Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

జన హృదయ కూడళ్ళలోకి ‘కవియాత్ర’

‘నాలుగుగోడల మధ్య కాదు- నాలుగు కూడళ్ళ మధ్యకి కవిత్వం తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఏర్పడినదే ఈ కవియాత్ర’. వృత్తిరీత్యా నిర్మల్‌కు చెందిన ఓ సాధారణ పోలీసు ఉద్యోగి, ప్రవృత్తిరీత్యా కవి అయిన కారం శంకర్‌ స్థాపించినదే ఈ ‘కవియాత్ర’. మొట్టమొదటగా 24 మార్చి 2019 సంవత్సరంలో నిర్మల్‌ నుండి ప్రారంభించబడిరది ఈ ‘కవియాత్ర’. 2వ విడత నిర్మల్‌నుండి ఆసిఫాబాద్‌కవరకు, 3వ ఆసిఫాబాద్‌ నుండి చెన్నూరు వరకు, 4వ విడత నిర్మల్‌ నుండి నిజామాబాద్‌ వరకు, 5వ విడత హైదరాబాద్‌ తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి గోల్కొండ వరకు జరుగగా, ఇప్పుడు ఆరవ విడతగా కోదాడ నుండి నడిగూడెం రాజాగారి బంగ్లా వరకు సాగింది. ప్రజల హృదయాల చెంతకు చేరింది ‘కవియాత్ర’.
6వ కవియాత్ర సాగిందిలా: ఆ రోజు 2024 ఫిబ్రవరి 11 ఆదివారం ఉదయం 10.30 గంటలు. కోదాడ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్‌హైస్కూల్‌ ఆడిటోరియం ముందు, దేశంలో అనేక ముఖ్య పట్టణాల నుండి కవుల రాకతో కోలాహలంగా ఉందా ప్రాంతం. తేజ విద్యాలయ వారి మినీ బస్‌ యాత్రకు సిద్ధంగా ఉంది. నిర్వాహకులు కారం శంకర్‌ నిర్మల్‌ నుండి విచ్చేయగా, స్థానిక కోదాడ రచయితల సంఘం, సిరివేరు సాహితీ పీఠం తదితర సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ బస్‌ యాత్రను ఆంధ్రప్రదేశ్‌ జానపద కళల పూర్వ చైర్మన్‌ పొట్లూరి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. రమ్యభారతి సంపాదకులు, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌ మరో అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభంలో స్థానిక విద్యార్థినులతోపాటు పదుల సంఖ్యలో కవులు పాల్గొన్నప్పటికీ తర్వాతర్వాత అది 50మంది కవుల సంఖ్య వరకు చేరి కవియాత్ర విజయవంతంగా సాగింది.
మొదట- తెలంగాణలోని కోదాడ నుండి ప్రారంభమైన ఈ కవియాత్ర వినూత్నరీతిలో… మొదట్లో కోదాడ నగరానికి చివర్లో ఉన్న తేజ విద్యాలయ ప్రాంగణానికి చేరుకుంది. సువిశాల ఆ ప్రాంగణంలో ఉన్న హాస్టల్‌తోకూడిన విద్యాలయం ముందు తేజా విద్యాలయ విద్యార్థినులు కవులను కరతాళధ్వనులతో ఆహ్వానించారు. విద్యాలయ హాలు వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో నిండి కవుల రాకతో హోరున ఆనందం వ్యక్తం చేయడం కవులకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. విద్యార్థులు, అతిథుల సమక్షంలో ఆ ప్రాంగణంలోనే సభ ప్రారంభించబడి మొదటి విడతగా కొందరుకవులు తమ కవితాగానం చేసి పిల్లల్ని ఉత్తేజపరిచారు. తెలుగు భాష పట్ల మమకారం పెంచే విధంగా కవులు కవితలు చదవగా, అతిథులు తమ ప్రసంగాలు సాహిత్య ఉద్దేశాన్ని పెంపొందించే దిశగా చేసి అక్కడ విద్యార్థులకు స్ఫూర్తిని కలగజేసారు.
