Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

విద్యార్ధులందించిన పూలగోపురం

అసలేంటీ ఈ పూలగోపురం కథ? అది ఎవ్వరు నిర్మించారు, ఎవ్వరికోసం నిర్మించారు. అసలు ఎందుకు నిర్మించారు. నిర్మించాలనే ఆలోచన ఎవ్వరిది. వీటికి సమాధానం పుస్తకంలో కొలువుతీరిన పదిహేడు కథలే నిదర్శనంగా మన ముందు నిలిచి ఆహ్వానం పలుకుతున్నాయి.
బాల మేధావులు మస్తిష్కంలో పురుడు పోసుకున్న మానవతా విలువల సుమ పరిమళం ఈ పూల గోపురంలో ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియల్లో తన ప్రతిభను చాటుకున్న పోతగాని సత్యనారాయణ పర్యవేక్షణలో, బాలకవులు తమ మస్తిష్కంను మధించి నేటి సమాజంలోని సమస్యలను వివరిస్తూ, వారి కోణంలో వాటిని ఎలా అర్ధం చేసుకుంటే పరిష్కారం లభిస్తుందో, తమదైనశైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రచించినదే ఈ పూల గోపురం కథల సంకలనం. గొప్పగొప్ప కవులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది వారి ఆలోచనా విధానానికి సమాజం పట్ల వారికిగల బాధ్యతలను తెలియజేస్తుంది.
ఇక కథలు విషయానికీ వొస్తే, పిట్టలశాపంతో ప్రారంభిస్తాను. ఊరు లోపల ఏపుగా పెరిగిన చెట్ల మీద నివాసం ఉంటున్న పక్షుల కథ. మనిషి కార్పొరేట్‌ మాయాజాలంతో తన అవసరాలకు చెట్టు నరికేస్తూ, చిరు ప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తుంటే, తమ మనుగడ కోసం ఎంతో ప్రయాసలతో సూదూర ప్రాంతాలు వలసపోతూ, దాహం తీర్చుకునేందుకు నీళ్ళు దొరక్క నివాసం ఉండేందుకు చెట్లు లేక, చివరకు ప్రాణాలు వదిలేస్తాయి. ఇది ఒక్క పక్షుల సమస్య మాత్రమే కాదు. ప్రతి ప్రాణి సమస్య. భవిష్యత్తు మనిషి పరిస్థితిని ప్రశ్నార్థకంగా మారుస్తుంది అనే విషయం గుర్తు చేస్తూ. వృక్ష సంపద అవసరాలను, చిరు ప్రాణుల ప్రాణాలు నిలపవలసిన బాధ్యతను గుర్తుచేశారు బాల కవి.
ఇక…వలపోత. ఇది ఆత్మాభిమానం కలిగి స్నేహాన్ని అవసరాలకోసం వాడుకోరాదనే ఓ రైతు కథ. ఇందులో రైతు ఎదుర్కొంటున్న సమస్యల్ని, అతివృష్టి, అనావృష్టితోపాటు దళారి దోపిడి. దిగుబడిరాని పంటల వలన రైతుపడే మానసిక ఒత్తిడిని ప్రతిబింబించే విధంగా రాసింది. రైతే వెన్నుముక అనే మనం. ఆ రైతుకు వెన్నుదన్నుగా ఉండలేక పోతున్నామనే మన విధానంను మరోసారి ప్రశ్నిస్తూ, సమస్య తరువాత పరిష్కారాల కోసం కాదు, ఆలోచించవలసింది. సమస్యకు సమూల పరిష్కారం కనుగొనడం ముఖ్యం. అనే విషయంను హృదయాలకు హత్తుకునేలా ఉంది ఈ కథ.
