Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘కవితా వ్యాసంగం సాయంత్రం షికారు వంటిది’

చందు సుబ్బారావు

అలా అన్నది కవితా శిల్ప సిద్ధాంతకర్త, ఆంగ్ల మహాకవి రాబర్టు ఫ్రాస్టు. సాయంత్రం షికారు కొండల వేపు, గుహల వేపు, పంటపొలాల వేపు ఉంటుంది. ఎవ్వడు పట్టణం నడిబొడ్డుకు షకారుకెళ్లడు. వరదముంపుల గ్రామాలకు, అగ్నిదహన గృహాలవేపు షికార్లుకెళ్లడు. అక్కడ కనిపించిన నూత్నకంఠాలను, నూత్నధ్వనులను రికార్డు చెయ్యాలి. అందుకోసమే కొత్త ఛందస్సు తీసేసి పూర్తి వచన కవిత్వం రాస్తే అది ‘నెట్‌ లేని టెన్నిస్‌ ఆట’ వంటిది. కొట్టేవాడికి హుషారుగా ఉంటుంది. చూసేవాడికి అసహ్యంగా ఉంటుంది. అలాగని షికారుకు పర్వతశిఖరాలకు వెళ్లి అక్కడ నుంచి లోయలో పడిపోకుండా చూసుకోవాలి. ఊహామోహ అవరోహణ నీ సొంత విషయం కాదు. అది శ్రోతకు బదులీయాలి. అరెయీ భావం నేనెప్పుడూ వినలేదు. విన్నా మర్చిపోయానేమిటి అని పాఠకునికి అనిపించాలి. ఫ్రాస్ట్‌ను భ్రష్టు పట్టించాలని విమర్శకులు ‘అవునా షికారువంటిదా..కవిత.. అవునవును.. భార్యను షికారుకు తీసుకెళ్లటం వంటిదే. సాయంత్రం తీసుకెళతానని వాగ్దానం చేసే భర్తలు హఠాత్తుగా కొత్త పనుల్లో యిరుక్కుపోయామని చెబుతుంటారు! అంటూ విశ్లేషించారు. మరొక ఆంగ్ల మహాకవి టి.యస్‌.ఎలియట్‌ మరికొంత వివరిస్తూ ఏకకాలంలో జరిగే రెండు అనుభవాలకు, రెండు సంఘటనలకు కవి తన మానసిక స్థితి మేర అనుసంధానించుకుంటాడు. దానిని విశ్లేషించు కుంటాడు. ‘నువ్వు రాజయితే పేదలందరికీ ఉచితగృహం, ఉచితవైద్యం అందించ వచ్చు’… ముందుగా రాజుఅయినట్లు ఊహించుకోవాలి. అనంతరం ప్రజలకు సేవ చేసినట్లు ఊహించాలి. రాజు కాగానే పదిమంది అప్సరసలు చుట్టూచేరి ఆనందా లందిస్తారు. ఓహో అనుకోవచ్చును. తప్పులేదు. ఆ మానసికస్వేచ్ఛను శ్రోతలు పంచు కోవాలి. ఇది మంచిదే అని ఎంచుకోవాలి. లేకుంటే నీ భావానికి విలువ ఇవ్వడు. నీ కవితను గుర్తుంచుకోడు. ఒక్క క్షణం చిరునవ్వు నవ్వినా బుర్రలో లిఖించుకోడు. పైగా కవి ఆ భావాన్ని కలిగించి జిగిబిగిరూపురేఖల్ని కల్పించి తప్పుకోవాలి. తాను శ్రోతకు ఊతంగా ఎల్లవేళలా కదిలి రాకూడదు. తాను కల్పించిన స్వర్గం, ఊహించిన స్వప్నం పాఠకులకు నిత్యమై సత్యమై వెన్నాడుతుండాలి. ఎలియట్‌మహాకవికి సంస్కృత సాహిత్యంతో బాగా పరిచయం ఉంది. అందుచేత సంస్కృతంలోని పదలాలిత్యం. భాష..ఘోష.. అనుప్రాసలు.. ధ్వనులు..అవి మనసులో కల్పించే ప్రతిధ్వనులు బాగా ఎరిగినవాడు కావటం చేత కవిత్వానికి లయ, శబ్దహేష, ధ్వని ముఖ్యం అన్నాడు. అతి పురాతనమైన దాన్ని, అతి నూతనత్వాన్ని కలిపివేయాలి. ఒకే మానసిక స్థితిలోకి లాక్కురావాలి. షాజహను సింహాసనమూ, రaూన్సీలక్ష్మి ఎక్కిన గుర్రమూ, ఖడ్గతిక్కన పట్టిన కత్తీ, బాలచంద్రుడూ, బ్రహ్మనాయుడూ, కృష్ణరాయని కదనకౌశలమూ, రుద్రమ్మ భుజభక్తీ, తిక్కన్న పదయుక్తీ అన్నీ మిళితమైపోయి నూత్న చైతన్యం వేపు పరుగులు తీయాలి. లేకుంటే ఈవేళ గుర్రాలెక్కి యుద్ధాలు ఎవరిమీద చేయగలరు. తిక్కన్నలా ఏ భారతాన్ని అనువదించ గలవు. అయినా సరే నాటి మేళతాళాల ధ్వనులు నేటి కొత్త పరిస్థితులకు అన్వయింపబడాలి. అవి పాకకునిలో అపురూపమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఆనందము చైతన్యమవుతుంది. చైతన్యం నిన్ను పధగామిగా మారుస్తుంది.
