Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అందరి చెలికాడు జూలూరు

పెనుగొండ లక్ష్మీనారాయణ
9440248778

‘వాక్యం రసాత్మకం…’ అనే మాట వినీ వినీ విసుగెత్తిపోయాం. ఆ వాక్యాలనే కొత్తగా చెప్పటం ఒక నూతన అన్వేషణ, ఆవిష్కరణ. వాక్యం రసాత్మకం కాదు. వాక్యం విముక్తి సూత్రం అని యిప్పుడు గౌరీశంకర్‌ సూత్రీకరిస్తున్నాడు. ఇలా ఎన్నెన్నో కొత్త సంగతులను సమకూర్చుకున్న కావ్యం ‘జూలూరు పథం’. తెలుగులో కొన్ని దీర్ఘ కావ్యాలను చెపితే కొందరు కవులు, కొందరు కవులను గుర్తుకు తెచ్చుకుంటే కొన్ని దీర్ఘ కావ్యాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ‘జూలూరు పథం’ లో ఆ జాబితాలో చేరినవాడు గౌరీశంకర్‌. ‘ఇదొక ఆత్మ కథనాత్మక కవిత’. ‘ఆత్మ నాది కథ తెలంగాణది’ అని మొదట్లోనే చెప్పుకున్నారు. ఈ వాక్యాలలో ఈ కావ్యం ఎలా ఉంటుందో పాఠకుడికి ప్రాథమిక అవగాహన కలుగుతుంది.
ఇందులో ‘నేను నడిచిన దారుల ఎగుడు దిగుడ్లున్నాయి. నా కన్నీళ్లు, కేరింతలు, నా పోరాటాలు, నా గాయాలున్నాయి.’ నేను చూడదగిన వాటినన్నింటినీ రాసుకుంటూ పోయాను. నేను చూసిందే రాశాను. నేను నమ్ముకున్నదాన్నే రాశాను. నా చూపులో నమ్మిక నిర్మించిన దారిమీద నా నడక గురించే రాశాను’ ఇలా తన పథం గురించి గౌరీశంకర్‌ స్పష్టమైన ప్రకటన చేశాడు. నిజానికి ఇది గౌరీశంకర్‌ ఆత్మకథ మాత్రమే కాదు` తన జీవితంలో భాగమైన అనేకానేక విషయాలను ఒక మాలగా అల్లాడు. అదీ అతి నేర్పుగా. తనకూ తన తెలంగాణాకు చెందిన అనేకానేక విషయాలను, దశలను దృశ్యీకరించాడు.‘నా గుక్కపట్టే ప్రవాహ వేగానికి ఈ దీర్ఘ కవిత గుర్తుగా నిలుస్తుంది. నా అక్షర రంగస్థల విశాల వేదిక దీర్ఘకవిత’ అనటంలో నిజమూ, నిజాయితీ రెండూ ఉన్నాయి. సాహిత్య సృజన సమాజానికి అవసరమైనదైతే సాహిత్య చరిత్ర సాహిత్యానికి అవసరం. ఈ రెండు పనులనూ నిర్మాణాత్మకంగా సాధించాడు గౌరీశంకర్‌.
ఈ పుస్తకానికి అవసరమైన, ఈ పుస్తకాన్ని మనకు మరింత చేరువచేసే ముందు మాటను గౌరీశంకర్‌ను బాగా అర్థం చేసుకున్న అతనికి అత్యంత సన్నిహితుడైన సీతారాం ‘వొడవని ముచ్చట’ లో అందించాడు. నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా వివేచన చేస్తే తెలుగు అస్తిత్వ కవిత్వం తిరిగిన ప్రతి మలుపులో గౌరీశంకర్‌ చేతితో ఒక టార్చ్‌ పట్టుకుని దారి దీపమై నిలిచాడు. చారిత్రక గమనాన్ని వేగవంతం చేశాడు. నడిగూడెం నట్టనడుమ పసుపు కుంకుమలతో నిండి కనిపించే బొడ్రాయిలా గౌరీశంకర్‌ తెలుగు కవిత్వం నట్టనడుమ నిలబడిపోయాడు. తెలుగు సాహిత్యంలో నాలుగున్నర దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి చేస్తున్న గౌరీశంకర్‌ స్థానాన్ని ఈ ముచ్చటైన మాటల ద్వారా సీతారాం నిర్ణయం చేశాడు.
మరో మంచికవి ప్రసేన్‌ ‘ఇతన్ని నిప్పుకు దూరంగా ఉంచండి. విస్ఫోటిస్తాడు. ఇతడ్ని నీటితో ఆర్పాలని చూడకండి. బడబాగ్నిలా మారతాడు. ఇతడ్ని అడవిలో బంధించకండి. దావానల మవుతాడు’ అని గౌరీశంకర్‌ సాహిత్య వ్యక్తిత్వాన్ని, సాహిత్య తత్త్వాన్నీ కవిత్వీకరించాడు. గౌరీశంకరే తెలుగు సాహిత్యంలో ఎన్నో పూలు పూయించాడు. పరిమళాలు పంచాడు. చేదు నిజాలూ చెప్పాడు. అతనిది చెరిగిపోని ‘పాదముద్ర’ అతను బహుజన సాహితీవేత్త అయినా అందరికీ చెలికాడు, చేరువైనవాడు. మంచిని గుర్తించే ప్రశంసించగలిగే వ్యక్తిత్వం అతనిది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలమెత్తారు, గళమెత్తారు. ఒక సాంస్కృతిక రథసారథిగా తన బాధ్యతను పవిత్రంగా నిర్వర్తించాడు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించిన, సంఫీుభావం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ నమస్కరించాడు. ‘పెనుగొండ లక్ష్మీనారాయణ ముందుకొచ్చి నిలబడ్డాడు’ అని అరసం పాత్రనూ, కృషినీ గుర్తించాడు, గౌరవించాడు.