మరోకథ చదువు విలువ…ఇది నేటి యువత కథ. తల్లిదండ్రుల ప్రేమను గుర్తెరగక, చదువును వదిలేసి బలాదూర్‌ తిరిగే ఎందరో ఈ కథలోని పాత్రధారులే. సక్రమంగా బడికి వెళ్ళని తన కుమారుడు, ఆ కుమారుడి కోసం తల్లిదండ్రులు చిందిస్తున్న స్వేదం కనిపిస్తుంది కథలో. చదువుపై ఆసక్తి లేని కుర్రవాడు చదువు మానేసి తిరుగుతూ, అనుకోకుండా ఒకరోజు తల్లిదండ్రులు ఎండలో తనకోసం తన చదువు కోసం శ్రమించడం చూసి తనలో మార్పు తెచ్చుకోవడం ఈ కథ. తాను నీడలో కూర్చుని చదువుకోవడానికి, తల్లిదండ్రులు ఎంతగా శ్రమిస్తున్నారో తెలుసుకుని, వారి శ్రమకు తన చదువే సరి అయిన పరిష్కారం. అదే తను తల్లిదండ్రులకు ఇవ్వగలిగే గౌరవం అనుకునే ఓ విద్యార్థి కథ. ఎందరికో ఇది కనువిప్పు కలిగించే కథ అనడంలో సందేహం లేదు.
చెలిమితెలిపిన చరవాణి…కథ మొబైల్‌ మాయాజాలం పసి హృదయాలను కూడా కలుషితంచేస్తుందని వాటి వాడకంవలన మానవ సంబంధాలు దూరమౌతున్నాయనే విషయాన్ని చిన్నారుల పాత్రల ద్వారా చక్కగా వివరించడం జరిగింది. ఇద్దరు చిన్నారుల మధ్య మొబైల్‌ అంతరాలను పెంచుతుంది. మొబైల్‌ వ్యామోహంతో ప్రెండ్స్‌తో కనీసం ఆడుకోలేనంతగా! సమయంలేదు అనేలా మారిపోయాడు ఒక కుర్రవాడు. అదితెలిసి బామ్మమొబైల్‌ దాస్తుంది. మొబైల్‌ లేని కారణంతో తిరిగి తన ప్రెండ్స్‌ను కలిసి తన తప్పును ఒప్పుకుని వారిలో కలిసి పోతాడు. తను కోల్పోయిన సంతోషాలు, స్నేహపు విలువలు తెలుసుకుంటాడు. మొబైల్‌ బంధాలు నిలపడం కాదు విడగొడుతుందనే విషయాన్ని ఇందులోదాగిన సందేశం. నేటి మన జీవన విధానంకు ఈ కథ దర్పణం.
పోడుభూమి గోడు…కథ ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించిన కథ.మరోకథ తాగుడు వ్యసనం…అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో మద్యపానం ఎంతటి వివాదాలు నింపిందో తెలిపిన కథ.తాగుడుకు బానిసగా మారి ఆరోగ్యం దెబ్బతినడంతో, చివరకు ప్రాణాలను కోల్పోయిన ఓ మధ్య తరగతి కుటుంబ పెద్ద కథ ఇది. అది గ్రహించి, తల్లి మనసును అర్థం చేసుకుని ఉన్నత విద్యలు చదువుకుని మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలను అందరికి వివరిస్తూ, మనుషుల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసే విద్యార్థుల కథ.
చిన్నారుల ప్రతిభకు నా పుస్తక పరిచయం గీటు రాయి కాదు. వారి ప్రతిభ అసామాన్యం. అనంతం అనవచ్చు. ఇప్పుడిప్పుడే సాహిత్య వనంలో వికసిస్తున్న శ్వేత వర్ణ మనసున్న చిన్నారి కవులు వీరు. అందరికి పుస్తకం చదివే అవకాశం కలగకపోవచ్చు.నేను రాసిన నాలుగు మాటలు చదివి నిండు మనసుతో బాల కవులను వారికి దిశానిర్ధేశం చేసిన అన్న పోతగాని సత్యనారాయణని, పుస్తక ముద్రణకు సహృదయంతో ముందుకు వచ్చిన శ్రీ వేణిరెడ్డి వెంకట రెడ్డి కుటుంబం సభ్యులను మనసు పూర్తిగా అభినందించాలి.
రాము కోలా, 9849001201

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img