Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు

రాజీనామాకు ససేమిరా…
మంగళూరు : ఉడిపిలో సివిల్‌ కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య కేసులో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్పపై ‘ఆత్మహత్యకు ప్రేరేపణ’ అభియోగాల కింద కేసు నమోదయింది. ఈ కేసులో ఈశ్వరప్పను మొదటి నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇంతకుముందు సీనియర్‌ మంత్రిపై లంచం ఆరోపణలు చేసిన సంతోష్‌ పాటిల్‌ సోదరుడు ప్రశాంత్‌ పాటిల్‌ ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. మంత్రి 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారంటూ తన సూసైడ్‌లో లేఖలో సంతోష్‌ పాటిల్‌ పేర్కొన్నాడు. ఈ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన అనుచరులు బసవరాజ్‌, రమేశ్‌ పేర్లను కూడా చేర్చారు. మంగళవారం ఉడిపిలోని ఒక లాడ్జిలో పాటిల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ అసలు ఏమి జరిగిందనే విషయంపై తాను ఈశ్వరప్పతో మాట్లాడానని, మంత్రిపై కేసు నమోదయిందని చెప్పారు. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను సీఎం ఆదేశించారు. 2020-21 సంవత్సరంలో హిండలగ గ్రామంలో రూ.4 కోట్లు విలువ చేసే పనులను తన సోదరుడు చేశాడని, ఆ పనులకు సొంత డబ్బులు ఖర్చు చేయగా, బిల్లులు పెండిరగ్‌లో ఉంచారని ఆయన తెలిపారు. సొమ్ములు విడుదల చేయాలని ఈశ్వరప్పను అనేకసార్లు సంతోష్‌ కలిసి విజ్ఞప్తి చేశారని, అయితే ఆయన అనుచరులు బసవరాజ్‌, రమేశ్‌ 40 శాతం కమిషన్‌ అడిగారని ప్రశాంత్‌ పాటిల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఏప్రిల్‌ 11న బెల్గాం నుంచి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు. మంగళవారం అతను ఉడిపిలో శవమై కనిపించాడు. పాటిల్‌ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి ఫోరెన్సిక్‌ బృందం చేరుకుని సాక్ష్యాలను పరిశీలించింది.
మంత్రి ఈశ్వరప్పను తొలగించాలి : కాంగ్రెస్‌ డిమాండ్‌
ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సైతం విమర్శలు చేశారు. ఈశ్వరప్పను గవర్నర్‌ తొలగించాలని, అతన్ని అరెస్టు చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. మంత్రిపై అవినీతి కేసు నమోదు చేయాలన్నారు.
రాజీనామా చేసే ప్రసక్తే లేదు : ఈశ్వరప్ప
కాంట్రాక్టర్‌ ఆత్మహత్య వ్యవహారంలో తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం ఎక్కడ నష్టం చేస్తుందోనని బీజేపీ భయపడుతున్నది. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఈశ్వరప్పతో రాజీనామా చేయించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. అయితే ఈశ్వరప్ప బుధవారం శివమొగ్గలో విలేకరులతో మాట్లాడుతూ ‘నా రాజీనామా ప్రశ్న అస్సలు తలెత్తదు. నా రాజీనామా కోసం ప్రతిపక్షాల డిమాండ్‌కు నేను తలొగ్గను’ అని అన్నారు. కాంట్రాక్టర్‌ సంతోష్‌ ఆత్మహత్య వెనుక ఏదో కుట్ర ఉన్నదని ఆరోపించారు. సూసైడ్‌ నోట్‌, మరణానికి ముందే ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులకు సందేశాలు పంపడాన్ని ప్రశ్నించారు. వాట్సాప్‌ సందేశాన్ని ‘డెత్‌ నోట్‌’గా ఎలా పరిగణిస్తారని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సందేశాన్ని ప్రస్తావిస్తూ దానిని ఎవరైనా టైప్‌ చేయవచ్చని అన్నారు. పాటిల్‌ మృతదేహం దగ్గర సంతకం లేదా వ్రాసిన ‘డెత్‌ నోట్‌’ను కనుగొనలేదని ఈశ్వరప్ప తెలిపారు. పాటిల్‌ తనకు తెలియదని పునరుద్ఘాటించిన మంత్రి, ఆయనకు బీజేపీతో సంబంధం కూడా లేదని అన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఉందని తెలిపేందుకు డాక్యుమెంటరీ సాక్ష్యాలను కూడా సమర్పించాలని మంత్రి పట్టుబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img