకు సమాధి/ అతి మానవ ఉన్మాదం అనడం రెండు వాక్యాల…రెండు ఖండ వాక్యాల అఖండ సారాంశ సారాంశం.
కవిత్వ ఉచ్ఛ్వాసనిశ్వాసాల నాసిక నుండి బయలుదేరిన గోదారి రాజమహేంద్రవరం వద్ద విశాల భూమికతో సాక్షాత్కరించింది. మహారాష్ట్ర నుండి వచ్చిన కవి సూర్యవంశి పశ్చిమగోదావరి జిల్లా ఉషారాణిని ప్రేమించి పెళ్లి చేసుకుని పశ్చిమగోదావరి జిల్లాకు అల్లుడయ్యారు. ‘మార్పుల్ని కోరె’ తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో తెలుగు కవిగా ప్రఖ్యాతి చెందారు. గోదాని నీళ్లు ఎన్ని తాగినా ఆయన కవిత్వ దాహం అక్షయమైంది. భాగంగా కవితాక్షరమైంది. సూర్యవంశి తన భార్యకు కవితాక్షరాలతో కట్టిన ప్రేమాత్మ కథ ఉషామహల్‌. ఇది ఈ మధ్యనే వచ్చిన కావ్యం.
ఒక వైయక్తిక నష్టాన్ని, ఒక కౌటుంబిక విషాదాన్ని కన్నీటి భావమణుల మందిరంగా మలచిన నిర్మాతకు సహానుభూతులు పలకడం కన్నా ఏం చేయగలం?
భార్యయుండిన వనమైన పట్టణంబు/పత్ని లేకున్న గృహమైన బహుళగాహన/మగుచు గాన్పించు’’ నన్నాడు 17 వ శతాబ్దికి చెందిన పాలవేకరి కదరీపతి నాయకుడనే కవి తన శుక సప్తతి గ్రంథంలో. అంటే భార్య ఉంటే అరణ్యం కూడా పట్టణంలా ఉంటుంది. భార్య లేకపోతే ఇల్లు కూడా పెద్ద అరణ్యంలా ఉంటుందని భావం. సూర్యవంశి స్మృతుల్లో ఆమె జీవించే ఉందనే ఒక ఓదార్పు వాక్యం ఆయన్ని స్వాంతనపరచుగాక.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img