Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

సంభాషణా చౌర్యం

ఎస్‌.ఆర్‌.పృథ్వి
సెల్‌: 9989223245

మనిషిప్పుడు నూతన మార్గాలలో
పదద్వయాహంకారాన్ని హక్కులా
హుందాగా ప్రదర్శిస్తా ఉన్నాడు
మెదడులో జనించిన కుయుక్తులను
అత్యాధునిక టెక్నాలజీకి జతచేసి
మానవ హక్కుల పుష్ప మాధుర్యం మీద
విషపు చుక్కల్ని పిచికారీ చేస్తా ఉన్నాడు
ఇద్దరి నడుమ ఫోను సంభాషణలు
గుప్త కావ్యంగా నిలవాలి కదా!
వాణిజ్యవేత్తలు, భార్యాభర్తలు,
సామాజికవేత్తలు, పత్రికాధిపతులు
రాజకీయవేత్తలు, ఇలా
వాళ్లైవరైనా కావచ్చు
ఇప్పుడు, నాయక శ్రేణులకు
సంభాషణా చౌర్యం వేడుకైంది
రాజకీయ రంగంలో ప్రవేశించిన స్వార్థం
వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తా ఉంది
యంత్రాల నుపయోగించే
మంత్రగాళ్లకి జీవం పోస్తా ఉంది
దేశ రక్షణ కోసం నిఘా వర్గం
అనుమానితుల మీద ప్రయోగించే అస్త్రమిది
ఇప్పుడు స్వార్థపరులు
జన జీవితాలను టార్గెట్‌ చేయటం
దౌర్భాగ్యం కళ్లు తెరుచుకున్నట్లయింది

ప్రజాస్వామ్యమంటే మనిషికి నమ్మకం
నమ్మకమిప్పుడు నడి రోడ్డున పడి
వివస్త్రయి వికల్పజాలంలో చిక్కుకుంది
కాల వాహినిలోని కర్మ వీరులు తరిగి
వికర్ముల జాడలు పెరిగిపోతున్నాయి

సెల్‌ఫోన్ల సౌందర్యంలో
ప్రపంచమే ఒదిగి పోయిందన్న
ఆనంద వృక్ష కొమ్మలు నరికి
వ్యక్తుల ఆంతరంగిక సంభాషణా చౌర్యం
పెను తుఫానుగా మారి
ప్రజాస్వామ్యపు హక్కుల తీరాన్ని
ముంచేయటం దురదృష్టం
రాజకీయ కుటిల దౌర్జన్యాలకి
విలువల పతనం ఆరంభమైంది
ప్రజల శిరస్సులపై
మణి మకుటాలకు బదులు
ముళ్ల కిరీటాలు నిలిచాయి
ఫోను టాపింగనేది
శ్వేత వస్త్రం మీద పడ్డ
నల్లని కళంకపు మరక
అడ్డుకోకపోతే, అంధకారం
అనకొండై నోరు తెరుస్తుంది
అమానుషాన్ని అడ్డుకోవటానికి
ప్రతి పౌరుడు ఏకమై
ప్రశ్నల వర్షం కురిపించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img