పుస్తకావిష్కరణ
సీపీఐ నారాయణ సీమాంధ్రలో తొడగొట్టి మరీ/ జై తెలంగాణ అన్నాడు/ అక్కడోళ్లతో తిట్లు తిన్నాడు/ ఆంధ్రలో ఎర్రజెండా బెట్టి జై కొట్టినాడు/ తెలంగాణలో పోరు యాత్రయ్యాడు’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మీద ఎంతో అభిమానాన్ని ప్రకటించాడు. 34 వ విజయవాడ పుస్తక మహోత్సవంలో 31 డిసెంబర్‌ 2023 ఆదివారం సాయంత్రం ఈ పుస్తకాన్ని నారాయణ చేత ఆవిష్కృతం గావించి వారి పట్ల ప్రేమను వ్యక్తపరిచాడు గౌరీశంకర్‌.
ఈ కార్యక్రమానికి అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ పుస్తక మహోత్సవంలో కవి గౌరీశంకర్‌తో నారాయణ ముఖాముఖిని ఏర్పాటు చేశారు. ఇన్నేళ్ల పుస్తక మహోత్సవంలో ఇలాంటిది ఏర్పాటు చేయటం యిదే మొదటిసారి నాకు తెలిసినంతవరకు. నారాయణ, గౌరీశంకర్‌ వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయులు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సహచరులు ఒకరు ఉద్యమ సాహితీవేత్తగా, ఒకరైతే ప్రజా క్షేత్రంలో రాజకీయ ప్రముఖులు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో నారాయణ మౌలిక అంశాలపై ప్రశ్నలు వేస్తే గౌరీశంకర్‌ మూలాల్లోకి వెళ్లి సమాధానాలు యివ్వటం ఆసక్తిని కలిగించింది.
ముఖాముఖి
సాహిత్యానికి సమాజమే స్ఫూర్తి ప్రదాత అని సమాజానికీ, సాహిత్యానికీ నిరంతరమూ సంబంధాలుంటాయి. సాహిత్యం, రాజకీయం పరస్పరా శ్రితాలు, ప్రేరితాలు. సాహిత్యానికీ, రాజకీయాలకూ ఉండే సంబంధాలు సామాజిక చైతన్యానికి దోహదపడతాయి. సాహిత్యం సామాజిక పోరాటాలకు స్ఫూర్తినిస్తుంది. సామాజిక పోరాటాల నుంచి స్ఫూర్తి పొందుతుంది. సమాజంలో మార్పు రావటానికి సాహిత్యం, కళలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ రెండూ సమాజం చేతిలో ఆయుధాలు. కళ కళ కోసమనే వాదన శుష్క ప్రాయమైంది. అది ఏనాడో నిర్వీర్యమైంది. అయినా పునరుద్ధరణవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ సాహిత్యంలో గోర్కీ నుంచి మన శ్రీశ్రీ దాకా ఇంకా ఈ తరం సాహితీవేత్తలు తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. చేస్తున్నారు.
‘బండెనక బండి కట్టి…’ గీతం వంటివెన్నో తెలంగాణా సాయుధ పోరాటానికి ఆనాడు స్ఫూర్తినిచ్చాయి. ఏనాడో పోతులూరి వీరబ్రహ్మం పలికిన ‘దూంధాం’ పదం ఇటీవలి తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రధాన కళా సాధనమైంది. ప్రపంచంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలలో తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ సాహిత్యం, కళలు పోషించిన పాత్ర చరిత్రాత్మకమైంది. చిరస్మరణీయమైంది. తెలంగాణాలో బహుజన పాలన, దళిత పాలన రావాల్సి ఉంది. తెలంగాణా అభివృద్ధి కోసం కలం, గళం సమైక్యమై శక్తిని మరింతగా సాగించినప్పుడే ఇవి సాధ్యం.
తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వారికి నివాళులర్పించారు. విశ్వనాథ తిరోగమనవాది అని స్పష్టం చేశారు. అయినా వారి ప్రత్యేకత వారిదే అన్నారు. సమాజంలో నీచాభిరుచులను ప్రేరేపించే ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా చూస్తున్నారు. నాగార్జున మటుకు చప్పట్లు కొడుతున్నారు. అక్కడ జరిగే ఘటనలకు సంతోషిస్తున్నారు. ఈ దుస్థితిని యావత్తు సమాజం ప్రశ్నించుకోవాల్సిన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. అటువంటి అభ్యంతరకరమైన కార్యక్రమాలు తిరస్కరించే, తిప్పికొట్టే చైతన్యాన్ని సమాజంలో కలిగించాల్సిన బాధ్యత మనది. అంటే ప్రగతిశీల శక్తులది. ఈ కార్యక్రమంలో పుస్తక మహోత్సవం అధ్యక్షులు టి.మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img