Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

రాజ్యసభకు వినేశ్‌ ఫొగాట్‌?

న్యూదిల్లీ : పారిస్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ పతకం సాధిస్తుందని గంపెడాశతో ఎదురుచూసిన భారతీయులకు ‘అనర్హత’ రూపంలో దిమ్మతిరిగింది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు దేశమంతా అండగా నిలిచింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడా ఒక అడుగు ముందుకు వేసి, ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేయాలన్నారు. ఆయన కుమారుడు దీపిందర్‌ సింగ్‌ హుడా కూడా ఇదే తరహాలో స్పందించారు. ‘ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఆట నుంచి వైదొలగాల్సి వచ్చినప్పటికీ… కోట్లాది మంది ప్రజల హృదయాలు గెల్చుకున్నారు. క్రీడా వ్యవస్థ ఓడిపోయింది. బంగారు పతక విజేతలకు ఇచ్చే సౌకర్యాలనే ఆమెకు కల్పించాలి. ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఆమే ఈ పదవికి తగిన వ్యక్తి’ అని దీపిందర్‌ హుడా అన్నారు. దీనిపై వినేశ్‌ పెదనాన్న మహవీర్‌ ఫొగాట్‌ స్పందించారు. ‘మరి భూపిందర్‌ సింగ్‌ హుడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గీతా ఫొగాట్‌ (మహవీర్‌ కుమార్తె)ను ఎందుకు రాజ్యసభకు పంపలేదు’ అని ప్రశ్నించారు. ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అనర్హతకు గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని పేర్కొంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన వినేశ్‌… అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురికావడం ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదిలా ఉంటే… రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు సోమవారం ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుది గడువు. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img