Friday, May 3, 2024
Friday, May 3, 2024

అవినీతి మంత్రిని తొలగించాలి

కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర
అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు: మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను అరెస్ట్‌ చేయాలని, కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడిరచేందుకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలాతో పాటు అనేకమంది కాంగ్రెస్‌ నేతలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కాగా తమ డిమాండ్లు సాధించే వరకు విధానసౌధ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. అంతకు ముందు అవినీతి నిరోధక చట్టం కింద ఈశ్వరప్పను అరెస్టు చేయాలని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా అధ్వర్యాన వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు నగరంలో పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పోలీసుల బారికేడ్లను ఛేదించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సిద్ధరామయ్య, సూర్జేవాలాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ శివకుమార్‌, మాజీ మంత్రులు ఎంబీ పాటిల్‌, ప్రియాంక్‌ ఖర్గేలు కూడా అరెస్ట్‌ అయ్యారు.
రాజ్యాంగంపై దాడి
ఈ సందర్భంగా సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారన్నారు. అయితే ఈరోజు కర్ణాటకలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్నారు. ఈశ్వరప్పపై నమోదైన కేసును ప్రస్తావిస్తూ… రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కారని తెలిపారు. ఈశ్వరప్పపై ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్లు కేసు నమోదైన తర్వాత ఆయనను పదవిలో కొనసాగించేందుకు రాజ్యాంగంలోని ఏ నిబంధన అనుమతించిందని ప్రశ్నించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా ఎందుకు అడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైని అవినీతికి రక్షకుడని విమర్శించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్‌ ప్రభుత్వమని ఆరోపించారు. కాగా, సంతోష్‌ ఆత్మహత్య కేసు మిస్టరీగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. వర్క్‌ ఆర్డర్‌ లేకుండా, ఎస్టిమేషన్‌ లేకుండా నాలుగు కోట్ల రూపాయల విలువైన పనులను సివిల్‌ కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌కు ఎవరు అప్పగించారని కుమారస్వామి ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖలకు మంత్రిగా ఉన్న ఈశ్వరప్ప, బెలగావి జిల్లాలోని హిందాల్గా గ్రామానికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ సంతోష్‌ కె పాటిల్‌ ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021లో గ్రామోత్సవానికి ముందు జరిగిన ప్రజాపనులపై ఈశ్వరప్ప 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ… సదరు కాంట్రాక్టర్‌ మంగళవారం ఉడిపిలోని ఓ హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈశ్వరప్ప ఈ ఆరోపణలను ఖండిరచారు. కాంట్రాక్టర్‌ చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని చెబుతూ మంత్రి పదవినుంచి వైదొలిగేందుకు నిరాకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img