Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

ఎలక్టొరల్‌ బాండ్స్‌ విరాళాల్లో 95 శాతం బీజేపీకే : అశోక్‌ గెహ్లాట్‌

రాజకీయ పార్టీలకు ఎలక్టొరల్‌ బాండ్స్‌ ద్వారా వస్తున్న విరాళాల్లో 95 శాతం కేవలం బీజేపీకే వెళ్తున్నాయని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. దాతలు భయంతో ఇతర పార్టీలకు నిధులను ఇవ్వడం లేదన్నారు. గుజరాత్‌ శాసన సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఆయన శనివారం సూరత్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అత్యధిక విరాళాలు బీజేపీకే వెళ్తున్నాయని చెప్తూ, కార్పొరేట్లను బీజేపీ బెదిరిస్తోందని, కాంగ్రెస్‌, తదితర పార్టీలకు విరాళాలు ఇవ్వకూడదని చెప్తోందనిఅన్నారు. బీజేపీకి తప్ప ఇతర రాజకీయ పార్టీలకు ఎవరైనా విరాళాలిస్తే, వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ విరాళ దాతల ఇళ్ల తలుపులు తట్టుతారని చెప్పారు. మన ప్రజాస్వామిక దేశంలో విరాళాలు సైతం ఒకే పార్టీకి వెళ్లిపోతున్నాయన్నారు. బీజేపీ పెద్ద ఎత్తున సొమ్మును పోగేసుకుందని, దాంతో దేశవ్యాప్తంగా ఫైవ్‌ స్టార్‌ పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటోందని మండిపడ్డారు. విరాళాల ద్వారా వచ్చిన సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వాలను మార్చుతోందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూలగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తమకు వ్యతిరేక వార్తలు రాకుండా డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్నది కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img