Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఛత్రపూర్‌.. సీపీఐ కంచుకోట

16 ఎన్నికల్లో 8సార్లు అరుణపతాక రెపరెప
ఒడిశాలోని గంజాం జిల్లా ఛత్రపూర్‌ శాసనసభా నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట. 1951 నుంచి 2019 వరకు జరిగిన 16 ఎన్నికలలో 8సార్లు ఈ నియోజకవర్గంలో అరుణపతాకం రెపరెపలాడిరది. 1961, 1967, 1971, 1977, 1980, 1990, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. 1997 డిసెంబరు 26న రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఏర్పడినప్పటికీ 2014 ఎన్నికల వరకు ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో ఖాతా తెరవలేదు. 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే బీజేపీ ఈ నియోజకవర్గంలో గెలుపొందింది. 1951 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా, 1957, 1974, 1985, 1995 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికలను చూస్తే సీపీఐ అత్యధికంగా 8సార్లు, కాంగ్రెస్‌ నాలుగు సార్లు, బీజేడీ రెండు సార్లు, బీజేపీ, స్వతంత్రులు ఒక్కొక్క సారి చొప్పున విజయం సాధించారు. ఈ దఫా జరుగుతున్న ఎన్నికలలో సీపీఐ అభ్యర్థిగా ప్రముఖ కార్మికనాయకుడు, ప్రజల మనిషి గుర్నాధ్‌ ప్రథాన్‌ను బరిలో నిలిపింది. ఈ నెల 25వ తేదీన ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్మికులు, కర్షకులు, శ్రమజీవులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రథాన్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కంకి`కొడవలి గుర్తుపై ఓటువేసి ప్రజల కోసం పనిచేసే సీపీఐ అభ్యర్థినే ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారు.
1951లో జరిగిన శాసనసభా ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి వి. సీతారామయ్య విజయం సాధించారు. 1957 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిరాజ్‌ ప్రోహరాజ్‌ గెలుపొందారు. 1961, 1967, 1971 ఎన్నికలలో సీపీఐ అభ్యర్థి లక్ష్మణ్‌ మహాపాత్ర విజయదుందుబి మోగించారు. 1974, 1995 ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి దైత్రీ బెహరా, 1985లో అశోక్‌ కుమార్‌ చౌదరి, 2000లో బీజేపీ అభ్యర్థి రామచంద్ర పాండా, 2009లో సీపీఐ అభ్యర్థి అదికంద శేధి, 2014లో బీజేడీ అభ్యర్థి రామచంద్ర పాండా, 2019లో అదే పార్టీకి చెందిన సుభాశ్‌చంద్ర బెహరా ఎన్నికయ్యారు. దాదాపు దశబ్దకాలం తరువాత తిరిగి సీపీఐ అభ్యర్థి విజయం సాధించేందుకు ఇండియా కూటమి శ్రేణులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధితోనే ప్రజాసమస్యల పరిష్కారమవుతాయని నియోజకవర్గ ప్రజలు గమనించారు. కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, లేనప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని బేరీజు వేసుకుని ఈ దఫా సీపీఐ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు. ప్రముఖ కార్మికనాయకుడు అయిన ప్రథాన్‌కు నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్నది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ప్రచారం కోసం వెళుతున్న ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి ఈ ఎన్నికలలో తప్పక గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇండియా కూటమి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రథాన్‌కు ఓటువేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల అట, పాట, మాటతో గ్రామాలు హోరెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img