ఆనందమే చివరిదశ అనుకున్నారు ప్రాచీనులు. అక్కడే వారితో కించిత్తు విభేదించారు ఆధునికులు. అందం ఆనందాన్ని, ఆనందం రసాన్ని, రసం శ్రోతల హృదయాల్లో ప్రవాహవేగాన్ని సృష్టిస్తాయి. శుభం. అంతటితో కథ ముగుస్తుంది అనుకున్నారు. అందుకు ఆనాడో కారణాలున్నాయి. నిశ్చలనం సంప్రదాయం. గత ప్రశస్తి, గత ప్రసక్తి, గత విషయాసక్తి ఎంత ఉంటే అంతటి మహాకవులనుకున్నారు. మన కదలికలో కొత్తఅడుగులు పడాలి.కొత్త పలుకులు వినపడాలి. విని మానవులు కొత్త చర్యలకు దిగబడాలి. అవి సమాజంలోని నిస్సహాయులకు, నిరుపేదలకు, నిర్భాగ్యులకు సాయపడాలి. అంతేకాని బలవంతులకూ, ధనవంతులకు ఆహారానంతర తాంబూలాలు కాకూడదు అన్నారు. ఎందుకంటే గతం అంతా కలంవీరులు అదే పనిచేశారు. (పాపం కలాలులేవులెండి..గంటాలూ తాటియా కులూను) వారు చిత్తశుద్ధితోనేచేశారు. కాదనలేం. కళ కంటే పరమావధి అనుకున్నారు. ఇక్కడిరకో విషయం చెప్పుకోవాలి. కళకు శ్రోతలూ, ప్రేక్షకులూ పెద్ద వారూ.. బలవంతులూను! శ్రోతల లోకంలో బలహీనులకు స్థానమే లేదు. వారికి ఆనందాలు వేరుగా ఉంటాయి. కనక నీవు వారికోసం తెలిసే మాటలతో, తెలుగైన మాటలతో, తెలివైన ఇతివృత్తాలతో చెప్పవలసిన అవసరంలేదు. ‘‘ప్రాచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లు పొంగార..పై అంచుల్‌ మ్రోవగకౌగిలించి, అధరం బాశింప..హాశ్రీహరీ అంచున్‌ తొలగండ్రో చెలతాంగి..’’ అంటూ ప్రవరాఖ్య వరూధినిల ‘లవ్‌సీను’ ప్రజలకుచేరవలసిన అవసరంలేదు. పెద్దన ఆడియన్సు అష్ట దిగ్గజాలు, కృష్ణరాయల మందీ` మార్బలమూను. వారి నవ్విస్తే చాలును. ప్రజలకు చెప్పవలసి వచ్చే సరికి ‘మాయాబజార్‌’ రచయిత పింగళి నాగేంద్రరావు ‘అహ నా పెళ్లంట..ఓహోనా పెళ్లంట..నీకు నాకు చెల్లంట..టాం..టాం..టాం..’అని రాశాడు. వేలు లక్షలమంది నోళ్లలో దశాబ్దాల తరబడినాట్యమాడిరది. పండితలోకం ముహం తిప్పుకున్నారంతే! అందరూ చార్మినార్‌నీ, తాజ్‌మహల్‌నీ, కుతుబ్‌మీనార్‌ని పొగిడి పొగిడి వదిలివారే! తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు..అని అడిగిన వారులేరు. అన్నట్లు అలనాటి రష్యా ప్రధాని కృశ్చేవ్‌ భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను చూసి ‘‘30వేల మంది కార్మికులు..శిల్పులు..30 సంవత్సరాలు నిద్రాహారాలు మాని కట్టారా..అయ్యయ్యో..వాళ్లంతటి శక్తినీ కలిపితే ఓ పెద్ద ప్రాజెక్టును నదిపై నిర్మిస్తే కోట్లాదిమందికి ఆకలి తీరేది గదా’ అన్నాడు, చుట్టూ ఉన్న భారత బృందం మౌనం వహించి ఆకాశం వంక చూశారు. దిల్లీ కెళ్లినప్పుడు అక్బరు కోటలోనికి ప్రవేశించి, షాజహాను పడకగదిని సందర్శించాం. అక్కడ నుండి తిన్నగా తాజ్‌మహల్‌ కన్పిస్తుంటుంది. ప్రక్కనే యమున ప్రవహిస్తుంటుంది. ‘‘పోన్లేవయ్యా..నీ ప్రియురాలు ముంతాజ్‌ పుణ్యమా అని మాకో చిరంతన సంతోష మందిరం యిచ్చిపోయావు’’ అనుకున్నాను! -వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img