Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే

. సుప్రీం సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి
. నీట్‌, యూజీసీ`నెట్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసన

న్యూదిల్లీ: యూజీసీ`నెట్‌, నీట్‌ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పని తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కేంద్ర విద్యా శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. దేశ రాజధాని దిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, నాగాలాండ్‌, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ విభాగాలు రోడ్ల పైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్‌ నేతృత్వంలో ఇక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మధ్య దిల్లీలోని విద్యామంత్రిత్వ శాఖ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసం నుంచి వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలకు చెందిన రెండు డజన్ల మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో కాంగ్రెస్‌ మద్దతుదారులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. జమ్మూకశ్మీర్‌లో పీసీసీ అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వానీ అధ్వర్యంలో నిరసనకారులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ పాలనలో ఈ దేశంలోని విద్యార్థులు, యువతకు అన్యాయం జరుగుతోందని నినదించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కాంగ్రెస్‌ నిరసన చేపట్టింది. ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు స్వయంగా రోడ్లపైకి వచ్చారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్‌ ఠాకూర్‌ నేతృత్వంలో నిరసన ప్రదర్శన సాహిద్‌ చౌక్‌ నుంచి రాజ్‌ భవన్‌ వరకు సాగింది. రెండు కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత తీవ్రమైన సమస్యపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందని ఠాకూర్‌ విమర్శించారు. పరీక్షలు రద్దు చేయాలని, నేరానికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నీట్‌లో అక్రమాలపై హైదరాబాద్‌ యువజన కాంగ్రెస్‌ అధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. హైదరాబాద్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోతా రోహిత్‌ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నాటకలో ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ సభ్యులు బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్కు వద్ద నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
పంజాబ్‌లో కాంగ్రెస్‌ నిరసన
నీట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌ పంజాబ్‌ రాష్ట్ర విభాగం ఇక్కడ ప్రదర్శన నిర్వహించి, సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. లూథియానా ఎంపీ అయిన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ నిరసనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కొంతమంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు కొద్దిసేపు ఇక్కడ అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ నేత, ఎంపీ ధరమ్‌వీరా గాంధీ మాట్లాడుతూ ‘శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా మాకు అనుమతి లేదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపేందుకు వెళ్లాలనుకున్నాం. కానీ సెక్షన్‌ 144 కింద నిషేధ ఉత్తర్వులను ఉటంకిస్తూ, పోలీసులు మమ్మల్ని అదుపులోకి తీసుకుని అక్కడికి వెళ్లనివ్వలేదు’ అని చెప్పారు.
నాగాలాండ్‌లో…
నాగాలాండ్‌ రాజధానిలో కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఎన్‌టీఏపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు, బ్యానర్‌లతో ఇక్కడి కాంగ్రెస్‌ భవన్‌ వెలుపల గుమిగూడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతకాలం దేశ ప్రజలను మోసం చేస్తుందో అని నాగాలాండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ విభాగం కో-చైర్మన్‌ మెషెన్‌లో కథ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
భోపాల్‌లో కాంగ్రెస్‌ నిరసన
మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీతో కలిసి రోషన్‌పురా స్క్వేర్‌లో నిరసనకు నాయకత్వం వహించారు. బీజేపీ నేతృత్వంలోని పాలనలో ప్రతి నియామకంలోనూ అవినీతి చోటుచేసుకుంటోందని విమర్శించారు. ఎన్‌టీఏ చీఫ్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషి యూజీసీ`నెట్‌ను రద్దు చేశారని, అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) విషయంలో అడుగడుగునా అబద్ధాలు చెప్పారని సింగ్‌, పట్వారీ విమర్శించారు.
ప్రశ్నపత్రాల లీక్‌లకు నాడీ కేంద్రాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు
బీజేపీ, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు ప్రశ్నాపత్రాల లీకేజీలకు నాడీ కేంద్రంగా మారాయని, నీట్‌-యూజీ ఉదంతమే అందుకు తాజా ఉదాహరణ అని అసోం కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా విమర్శించారు. నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలపై ప్రదర్శనకు నేతృత్వం వహించిన సందర్భంగా బోరా ఈ ఆరోపణ చేశారు. లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అసోంతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తరచూ ప్రశ్నపత్రాల లీక్‌లు జరుగుతున్నట్లు స్పష్టమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షను సజావుగా నిర్వహించలేకపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ సభ్యులతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img