Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జుబైర్‌కు ఊరట…మధ్యంతర బెయిల్‌ పొడిగింపు

న్యూదిల్లీ: ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో మతపరమైన మనోభావాలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో జుబైర్‌పై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సుప్రీంకోర్టు మంగళవారం పొడిగించింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ జుబైర్‌ వేసిన పిటిషన్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలనిన్యాయమూర్తులు డివై చంద్రచూడ్‌, ఎఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజుకు సూచించింది.
ఈ కేసులో జుబైర్‌కు ఇప్పటికే బెయిల్‌ మంజూరైనందున, అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వడానికి ఆయన వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని రాజు చెప్పారు. కాగా సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఇప్పటికే మంగళవారం వరకు జుబైర్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయనున్న కౌంటర్‌ అఫిడవిట్‌కు కూడా తాము సమాధానం ఇవ్వాలనుకుంటున్నామని జుబైర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గోన్సాల్వేస్‌ తెలిపారు. కాగా నాలుగు వారాల్లోగా స్పందించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం…తుది విచారణను సెప్టెంబర్‌ 7కు వాయిదావేసింది. జుబైర్‌ తరపు నుంచి ఏదైనా రీజాయిండర్‌ దాఖలు చేయాల్సి వస్తే, ఆ తర్వాత రెండు వారాల్లోగా దాఖలు చేయాలని పేర్కొంది. అయితే మరో కేసులో దిల్లీ కోర్టు ఆదేశం మేరకు జుబైర్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నందున అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసిన ఉపశమనం ఎలాంటి ప్రభావం చూపదు. అటు దిల్లీ కోర్టు కూడా జుబైర్‌ 2018లో హిందూ దేవతకు వ్యతిరేకంగా అభ్యంతరకర ట్వీట్‌ను పోస్టు చేశారన్న కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జులై 14కు వాయిదా వేసింది. తన ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ జుబైర్‌ను జూన్‌ 27న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్‌`120 (నేరపూరిత కుట్ర), 201 (సాక్ష్యం లేకుండా చేయడం) తదితర సెక్షన్లను ప్రయోగించారు. కాగా ఈ కేసులో తన పోలీసు రిమాండ్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ జుబైర్‌ వేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు జూలై 1న దిల్లీ పోలీసుల నుండి స్పందన కోరింది. దీనిపై జులై 27న విచారణ జరపనుంది. ఇక జులై 8న, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో నమోదైన కేసులో జుబైర్‌కు సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జుబైర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టకుండా నిషేధించింది. ఎలక్ట్రానిక్‌ లేదా ఇతర సాక్ష్యాలను తారుమారు చేయకూడదని పేర్కొంది. తన మధ్యంతర బెయిల్‌ ఆదేశాలకు, దిల్లీలో జుబైర్‌పై నమోదైన ప్రత్యేక కేసుతో ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img