Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇది నాపై కక్షసాధింపు

మోదీని విమర్శించే పుస్తకం రాసినందుకే..: ఆకర్‌ పటేల్‌

న్యూదిల్లీ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చైర్‌పర్సన్‌, రచయిత ఆకర్‌ పటేల్‌ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చర్యలను తప్పుపట్టారు. తాను మోదీని విమర్శిస్తూ పుస్తకాన్ని రచించినందుకే కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తనను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే తన విదేశీ పర్యటనను అడ్డుకున్నారన్నారు. ఈనెల 6న బెంగళూరు విమానాశ్రయంలో సీబీఐ అధికారి పటేల్‌ను అడ్డుకుని దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదని, ఎగ్జిట్‌ కంట్రోల్‌ లిస్ట్‌లో పేరుందని ఉద్దేశపూర్వకంగానే చెప్పలేదన్నారు. దీనిపై పటేల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టిన సీబీఐ అధికారిపై చర్యల రూపేణ ఆయన వేతనంలో నుంచి తన విమాన టికెట్‌ ఖర్చు రూ.3.8లక్షలు మినహాయించాలని కోర్టును కోరారు. సీబీఐ తనకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని చెప్పారు. మోదీని విమర్శిస్తూ పుస్తకం రాసినందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని ‘దివైర్‌’కు ఇచ్చిన 20 నిమిషాల ఇంటర్వ్యూలో పటేల్‌ చెప్పారు. విమానాశ్రయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆయన మొదటిసారి మాట్లాడారు. ‘ది ప్రైజ్‌ ఆఫ్‌ ది మోదీ ఇయర్స్‌’ పుస్తకాన్ని రచించిన క్రమంలోనే తనను ఇబ్బంది పెడుతున్నారని పటేల్‌ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రధానిమంత్రిత్వాన్ని విమర్శిస్తూ పుస్తకాన్ని రాసానని చెప్పారు. 2021, డిసెంబరు 31న తన పేరిట లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయినట్లు బుధవారం తెలిసిందని పటేల్‌ తెలిపారు. నవంబరు 14న తన పుస్తకం ముద్రణ జరిగిందని, కచ్చితంగా ఆరు వారాల్లో లుకౌట్‌ జారీ అయిందని చెప్పారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషన్‌పై 2019 నవంబరులో అంటే రెండేళ్ల కిందట సీబీఐ దాడులు జరిపింది. 2020 నవంబరులో ఆయన చివరి సారిగా సీబీఐతో మాట్లాడారు. ఈ క్రమంలో తనను దేశం వీడకుండా చేసే చర్యల వెనుక ఉద్దేశం తనపై కక్షసాధింపు అని పటేల్‌ చెప్పారు. ‘తన పేరిట లుకౌట్‌ జారీకి ఆదేశాలిచ్చినది ఎవరన్నది వెల్లడిరచేందుకు గురువారం జరిగిన విచారణలో కోర్టుకు సీబీఐ తెలపలేదని, ఇది ఉమ్మడి నిర్ణయమని వాదించింది. దీనిని బట్టి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. బహుశ ఓ మంత్రి దీనిని సూచించి ఉండవచ్చు’ అని పటేల్‌ అన్నారు. సంబంధిత సీబీఐ అధికారి జీతంలో నుంచి తన విమాన టికెట్‌ ఖర్చు రూ.3.8లక్షలు వసూలు చేసి ఇవ్వాలని కోర్టును కోరినట్లు చెప్పారు. మరే అధికారి మితిమీరి ప్రవర్తించకుండా తాను ఈ డిమాండు చేశానన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు జర్నలిస్టులను అన్ని వేళలా వేధించాలని చూస్తాయన్నారు. వారి చెప్పుచేతల్లో ఉంచుకోవాలని.. కొన్ని అంశాలపై నోరు మెదపవద్దని కార్యకర్తలకు, జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు సంకేతాలిస్తాయని, మౌనంగా ఉంటే ఎలాంటి అపాయం ఉండదని పటేల్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img