Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

‘భార్యల యుద్ధక్షేత్రం’ దేవణగెరె

కర్నాటకలోని దేవణగెరె లోక్‌సభ నియోజకవర్గం ‘భార్యల యుద్ధక్షేత్రం’గా మారింది. రెండు పెద్ద కుటుంబాల మధ్య పోరు సాగుతోంది. ఆ కుటుంబాల నుంచి ఇద్దరు మహిళలకు బీజేపీ, కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చాయి. శక్తిమంత నాయకుల భార్యలు బరిలో ఉండటంతో ఇక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. ఈ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినాగానీ దేవణగెరెకు తొలి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టిస్తారు. దేవణగెరె లోక్‌సభ నియోజకవర్గంలో 1977లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కాంగ్రెస్‌, బీజేపీ చెరో ఆరు సార్లు గెలిచాయి. తొలుత కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో 1996లో బీజేపీ మొదటిసారి గెలిచింది. 1998లో తిరిగి కాంగ్రెస్‌ గెలిచింది కానీ 1999లో ఓడిపోయింది. అప్పటి నుంచి బీజేపీ గెలుస్తూ వచ్చింది. మాజీ మంత్రి షామనూర్‌ శివశంకరప్ప, ప్రస్తుత ఎంపీ జీఎం సిద్ధేశ్వర్‌ కుటుంబాల మధ్య 1996 నుంచి భీకర పోరు సాగడం ఆనవాయితీ. రెండు కుటుంబాలు లింగాయత్‌ సదర్‌ (సాదు) వర్గానికి చెందినవి. సిద్ధేశ్వర్‌ తండ్రి మల్లికార్జునప్ప 1996లో బీజేపీ తరపున గెలిచారు. 1998లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన శివశంకరప్ప విజయం సాధించారు. 1999లో మల్లికార్జునప్ప గెలిచారు. తన తండ్రి మరణానంతరం సిద్ధేశ్వర్‌ 2004 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి శివశంకరప్ప కుమారుడు ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌పై విజయం సాధించారు. 2009, 2014లోనూ ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ సాగిందిగానీ మల్లికార్జున్‌ గెలిచారు. 2019లో 1,69,702 ఓట్లతో సిద్ధేశ్వర్‌ విజయం సాధించారు. ఈ కుటుంబాల మహిళలు ప్రస్తుతం బరిలో నిలిచారు. సిద్ధేశ్వర్‌ భార్య గాయత్రిని బీజేపీ నిలబెట్టింది. మల్లికార్జున్‌ భార్య ప్రభా మల్లికార్జున్‌ ఆమెకు ప్రత్యర్థిగా ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా పోటీ చేస్తున్నారు. వారిలో ఇద్దరు ముస్లింలు కాగా మరొకరు బీజేపీ అభ్యర్థి పేరును కలిగివున్నారు. ఈ అభ్యర్థి భర్త గతంలో సిద్ధేశ్వర్‌పై పోటీ చేశారు. రెండు శక్తిమంతమైన కుటుంబాలు, ప్రధాన పార్టీల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో క్రియాశీలంగా లేని ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరికి దెవనగెరే ప్రజలు పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img