Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

యూపీలోని 9 జిల్లాల్లో 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 624 మంది అభ్యర్థులు
లక్నో: నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో, 59 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్‌ జరగనున్నది. ఈ దశకు సంబంధించి వేడిక్కెన ప్రచారం ఎట్టకేలకు సోమవారం ముగిసింది. చివరి నిమిషంలో రాజకీయ ప్రత్యర్థులు పోటాపోటీగా సవాళ్లు విసురుకున్నారు. ఈ నాలుగో దశ ఎన్నికలు ఫిబ్రవరి 23న జరగనుండగా, 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిలిభిట్‌, లఖింపూర్‌ఖేరీ, సీతాపూర్‌, హర్‌దోయ్‌, ఉన్నావ్‌, లక్నో, రాయ్‌బరేలీ, బాందా, ఫతేపూర్‌ జిల్లాల నుంచి 624 మంది అభ్యర్థులు అమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 59 స్థానాలకు గాను 51 గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు, బహుజన సమాజ్‌వాదీ పార్టీకి మూడు దక్కాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అప్నాదళ్‌ ఒక స్థానాన్ని దక్కించుకుంది. లఖింపూర్‌ఖేరీ…ఈ జిల్లా నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా కొన్ని నెలలుగా జాతీయ వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అక్టోబర్‌ 3న జరిగిన హింసలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మృతి చెందిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఈ నాలుగో దశలో జరగనున్నాయి. వీరంతా కాకుండా, లక్నో కంటోన్మెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఉత్తరర్రపదేశ్‌ న్యాయశాఖ మంత్రి బ్రిజేష్‌ పాఠక్‌కు, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికన సురేంద్ర సింగ్‌ గాంధీ గట్టి పోటీ ఇవ్వనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో లక్నో సెంట్రల్‌ స్థానాన్ని పాఠక్‌ గెలుచుకున్నారు. మరో మంత్రి అశుతోష్‌ టాండెన్‌ లక్నో తూర్పు నుంచి పోటీ చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అనురాగ్‌ భదూరియా ఆయనకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇక సరోజినీ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి రాజేశ్వర్‌ సింగ్‌ బీజేపీ తరపున నామినేషన్‌ దాఖలు చేయగా, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పనిచేసిన అభిషేక్‌ మిశ్రా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నితిన్‌ అగర్వాల్‌ ఈ నాలుగో దశ పోలింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్న రాయ్‌బరేలీలో కూడా ఇదే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న అదితి సింగ్‌ ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం పోలింగ్‌ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకూ జరగనున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img