నాగార్జునసాగర్‌కు చెందిన కవి సరికొండ నరసింహరాజు రచనని ఆ సభలో ఆవిష్కరించి పరిచయం చేసారు. తేజ పాఠశాల నిర్వహకులు కవులను సత్కరించడంతో పాటు తేనీరుఅందించి కవులలో కొత్త శక్తిని కలగజేసారు. కవులతో గ్రూప్‌ ఫోటో తీయించుకున్నారు. ఈ పాఠశాలకు వెళ్లడంవల్ల కవులు తెలుసుకోతగిన ప్రత్యేకత ఏమిటంటే…పాఠశాల ఆవరణ ప్రారంభంలోని రెండువైపులా వున్న 7 ఆకుల చెట్లు పెంచడం ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయి. ‘ఏడుఆకుల చెట్టు’ అని నామఫలకం పెట్టడంవల్ల చూపరులను అవి ఆకర్షింప చేసి ప్రత్యేకంగా వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలి గించింది. ఇంతకీ ఈ ఏడుఆకుల చెట్టు ప్రత్యేకత ఏమిటంటే- ప్రతి రెమ్మకి 7ఆకులు మాత్రమే ఉండడం విచిత్రంగా తోస్తుంది. అలాగే పాఠశాల ఆవరణలోకి వస్తే వివిధ సందర్భాలలో ఆ పాఠశాలలో విద్యార్థులు సాధించిన విజయాలకు సంబంధించిన నగదు, సర్టిఫికెట్లు, షీల్డ్స్‌, వారి ప్రముఖులతో తీయించుకున్న ఛాయాచిత్రాలతో ఆ పట్టణ విద్యార్థుల ఘనతని చాటింది, మరింతమందికి స్ఫూర్తిని కలిగించేరీతిలో ఉత్తేజ పరుస్తుంది. విద్య గొప్పతనాన్ని చాటేవిధంగా అంత ర్జాతీయ ప్రముఖుల కొటేషన్లతోను…చూపరులను ఆ విద్యాలయ గోడలు ఇట్టే కట్టిపడవేయగా, కాలికి వేసుకున్న బూట్లు వరుస క్రమంలో పెట్టడంలో అక్కడ విద్యార్థులు చూపిన డిసిప్లెన్‌ చూసి నేర్చుకోతగ్గ విషయాలు, పాటించ తగ్గ ఘట్టాలు ఇక్కడ కవియాత్ర వల్ల గ్రహించడం ఓ ప్రయోజనం. ఇక అక్కడ నుండి వీడ్కోలు పలికితే –
రెండవ- కవియాత్ర మరికొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న మునగాల మండలం, ఆకుపాములగ్రామం ప్రధాన కూడలిలో జరిగింది. దాదాపు మరో పదిమందికవులు చదివిన కవితలు అక్కడ గ్రామప్రజలు సావదానంగా, ఆసక్తిగా వినడం కనిపించింది. ఆటోలు, బైకుల మీద పోతున్న సాధారణ ప్రజలు తొంగితొంగి మరీచూడడం, కూడళ్ళలో నిల్చున్నవాళ్లు అబ్బురంగా వినడం, కవులు వస్తున్నారన్న సమాచారంతో కొంతమంది అప్పటికే వచ్చి ఉన్న కొంతమంది గ్రామస్తులు పోగవడంతో…కవులు కవితలు చదవడంలో మరింత ఆసక్తి చూపారు.
ఇదే స్ఫూర్తితో – 3వ కూడలి- జాతీయ రహదారి అయిన ప్రాంతం ‘బరాఖతా గూడెం’లో జరిగింది కవియాత్ర. మరో పదిహేనుమంది కవులు ‘ప్రేమ-శాంతి-జ్ఞానం’ అనే అంశాలపై తమ కవితాగానం చేసారు. అది రహదారి కూడలి కనుక చాలామంది అక్కడి ప్రజలు, తోపుడు బళ్ల వాళ్ళు విచిత్రంగా చూసారు. ఆ చుట్టుపక్కల షాపుల వాళ్ళు ఆసక్తిగా చూసినప్పటికీ చివర్లో తమ షాపుముందు బస్సు నిలిపి కవితలు చదవడం వల్ల, ఆ షాపువారు తమ బేరాలకు దెబ్బ అని తలచి తీసివెయ్యమని అనడం కాసింత బాధకలిగించే అంశమే అయినా ‘మంచితోపాటు ఇటువంటి చేదు అనుభవాలు’ కూడా నిర్వహకులకు కలుగుతాయని తెలపాలనే ఉద్ధేశమే ఇది ఓ ఉదాహరణ.
4వ కూడలి మరో మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కృష్ణానగర్‌’లో సాగింది కవి యాత్ర. నివాస ప్రాంతంలో ఇక్కడ కవితాగానం జరిగింది. మిట్ట మధ్యాహ్నం అవ్వడం వలన, జనసాంద్రత తక్కువగా ఉండడంవల్ల, ఆ ఇళ్ళల్లో ఉన్న స్థానికులే ఈ కవితాగానాన్ని కొంతమేరకు విన్నారు.
చిట్టచివరగా 5వ ప్రాంతం-నడిగూడెంలోని ఢాక్రా రాజావారికోటలో కవితాగానం జరిగింది. మధ్యాహ్నం మంచి విందు ఏర్పాటుచేసారు నిర్వాహకులు. అనంతరం జరిగిన సభలో అతిధుల చేతులమీదుగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కవులను శాలువా, పుస్తకం, పెన్ను, సర్టిఫికెట్లతో సత్కరించారు. కొన్ని పుస్తకావిష్కరణలు జరిగాయి. అనుభూతులను చిరకాలం గుర్తుంచుకునేలా కవులతో గ్రూప్‌ ఫోటో తీసారు. వేడివేడి తేనీరుతో కవుల హృదయాలను వెచ్చపరచగా, అనంతరం రాజావారి కోటలోని పూర్వకాలం నాటి తలుపుల నగిషీ నాణ్యత, కట్టడాలశైలి, పురాతనకాలంనాటి గిలకబావి వంటి ప్రత్యేకతలని తిలకించారు. తోటికవులతో ఆనందంపంచుకుంటూ.. అపురూప ఛాయాచిత్రాలతో బంధించి రాజాగారి కోట విశేషాల ప్రత్యేకతలను సందర్శించారు. తెలుగురాష్ట్రాలైన ఆ మూల విజయనగరం నుండి విజయవాడ వరకు…ఇటు నిర్మల్‌ నుండి హైదరాబాద్‌, సూర్యాపేట కోదాడ వరకు వివిధ ప్రాంతాలనుండి కవులు ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం, దానికి స్థానిక సంస్థల నిర్వాహకులు సిలివేరు సాహితీ సేవాసంస్థ అధ్యక్షులు లింగమూర్తి, డాక్రి సంస్థ అధ్యక్షులు కుర్ర జితేంద్రబాబు, కోదాడ రచయితలసంఘం అధ్యక్షులు పుప్పాల కృష్ణమూర్తి, కోశాధికారి శ్రీనివాసరావులతోపాటు, తేజ విద్యాలయ.. మరికొందరి సహకారం మరువలేనిది. సాహిత్యానికి, ముఖ్యంగా కవిత్వానికి పట్టంగట్టే విధంగా జరుగుతున్న ఈ కృషికి లభించిన అభినందన బహుమతిగా ఈ ‘కవియాత్ర’ని అభివర్ణించాలి. అందుకు నిర్వాహకులు ఎంతైన అభినందనీయులు, మరికొందరికి స్ఫూర్తిదాయకులు కూడా.
చలపాక ప్రకాష్‌, 9247475975

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img